- వంట నూనెలకు డాలర్ సెగ
- పప్పులకు పన్నుల పొగ
తాడేపల్లిగూడెం : నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. వంట నూనెలకు డాలర్ సెగ తగిలింది. పన్ను విధింపుతో పప్పుల ధరలకు రెక్కలొచ్చాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో 10 కిలోల సన్‌ఫ్లవర్ నూనె ధర రూ.660 ఉండగా, డాలర్ దెబ్బతో రూ.745కు చేరుకుంది. పామాయిల్ ధర 10 కిలోలు రూ.510 నుంచి రూ.525కు చేరుకుంది. కాటన్ సీడ్ ఆయిల్ ధర పరుగు పెడుతోంది. కొత్త పంట దెబ్బతినడంతో మార్కెట్‌లో వేరుశనగ నూనె ధరలకు రెక్కలు వచ్చాయి. 10 కిలోల కాటన్ సీడ్ ఆయిల్ ధర రూ.590నుంచి రూ.630కి పెరిగింది. పచ్చళ్ల సీజన్ మొదలు కాగా, కర్నూలు, తాడిపత్రి, ఆదోని ప్రాంతాల నుంచి అవసరమైన స్థాయిలో వేరుశనగ నూనె రావడం లేదు. వచ్చిన నూనెలో నాణ్యత పడిపోయింది. ఈ నూనె ధర 10 కిలోలు రూ.970కి చేరుకుంది. రైస్‌బ్రాన్ ఆయిల్ మాత్రం 10 కిలోలు రూ.610 వద్ద స్థిరంగా ఉంది. హోల్‌సేల్ మార్కెట్‌లో ఈ ధరలు పలుకుతుండగా, వీటికి రవాణా ఖర్చులు, వ్యాపారుల లాభం శాతాన్ని కలుపుకుని స్థానిక పరిస్థితుల ఆధారంగా రిటైల్ మార్కెట్‌లో ఈ ధరలు మరింత ఎక్కువగానే ఉన్నాయి. ఒక్కసారిగా నూనెల ధరలు పెరగడంతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
పన్నుల పొగ
పప్పుల ధరలకు పన్నులు పొగ పెడుతున్నాయి. నిత్యం సామాన్యులు ఉపయోగించే కందిపప్పు ధర చుక్కలను చూపిస్తోంది. రిటైల్ మార్కెట్‌లో కిలోకు రూ.15 పెరిగింది. కందిపప్పు ఇక్కడి మార్కెట్లకు ఎక్కువగా మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వస్తోంది. ఇప్పటివరకూ జీరో శాతం ట్యాక్స్‌తో పప్పులు ఇక్కడకు మార్కెట్లకు వచ్చేవి. ఇప్పుడు పన్నులు విధించడంతో ఆ భారం ధరలపై పడింది. దీంతో రిటైల్ మార్కెట్లలో కందిపప్పు ధర ఒక్కసారిగా పెరిగింది. గతంలో గుత్త మార్కెట్‌లో కిలో కందిపప్పు ధర రూ.90 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.105కు చేరుకుంది. రిటైల్‌గా మార్కెట్‌లో కిలో రూ.120కు విక్రయిస్తున్నారు. మినపప్పు కూడా అదే బాటలో పయనిస్తోంది. కిలో రూ.70 నుంచి రూ.75 రూపాయలకు గుత్త మార్కెట్‌లో దొరికే మినపప్పు రూ.92కు చేరుకుంది. శనగపప్పు మాత్రం గుత్త మార్కెట్‌లో కిలో రూ.65 వద్ద స్థిరంగా ఉంది.
ధరదడలు
Published Sat, May 16 2015 4:59 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM
Advertisement