
పదవి కోసం హత్యాయత్నం
గురజాల : పదవి ఎంతటి నీచానికైనా దిగజారుస్తుందనటానికి బుధవారం గురజాల మండలంలో జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. మార్కెట్ యార్డు డెరైక్టర్ పదవి కోసం తనతో పోటీపడుతున్న వ్యక్తిని అడ్డుతొలగించుకోవాలన్న దుర్బుద్ధి హత్యాయత్నానికి ఉసిగొల్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుర జాల మండలం గంగవరం గ్రామానికి చలవాది గురువులును పిడుగురాళ్ల మార్కెట్ యార్డు డెరైక్టర్‌గా ప్రతిపాదిస్తూ ఒక పత్రికలో వార్త వెలువడింది.
దీంతో పార్టీలో ఎన్నో ఏళ్లుగా తిరుగుతున్న తనకు మార్కెట్‌యార్డు డెరైక్టర్ పదవి దక్కదనే అక్కసుతో గురువులును పదవి నుంచి తప్పించాలని ఆశావహులు పథకం పన్నారు. అనుమానం రాకుండా కొద్ది రోజుల నుంచి అతడితో స్నేహం నటించారు. బుధవారం మధ్యాహ్నం గురువులు పొలంలో పురుగుమందు పిచికారీ చేసి ఇంటికి వెళ్లాడు. విషయం గ్రహించిన గ్రామస్తుడు ఓబయ్య మరో ఇద్దరితో కలిసి అతడి ఇంటికి వెళ్లాడు. వేట కొడవళ్లతో గురువులుపై కిరాతకంగా దాడి చేశారు.
బాధితుడి తల్లి రాములమ్మ కేకలు వేయడంతో పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు 108 వాహనంలో గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. గురువులు భార్య వెంకటరావమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చీమకు కూడా హాని తలపెట్టని తన కొడుకుపై దాడి చేసేందుకు చేతులెలా వచ్చాయంటూ వైద్యశాల వద్ద తల్లి రాములమ్మ విలపించింది.
నిందితుల వేటలో పోలీసులు.. గురువులును వేట కోడవళ్లతో నరికి, పరారైన నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. వారు పులిపాడు మీదుగా ఆటోలో మిర్యాలగూడ వైపు వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో క్లూస్‌టీంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.