సాక్షి, కాకినాడ: రాజకీయ పార్టీలు, లేదా అభ్యర్థులు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రకటనలను ఇవ్వదలిస్తే మూడు రోజుల ముందుగా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ)కి తెలపాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నీతూప్రసాద్ పేర్కొన్నారు. కమిటీ అనుమతి పొందిన తరువాత మాత్రమే ప్రసారం అయిందోలేదో కమిటీ పరిశీలిస్తుందన్నారు. కలెక్టరేట్ కోర్టుహాల్లో మంగళవారం ఎంసీఎంసీ ద్వారా రాజకీయ పార్టీలకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు,ప్రచురణ కర్తలకు సంయుక్తంగా నిర్వహించిన అవగాహనా సమావేశంలో మాట్లాడారు. అలాగే ప్రింట్ మీడియాలో నగదు లేదా వస్తువుల చెల్లింపుల ద్వారా వచ్చే వార్తలు లేదా విశ్లేషణలపై ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వచించిన మేరకు పరిశీలన సాగుతుందన్నారు.
పార్లమెంటు నియోజకవర్గానికో కమిటీ
ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికీ ఒక ఎంసీఎంసీ కమిటీ వేయనున్నామన్నారు. ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయి బరిలో నిలిచిన అభ్యర్ధుల జాబితా ప్రకటించినప్పటినుంచి అన్ని చానెళ్లలో వచ్చే అనుమానిత చెల్లింపుల వార్తలపై కమిటీలు దృష్టిసారిస్తాయన్నారు. ఆయా మీడియా సంస్ధలకు అభ్యర్ధులు చెల్లింపు చేశారా లేదాన్న అంశంతో సంబంధం లేకుండా సంబంధిత వార్తకు డీఐపీఆర్,డీఏవీపీ రేట్లను పరిగణనలోకి తీసుకుని ఆ మొత్తం ఎంతో సంబంధిత ఆర్వోకు నివేదిస్తుందన్నారు. దీనిని అభ్యర్ధి ఖర్చు ఖాతాలో ఎందుకు చేర్చకూడదో 96 గంటలలోపు నోటీసు ఇస్తారన్నారు.
దానికి 48 గంటలలోపు జవాబు రాకుంటే కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. అనంతరం జరిగే ప్రక్రియలపై భారత ఎన్నికల సంఘం నిర్ణయమే తుది నిర్ణయంగా వుంటుందన్నారు. పెయిడ్ న్యూస్ ఐటంలకు సంబంధించి మాత్రం కమిటీలు మీడియా సంస్ధలకు గానీ రాజకీయ పార్టీలకు గానీ నోటీసులు ఇవ్వవని ఎన్నికల సంఘం పరిశీలించి పీసీఐ,ఎన్‌బీఏలకు తెలియజేస్తుందన్నారు. ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, చేతి బిల్లులు, ఇతర డాక్యుమెంట్లపై ప్రింటర్ పేరు, చిరునామా, ఫోన్‌నంబర్‌తో పాటు ఎన్ని కాపీలు ముద్రించినదీ పేర్కొనాలని, వీటిని ఉల్లంఘిస్తే కేసులు తప్పవని కలెక్టర్ నీతూ ప్రసాద్ హెచ్చరించారు.
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
రానున్న మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని మునిసిపాలిటీలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు,పోస్టల్ బ్యాలెట్లు పంపామని సాధారణ బ్యాలట్ పేపర్ల ముద్రణ పూర్తయిందని కలెక్టర్ నీతూప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌నుంచి రాష్ట్ర ఎన్నికల కమీషన ర్ రమాకాంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్‌సలో జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే మొదటి విడత శిక్షణా తరగతులు పూర్తి చేయడంతోపాటు రెండో విడతను ఈ నెల 27న నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల సిబ్బందిని విధులకు నియమించడంతో పాటు స్ట్రాంగ్ రూమ్‌లు,పోలింగ్,కౌటింగ్ సెంటర్లు గుర్తించడం వంటి పనులు పూర్తయ్యాయన్నారు.
ఇదిలా ఉండగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 4,500 బ్యాలెట్ బాక్సులు అవసరం కాగా 3,500 సిద్ధంగా ఉన్నాయని, ఇంకా వెయ్యి బాక్సులు కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కౌంటింగ్, పోలింగ్ సిబ్బందికి ఈ నెల 28న మొదటి విడత, ఏప్రిల్ 1న రెండవ విడత శిక్షణ ఇవ్వనున్నామన్నారు. 2,376 సెన్సిటీవ్, హైపర్‌సెన్సిటీవ్ కేంద్రాలను గుర్తించామన్నారు. ఇక్కడ మైక్రో అబ్జర్వులు, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీకి చర్యలు చేపట్టామన్నారు. ఎస్పీ విజయ్‌కుమార్ పాల్గొని మాట్లాడుతూ 4,359 ఆయుధాలు, రూ.3.92లక్షలు విలువ చేసే లిక్కర్, రూ.ఐదులక్షలు నగదు స్వాధీనంచేసుకోవడంతోపాటు 750 బెల్ట్‌షాపులు సీజ్ చేశామన్నారు. అర్బన్ ఎస్పీ రవికుమార్‌మూర్తి, మున్సిపల్ అధికారులు, డిపీవో శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రకటనలిస్తే చెప్పాలి
Published Wed, Mar 26 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM
Advertisement
Advertisement