
జగన్ సమీక్షలకు చురుకుగా ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఈ నెల 24, 25 తేదీల్లో ఒంగోలులో జరగనున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహనరెడ్డి పర్యటన ఏర్పాట్లను పార్టీ నేతలు పర్యవేక్షించారు. ఒంగోలులోని బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో రెండు రోజులపాటు పార్టీని బలోపేతం చేసేందుకు ఆయా నియోజకవర్గ నేతలతో జగన్ సమీక్షించనున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి శనివారం మండపంలో ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్భంగా తలశిల రఘురామ్ మాట్లాడుతూ సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకల్లా పార్టీ అధ్యక్షులు జగన్‌మోహనరెడ్డి ఒంగోలు చేరుకుంటారన్నారు. మొదటి రోజు నెల్లూరు, బాపట్ల పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలను సమీక్షిస్తారని, రెండో రోజు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలను సమీక్షిస్తారన్నారు. దీని కోసం వచ్చే నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, నగర అధ్యక్షులు కుప్పం ప్రసాద్, పార్టీ నేతలు వై. వెంకటేశ్వరరావు, విజయశంకరరెడ్డి, రంగారెడ్డి, వడ్లమూడి నానీ, ఎస్‌కె షాజహాన్, డేవిడ్, సోమశేఖర్, బీమేష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఒంగోలుకు బాలినేని
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉదయం సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలు చేరుకుంటారు. సోమ, మంగళవారాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించనున్నారు.