
సాక్షి, తూర్పుగోదావరి : గత కొద్ది రోజులుగా జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నచిరుత పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ముమ్మిడివరం మండలం బలుసు లంకలో ఉన్న పులిని ట్రాంక్వలైజర్ ప్రయోగించి అధికారులు మత్తులోకి దించారు. మత్తులో పడిన చిరుతను అటవీ అధికారులు బోనులో బంధించి తరలిస్తున్నారు. అనేకసార్లు ప్రయోగించినా కుదరని ట్రాంక్వలైజర్ ఈసారి సక్సెస్ కావడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. (చేతికి చిక్కినట్లే చిక్కి పారిపోయిన చిరుత)
కొబ్బరి తోటలో ప్రత్యక్షం..
పట్టుబడిన చిరుత ఈ నెల 4వ తేదీన అంకంపాలెం గ్రామంలో బీభత్సం సృష్టించింది. నలుగురిని గాయపరిచి చెట్టుపైకి చేరింది. అక్కడ నుంచి పరారై ముమ్మడివరం మండలం గేదెల్లంక గ్రామంలోని ఓ కొబ్బరి తోటలో ప్రత్యక్షమైంది. ట్రాంక్వలైజర్‌ను ప్రయోగించి పులిని పట్టుకునేందుకు అధికారులు యత్నించగా...అది బెడిసి కొట్టింది. మత్తుమందు పనిచేయకపోవడంతో చిరుత తప్పించుకుంది. అటవీ అధికారులు చిరుతను బంధిస్తుండగా ఒక్కసారిగా గాండ్రించి అక్కడి నుంచి పారిపోయింది. చివరికి బలుసు లంకలో పట్టుబడింది. (తూర్పుగోదావరిని వణికిస్తున్న చిరుతపులి)