కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా), న్యూస్‌లైన్/సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల ముఖ్య నేతలు ఐదుగురిపై ఉందని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. శనివారం కళ్యాణదుర్గంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమైక్య రాష్ట్రం కోసం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పోరాడాలన్నారు.
ఈ ఐదుగురు కలిసి కృషి చేస్తే రాష్ట్రం విడిపోదనే నమ్మకం తనకుందన్నారు. గతంలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. లేఖను ఉపసంహరించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విషయంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఎం పార్టీల అధినేతలు, ఆయా పార్టీల శాసనసభ, మండలి పక్ష నేతలతో మాట్లాడాలంటూ రఘువీరారెడ్డి సీఎం, పీసీసీ చీఫ్‌లకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఈ పార్టీల నేతలందర్నీ సోమవారం ఢిల్లీకి తీసుకెళ్లి.. ప్రధాని, వివిధ పార్టీల జాతీయ అధ్యక్షులను కలిసి విభజనను నిలిపివేయాల్సిందిగా అభ్యర్థిస్తే ఫలితముంటుందని పేర్కొన్నారు.