నగరంలోని బృందావన్ కాలనీలో నివసించే పద్మావతి గత ఏడాది జనవరిలో రక్తపోటు కారణంగా ఆకస్మికంగా బ్రెయిన్‌డెత్‌కు గురయ్యారు.
లబ్బీపేట : నగరంలోని బృందావన్ కాలనీలో నివసించే పద్మావతి గత ఏడాది జనవరిలో రక్తపోటు కారణంగా ఆకస్మికంగా బ్రెయిన్‌డెత్‌కు గురయ్యారు. చికిత్స కోసం నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు ఆరోగ్య పరిస్థితిని వివరించి ప్రాణాలు కాపాడే అవకాశాలు నూరుశాతం లేవని తేల్చి చెప్పారు. దీంతో స్వచ్ఛంద సంస్థల కృషితో ఆమె భర్త తేజోమూర్తి అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. పద్మావతిని వెంటిలేటర్‌పైనే ఉంచి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించి అవయవాలు సేకరించారు.
ఆమె నుంచి సేకరించిన గుండె, లివర్, ఊపిరితిత్తులను హైదరాబాద్‌లోని వేర్వేరు ఆస్పత్రులకు పంపించగా, ఒక కిడ్నీని జిల్లాలోని వణుకూరు గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడికి అమర్చారు. అదే విధంగా మరో కిడ్నీని గుంటూరు జిల్లాలోని 18 ఏళ్ల యువతికి అమర్చారు. తన భార్య ఇక లేదన్న బాధతో ఉండి కూడా ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరికి పునర్జన్మ ఇచ్చేందుకు ముందకొచ్చిన తేజోమూర్తి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.