
కాలేజిలో ఫుడ్ పాయిజనింగ్.. 200 మందికి అస్వస్థత
కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని గూడవల్లిలో ఉన్న ఓ కార్పొరేట్ కళాశాలలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి సుమారు 200 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 10 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కాలేజి హాస్టల్లో రెండు రోజుల క్రితం మాంసాహారం వండారు. అది తిన్నప్పటి నుంచి పిల్లలకు వాంతులు కావడం మొదలైంది.
అయితే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా తెలియనివ్వకుండా హాస్టల్లోనే చికిత్స చేయించారు. చాలామంది కోలుకున్నా, సుమారు పది మంది మాత్రం కోలుకోలేకపోవడంతో వాళ్లను కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ విషయమై అటు కాలేజి వర్గాలు గానీ, ఇటు ఆస్పత్రి వర్గాలు గానీ పెదవి విప్పడంలేదు. ఇదేమీ లేదని.. చిన్న విషయమేనని పెద్దగా పట్టించుకోవక్కర్లేదని మాత్రమే చెబుతున్నారు.