సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణపై శివారు ఎమ్మెల్యేలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆయన వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శాసనసభ్యులు తాడోపేడో తేల్చుకునేందుకు ఢిల్లీ బాట పట్టారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి ‘సర్వే’కు మరోసారి టికెట్ ఇవ్వవద్దనే డిమాండ్‌తో పార్టీ పెద్దలను కలవాలని నిర్ణయించారు.
మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని ఐదుగురు శాసనసభ్యులు సర్వే సత్యనారాయణపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు హస్తిన వెళుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అపాయింట్‌మెంట్‌ను కోరుతూ లేఖ రాశారు. మాజీ మంత్రి శంకర్రావు సహా ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బండారి రాజిరెడ్డి, ఆకుల రాజేందర్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఈ మేరకు డిగ్గీరాజాకు సంయుక్తంగా లేఖ రాశారు. అధికారికంగా దిగ్విజయ్ అపాయింట్‌మెంట్ ఖరారు కానప్పటికీ, ఆయనకు అందుబాటులో ఉండేందుకు ఎమ్మెల్యేలు శంకర్రావు, రాజిరెడ్డి ఇప్పటికే అక్కడ మకాం వేశారు.
మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, ఆకుల రాజేందర్ కూడా శుక్రవారం రాత్రి దేశ రాజధానికి పయనమయ్యారు. కాగా, రంగారెడ్డి జిల్లాలో పార్టీ వ్యవహారాలు, మల్కాజిగిరి పార్లమెంటరీ సీటు పరిధిలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పార్టీ పరిస్థితిని తమతో చర్చిస్తామని లేఖలో పేర్కొన్నప్పటికీ, కేంద్ర మంత్రి సర్వేపై ఫిర్యాదు చేసే అంశమే ప్రధానంగా కనిపిస్తోంది. కొన్నాళ్లుగా సర్వేపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఎమ్మెల్యేలు... ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కు ఈ సారి లోక్‌సభ టికెట్ రాకుండా ప్రయత్నించాలనే నిర్ణయానికి వచ్చారు.
అవినీతి, గ్రూపు రాజకీయాలను కేంద్ర మంత్రి ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యేలు కొంతకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. స్థానికంగా ఆయనపై ఉన్న వ్యతిరేకత కూడా తమ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతుందనే భయం వీరిలో నెలకొంది.
‘సర్వే’పై శివారు ఎమ్మెల్యేల శివాలు
Published Fri, Jan 24 2014 11:12 PM | Last Updated on Mon, Oct 8 2018 8:52 PM
Advertisement
Advertisement