మండలంలోని కాపవరం శివారు పెరిశేపల్లిలో పద్మావతి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరి గింది.
= స్వామి నగలు భద్రం
= అర్చకునికి చెందిన 9 కాసుల బంగారం, రూ.10 వేల నగదు మాయం
= రూ. 2.45 లక్షల విలువైన సొమ్ము అపహరణ
పామర్రు, న్యూస్‌లైన్ : మండలంలోని కాపవరం శివారు పెరిశేపల్లిలో పద్మావతి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరి గింది. అయితో స్వామి నగలు భద్రంగా ఉండగా, అర్చకుడికి చెందిన రూ.2.45 లక్షల విలువైన సొత్తు అపహరణకు గురైంది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు... వెంకటేశ్వరస్వామి ఆలయ అర్చకుడు చలమచర్ల శ్రీమన్నారాయణాచార్యులు సోమవారం రాత్రి పూజలు ముగించుకుని 8 గంటల సమయంలో గుడికి తాళం వేసి ఇంటికి వెళ్లి పోయారు.
ధనుర్మాసం కావడంతో మంగళవారం తెల్లవారుజామునే ఆల యానికి వచ్చిచూసేసరికి తలుపులకు ఉన్న ఏడు తాళాలను బద్దలుగొట్టి, గొళ్లాలు విరగగొట్టి ఉన్నాయి. దక్షిణంవైపు తలుపు తీసి ఉండటంతో ఆయన వెంటనే ఆలయ ధర్మకర్త చెరుకూరి వెంకటరత్న గిరిబాబుకి విషయం తెలిపారు. దీంతో గిరిబాబు, గ్రామస్తులు ఆలయం వద్దకుచేరుకున్నారు.
సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు పోయివుంటాయని భావించిన వారు తలుపులను తాకకుండా, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆలయంలోనికి వెళ్లి చూడగా స్వామివారి ఆభరణాలు యథాతథంగా ఉన్నాయి. స్వామి లాకర్ కూడా భద్రంగానే ఉంది. గర్భగుడిలోని బీరువాలో భద్రపరిచిన అర్చకులకు చెందిన 6 కాసుల గొలుసు, 3 కాసుల మరో గొలుసు సహా రూ.2.25 లక్షల విలువైన వస్తువులు, రూ.10 వేల నగదు కనిపించలేదు.
డాగ్ స్క్యాడ్, క్లూస్‌టీమ్ పరిశీలన
ఘటనాస్థలాన్ని డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీమ్ పరిశీలించాయి. పోలీసు జాగిలం ఆలయంలోని దక్షిణ పక్కన ఉన్న గోడ వెంబడి గ్రామంలోని పసుమర్రు డొంక రోడ్డు వద్దకు వెళ్లి అక్కడ ఉన్న పాత కోళ్ల ఫారం వద్ద ఆగిపోయింది. ఆ ప్రాంతంలో రెండు వారాలుగా వలస కూలీలు ఉంటున్నారు. సోమవారం రాత్రే వారు తమ ఖాళీ చేసి వెళ్లి పోయారు. వారే చోరీచేసి ఉంటారని భావిస్తున్నారు. పామర్రు సీఐ శ్రీనివాసయాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఏఎస్‌ఐ ఏసుపాదం, హెచ్‌సీ అయ్యన్న, మాజీ ఎంపీపీ జి.లక్ష్మీదాసు ఘటనాస్థలాన్ని సందర్శించారు.