ఆగ్రహ జ్వాలలు
ప్రత్యేక హోదాపై ప్రధాని ప్రకటన చేయకపోవడంపై వెల్లువెత్తున నిరసనలు
పలుచోట్ల దిష్టిబొమ్మ దహనాలు, ర్యాలీలు, రాస్తారోకోలు
వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు
విజయవాడ : నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై, ఇచ్చే ప్యాకేజీపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై జిల్లా వాసుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధాని వచ్చి వెళ్లి 24 గంటలు తిరగక ముందే ప్రజలు నిరసనలకు దిగారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇప్పటివరకు ప్రత్యేక హోదాపై అసంతృప్తితో ఉన్న జిల్లా వాసులు రోడ్డెక్కి నినదిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రా ప్రాంతానికి కాంగ్రెస్ అన్యాయం చేస్తే, ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ రాష్ట్రాన్ని నట్టేట ముంచుతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడలో వినూత్న నిరసన...
విజయవాడ ప్రకాష్‌నగర్‌లో సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో నల్ల బెలూన్లు ఎగురవేశారు. ఒక కార్యకర్తకు బురద పూసి స్నానం చేయించి వినూత్న నిరసన చేశారు. కృష్ణలంక ఫైర్ స్టేషన్ వద్ద సీపీఎం రాజధాని ప్రాంత కన్వీనర్ సీహెచ్ బాబూరావు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాధ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై గంటసేపు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులకు, నేతలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. సాయంత్రం సీపీఐ కార్యవర్గ సభ్యుడు సంగుల పేరయ్య ఆధ్వర్యంలో కృష్ణలంకలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం జరిగింది. కాలుతున్న దిష్టిబొమ్మను లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా పక్కన నిలబడిన వ్యక్తిపై పడి స్వల్పంగా గాయాలయ్యాయి. న్యూ ఇండియా హోటల్ సెంటర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్ వద్ద మోదీ దిష్టిబొమ్మను దహనం కార్యక్రమం చేపట్టారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో రాజ్‌టవర్స్ వద్ద, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో నున్న సెంటర్లో, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని...
కైకలూరులో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అవనిగడ్డలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సింహాద్రి రమేష్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.నరసింహారావు పాల్గొన్నారు. తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, ఏకొండూరు మండల కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు నిరసన ప్రదర్శనలు, ధర్నా నిర్వహించారు. గన్నవరంలో వామపక్ష పార్టీలు వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేయగా, సీపీఐ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తిరువూరు బోసు సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, విస్సన్నపేట సెంటర్లో సీపీఎం నాయకులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. గుడివాడలో ప్రత్యేక హోదా కోసం వామపక్ష నేతలు ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలియచేశారు. చల్లపల్లిలో సీపీఎం నేతలు రాస్తారోకో చేసి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులు ప్రజల్ని మోసగిస్తున్నారని ఆరోపించారు. పెనమలూరు, ఉయ్యూరు, కలిదిండి, నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరులో సీపీఎం నేతలు నిరసన ర్యాలీలు నిర్వహించారు. జగ్గయ్యపేటలో సీపీఐ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు.