ఐఐటీల్లో రెండేళ్లలో 2461 డ్రాపవుట్లు | Five Central Instituted in AP gets Rs.1021Cr so far our of the total allocation of Rs. 3,562 | Sakshi
Sakshi News home page

ఐఐటీల్లో రెండేళ్లలో 2461 డ్రాపవుట్లు

Published Thu, Jul 25 2019 5:18 PM | Last Updated on Thu, Jul 25 2019 8:37 PM

Five Central Instituted in AP gets Rs.1021Cr so far our of the total allocation of Rs. 3,562 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అయిదు జాతీయ స్థాయి విద్యా సంస్థలకు శాశ్వత భవనాలు ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం మొత్తం 3,562 కోట్ల రూపాయలు కేటాయించగా ఇప్పటి వరకు 1021 కోట్లు విడుదల చేసినట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియల్‌ వెల్లడించారు. రాజ్య సభలో గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌ విభజన చట్టంలో పొందుపరచిన హామీలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌లోని తిరుపతిలో ఐఐటీ, తాడేపల్లి గూడెంలో ఎన్‌ఐటీ, కర్నూలులో ట్రిపుల్‌ ఐటీ, విశాఖపట్నంలో ఐఐఎం, తిరుపతిలో ఐఐఎస్‌ఈఆర్‌ సంస్థలను ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. ఈ అయిదు జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు కోసం మొత్తం 3,526 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు 1,688 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. మంజూరు చేసిన మొత్తంలో 1021 కోట్లు విడుదల చేయగా 776 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

ఈ అయిదు విద్యా సంస్థలతోపాటు అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్శిటీ, విజయనగరంలో సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. అనంతపురంలోని సెంట్రల్‌ యూనివర్శిటీ తొలి దశ నిర్మాణం కోసం 450 కోట్లు కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2018-19 సంవత్సరంలో 10 కోట్లు కేటాయించగా 8 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు. అలాగే విజయనగరంలో ఏర్పాటు చేస్తున్న సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ నిర్మాణం తొలి దశ కోసం 420 కోట్ల కేటాయింపుకు మంత్రివర్గం ఆమోదం తెలపగా అందులో 10 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇక తిరుపతిలోని ఐఐటీ శాశ్వత భవనాలు, ప్రాంగణం నిర్మాణం పనులు మార్చి 2020 నాటికి, తాడేపల్లిగూడెంలోని ఎన్‌ఐటీ క్యాంపస్‌ నిర్మాణ పనులు డిసెంబర్‌ 2020 నాటికి, కర్నూలులోని ట్రిపుల్‌ ఐటీ ఇప్పటికే శాశ్వత ప్రాంగణంలోకి మారగా విశాఖపట్నంలోని ఐఐఎం క్యాంపస్‌ నిర్మాణం జూన్‌ 2021 నాటికి, తిరుపతిలోని ఐఐఎస్‌ఈఆర్‌ నిర్మాణం డిసెంబర్‌ 20121 నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వివరించారు.

ఐఐటీల్లో రెండేళ్ళలో 2461 డ్రాపవుట్లు
దేశంలోని 23 ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో గడచిన రెండేళ్ళ వ్యవధిలో మొత్తం 2461 మంది విద్యార్ధులు చదువును మధ్యలోనే ఆపేసి (డ్రాపవుట్‌) వెళ్ళిపోయారని మానవ వనరుల మంత్రి  రాజ్యసభలో వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. అలాగే దేశంలోని 20 ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)ల్లో రెండేళ్ళలో డ్రాపవుట్‌ల సంఖ్య 99 మాత్రమే అని చెప్పారు.  ఐఐటీల్లో మొత్తం 2461 డ్రాపవుట్లలో 371 మంది షెడ్యూల్డు కులాలకు చెందిన విద్యార్ధులు, 199 మంది ఎస్టీలు, 601 మంది బీసీ విద్యార్ధులు ఉన్నారని మంత్రి తెలిపారు. 

డ్రాపవుట్లలో ఎక్కువ శాతం పోస్టు గ్రాడ్యుయేట్‌, పీహెచ్‌డీ విద్యార్ధులు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇతర కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్‌లకు మారడం, వ్యక్తిగత కారణాలు, విదేశాలలో ఉన్నత విద్యావకాశాలు లభించడం కారణాలు కావచ్చని మంత్రి తెలిపారు. ఇక అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులలో డ్రాపవుట్లకు కారణాలను విశ్లేషిస్తే తప్పుగా బ్రాంచ్‌ల ఎంపిక, అకడమిక్స్‌లో రాణించలేకపోవడం, వ్యక్తిగత, వైద్య సంబంధ కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయని అన్నారు. అకడమిక్స్‌లో వెనుకబడుతున్న విద్యార్ధులకు కౌన్సెలింగ్‌ చేయడానికి సలహాదారుల నియామకం, వారికి అదనంగా క్లాసులు నిర్వహించడం, వ్యక్తిగత, కుటుంబ సంబంధ సమస్యలకు కౌన్సిలింగ్‌, మానసికంగా ధృఢంగా తయారు చేయడానికి సైకలాజికల్‌ మోటివేషన్‌ కోసం ప్రతి ఐఐటీలో ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.

అటవీ భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించాలి
అడవుల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీలకు ఆ భూములపై హక్కులు కల్పించేలా అటవీ హక్కుల చట్టాన్ని సవరించాలని విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘గిరిజనులకు చారిత్రకంగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దే ఉద్దేశంతో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం అమలులోకి వచ్చి 13 ఏళ్ళు కావస్తున్నా దానిని సక్రమంగా అమలు చేయడంలో అనేక వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా అటవీ భూములపై గిరిజనుల న్యాయమైన హక్కులు తిరస్కరణకు గురవుతున్నాయి. అటవీ హక్కుల చట్టం స్పూర్తికి విరుద్దంగా సాగుతున్న ఈ చర్యలు తీవ్ర గర్హనీయం అన్నారు. తాము సాగు చేసుకుంటున్న అటవీ భూములపై హక్కులు కల్పించవలసిందిగా కోరుతూ ఆదివాసీలు, గిరిజనలు సమర్పించిన దరఖాస్తులను కుంటి సాకులు చెప్పి గ్రామ సభ, సబ్‌ డివిజినల్ కమిటీ, జిల్లా స్థాయి కమిటీలు తిరస్కరిస్తున్నాయి. ఆ విధంగా తిరస్కరణకు గురైన దరఖాస్తులు లక్షల సంఖ్యకు చేరుకోవడం శోచనీయం’ అని అన్నారు. 

‘దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది ఆదివాసీలు ఉంటే అందులో 45 లక్షల మంది తాము సాగు చేస్తున్న అటవీ భూములపై హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో కేవలం 17 లక్షల దరఖాస్తులను మాత్రమే ఆమోదించగా మిగిలినవి తిరస్కరణకు గురయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తుల తిరస్కరణ అటవీ హక్కుల చట్టం ఉద్దేశాలనే నీరుగార్చేలా ఉంది. కొన్ని రాష్ట్రాలలో యధేచ్చగా అటవీ హక్కుల చట్టం ఉల్లంఘనలు జరిగినట్లుగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2015 జూలై 17న రాసిన లేఖలోనే స్పష్టం చేసింది.  అటవీ భూములపై హక్కుల కోసం దరఖాస్తు చేసే గిరిజనలు, ఆదివాసీలు తాము గడచిన 75 ఏళ్ళుగా లేదా మూడు తరాలుగా అడవుల్లోనే నివసిస్తున్నట్లు రుజువు సమర్పిస్తే సరిపోతుంది.

అంతేగానీ ఆ భూములను సాగు చేస్తున్నట్లుగా రుజువు సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ అటవీ శాఖాధికారులు మాత్రం భూములు సాగు చేస్తున్నట్లుగా రుజువులు సమర్పించాలని పట్టుబడుతూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. అటవీ భూములపై హక్కులు పొందలేకపోయిన ఆదివాసీలు, గిరిజనులను అడవుల నుంచి ఖాళీ చేయించాలని గత ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతే లక్షలాది గిరిజనుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. సుప్రీం కోర్టు ఆదేశాలపై స్టే విధించినప్పటికీ గిరిజనుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించడం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగి తిరస్కరణకు గురైన గిరిజనుల హక్కులను పరిరక్షించేలా చట్ట సవరణ చేయాలని’  విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement