ఏ ప్రయోజనం ఆశించి విభజిస్తున్నారు?
కేంద్రం నుంచి వచ్చిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎండగట్టారు. అసలది బిల్లా.. ముసాయిదానా ఏంటన్నది స్పష్టతే లేదని అన్నారు. శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై జరిగిన చర్చలో మళ్లీ సీఎం కిరణ్ సుదీర్ఘంగా మాట్లాడారు. ''అసెంబ్లీకి పంపిన బిల్లులో సవాలక్ష లోపాలున్నాయి. రాష్ట్రపంతి పంపినదాన్ని బిల్లు అన్నారు. దీన్నే హోం శాఖ అధికారులు ముసాయిదా అంటున్నారు. రాష్ట్రపతికి ముసాయిదా బిల్లు ఎలా పంపుతారు? హోం శాఖ కార్యదర్శి సరైన సమాచారం ఇవ్వలేదు. అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని మాకు వెల్లడించలేదు. అడిగిన సమాచారం ఇవ్వకుండా సమాధానం దటేశారు. విభజన బిల్లు పట్ల నెహ్రూ అభిప్రాయాన్ని పాటించడంలేదు. తప్పుల తడక బిల్లును మేం ఎలా చూడాలి?'' అని అడిగారు.
''ఏ ప్రయోజనం ఆశించి ఈ విభజన చేస్తున్నారు? కేంద్రం ఈ బిల్లులో అభిప్రాయాలేమీ చెప్పలేదు. ఈ బిల్లుపై మేమెలా అభిప్రాయాలు చెప్పాలి'' అని సీఎం అడిగారు. ఆర్టికల్ 371డిని ఉదహరిస్తూ, ఓపెన్ కేటగిరీ ప్రకారం అయితే తెలంగాణ వాళ్లకు సీట్లెలా వస్తాయని ప్రశ్నించారు. వెనకబడిన ప్రాంతాలను విశాల దృక్పథంతో అభివృద్ధి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా విభజన మంచిది కాదని, తెలంగాణ సమస్య ఒక్క రాష్ట్రానికి సబంధించినది కాదని, నీళ్ల విషయంలో కేంద్రం పెత్తనం ఉంటుందని ఆయన చెప్పారు. ఇన్ని సమస్యలున్న విభజన బిల్లు అసలు అవసరమా అని ప్రశ్నించారు.