అటవీశాఖ కనిగిరి రేంజ్‌ని ఇంటిదొంగల సమస్య వేధిస్తోంది. ఈ సమస్య చాలాకాలంగా ఉన్నప్పటికీ ఇంటిదొంగలను పట్టుకుని శిక్షించడంలో ఆ శాఖాధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
కనిగిరి, న్యూస్‌లైన్ : అటవీశాఖ కనిగిరి రేంజ్‌ని ఇంటిదొంగల సమస్య వేధిస్తోంది. ఈ సమస్య చాలాకాలంగా ఉన్నప్పటికీ ఇంటిదొంగలను పట్టుకుని శిక్షించడంలో ఆ శాఖాధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు సైతం మౌనంగా ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ అందరూ కుమ్మక్కై స్మగ్లర్లకంటే దారుణంగా అటవీ సంపదను కొల్లగొడుతున్నారేమోనన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
అటవీశాఖ కనిగిరి రేంజ్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను కనిగిరిలోని ఆ శాఖ కార్యాలయానికి తరలించారు. అయితే, వాటిలో సుమారు 10 లక్షల రూపాయల విలువైన 135 ఎర్రచందనం దుంగలు 2012 జూలై 5వ తేదీ చోరీకి గురయ్యాయి. ఆ శాఖలో పనిచేస్తున్న వారే ఇంటిదొంగలుగా మారి వాటిని కాజేశారనేది బహిరంగ రహస్యమైనప్పటికీ ఆ కేసును ఛేదించకుండా అధికారులు కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో 2013 ఆగస్టులో సీఎస్ పురం మండలంలోని ఓ ఫారెస్ట్ అధికారి ఇంట్లో అక్రమంగా దాచిఉంచిన 25 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి.
ఈ సంఘటనపై చేపట్టిన విచారణ ఏమైందో కూడా నేటికీ ఎవరికీ తెలియదు. ఇదిలా ఉండగా, పీసీ పల్లి మండలంలో అటవీ శాఖాధికారులే పొగాకు బ్యారన్ల నిర్వాహకులకు అటవీ కర్రను అమ్ముకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కనిగిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అధికారులు, సిబ్బంది ఎవరిస్థాయిలో వారు అటవీ సంపదను ఇలా దోపిడీ చేస్తున్నప్పటికీ వారిపై చర్యలు తీసుకునే వారు లేకుండాపోయారు.
రెండేళ్లుగా కనిపించని పురోగతి...
కనిగిరి అటవీశాఖ కార్యాలయంలో 10 లక్షల రూపాయల విలువైన 135 ఎర్రచందనం దుంగల చోరీ కేసులో రెండేళ్లుగా పురోగతి కనిపించడం లేదు. 2012 జూలై 5వ తేదీ చోరీ జరిగింది. వచ్చే నెల 5వ తేదీకి రెండేళ్లు పూర్తవుతుంది. అయినప్పటికీ నేటికీ ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. చోరీ జరిగిన సమయంలో పోలీసు జాగిలాలను తెప్పించి దర్యాప్తు చేపట్టి హడావిడి చేసిన అధికారులు..అనంతరం పట్టించుకోవడం మానేశారు. కేవలం వాచ్‌మన్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. డీఎఫ్‌వో స్థాయి అధికారి స్వయంగా విచారణ చేపట్టినా ఫలితం కనిపించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చోరీకి పాల్పడింది ఇంటిదొంగలేనని పోలీసు అధికారులు నిర్ధారించుకున్నారు. ఆ శాఖలోని ఓ ఉన్నతాధికారికి, కిందిస్థాయి సిబ్బందికి వాటాల పంపిణీలో తేడా రావడంతో రెండు వర్గాలుగా విడిపోయి ఒక వర్గానికి చెందిన వారు ఈ చోరీకి పాల్పడినట్లు సమాచారం. పోలీసు జాగిలం ద్వారా దర్యాప్తులో వెలుగుచూసిన అనేక అంశాలు కూడా ఇందుకు బలంగా మారాయి. అయితే, ఈ కేసును ఛేదించకుండా పక్కనపెట్టడంతో ఆ శాఖలోని అధికారుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ అడవి తల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సిన అటవీ శాఖాధికారులు తమ విధులను విస్మరించడంతో పాటు ఇంటిదొంగలుగా మారి స్మగ్లర్లకంటే దారుణంగా వ్యవహరించడం, ఇందులో ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉండటం పలు విమర్శలకు తావిస్తోంది.
పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు : వెంకట్రావు, కనిగిరి ఫారెస్ట్ రేంజర్
కనిగిరి ఫారెస్ట్ కార్యాలయంలో ఎర్రచందనం దుంగల చోరీ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ చేసింది ఇంటిదొంగలా..బయటివారా..? అనేది వారే తేల్చాల్సి ఉంది. ఈ కేసు విచారణకు సంబంధించి పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లూ లేవు. సిబ్బంది అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటాం.