
క్షేమంగా తీరానికి..
కొత్తపల్లి(తూర్పుగోదావరి జిల్లా): ఈ నెల16న ఏడుగురి సభ్యులతో వేటకెళ్లిన మత్య్సకారులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందించారు. అయితే, వీరిలో ఒకరు మృతి చెందగా, అతని శవాన్ని తీసుకొని వస్తున్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారులోని కొత్తపట్నం గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు ఒక బోటులో ఈ నెల16న వేట కెళ్లారు. అయితే, వీరు తుఫాన్‌లో చిక్కుకోవడంతో వీరి ఆచూకీ కోసం గాలించారు.
కాగా, సముద్రంలో వచ్చిన భారీ అలల తాకిడికి బోటు తెరచాప చినిగిపోయి, ఇంజన్ పాడైపోయినట్లు మత్స్యకారులు సమాచారం అందించారు. అయితే, సముద్ర అలల తాకిడికి గ్రామానికి చెందిన చక్కారావు సుర్యారావు అనే వ్యక్తి మరణించిన ట్లు సమాచారం. కాగా, బోటులో ఉన్న మిగిలిన ఆరుగురికి గాయాలైనట్లు వారు కుటుంబసభ్యులకు తెలిపారు. ఇంజన్ పాడవడంతో తెడ్ల సహాయంతో బోటును నడుపుకుంటూ వస్తున్నట్లు తెలిపారు. వారి వెంట ఉన్న మొబైల్ ఫోన్లకు సిగ్నల్ రావడంతో సమాచారం అందించారు. ప్రస్తుతం తీరానికి 80 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్నామని అర్ధరాత్రి సమయంలో పారదీప్ వద్ద తీరం చేరుకుంటామని మత్య్సకారులు తెలిపారు.