- గిరిజనుల సంక్షేమానికి పోరాడుతా: ఎమ్మెల్యే ఈశ్వరి
చింతపల్లి: గిరిజన హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే ప్రాణాలు ఒడ్డి పోరాడుతామని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. జర్రెలలో గురువారం గిరిజనులకు అటవీ హక్కుల చట్టం కింద భూమి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులుఆర్‌ఓఎఫ్ భూములకు పట్టాలు పంపిణీకి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ఆయన మరణాంతరం మన్యంలో బాక్సైట్ ఖనిజాన్ని తవ్వుకుపోయేందుకు కుట్రలో భాగంగానే పట్టాల పంపిణీ నిలిచిపోయిందన్నారు.
దీనిపై గిరిజనులు, తమ పార్టీ నేతల పోరాటాల ఫలితంగా ఈ రోజు బాక్సైట్ నిక్షేపాలు ఉన్న ప్రాంతాల్లో భూములకు పట్టాలు పంపిణీకి ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాల వల్ల గిరిజనుల బతుకులు ఛిద్రమవుతాయనే తాము చేపడుతున్న వ్యతిరేక ఉద్యమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గిరిజనుల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టినా తాను సహించబోనని, అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేత జగన్ ఆధ్వర్యంలో వ్యతిరేకించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత కొన్నేళ్ళుగా జర్రెల ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం వల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ప్రధానంగా రహదారి అధ్వానంగా ఉండటంతో వాహనాల రాకపోకలకు సమస్యగా ఉందని, ఇప్పుడు ఘాట్‌రోడ్డులో సీసీ ర్యాంపు నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. మొండిగెడ్డ వరకు ఆర్టీసీ బస్సులను నడిపేందుకు సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు చేపడుతామన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గిరిజన కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇప్పించేలా తాను డిమాండ్ చేస్తున్నానని, గాయపడ్డ వారికి కూడా రూ.25 వేలు అందజేసేలా అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళానన్నారు.
తన ఒత్తిడి మేరకు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు గ్రావిటీ పథకాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆమె తెలిపారు. మొదటి విడతగా 91 మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నామని, రెండవ విడతలో మరో 106 మందికి పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జీకేవీధి, చింతపల్లి జెడ్పీటీసీలు గంటా నళిని, కె.పద్మకుమారి, తహశీల్దార్ చిరంజీవి పడాల్, ఆర్‌డబ్ల్యుఎస్ జేఈ భగవత్, జర్రెల సర్పంచ్ ఎ.విజయకుమారి, జర్రెల, మొండిగెడ్డ ఎంపీటీసీలు జగ్గమ్మ, తెల్లన్నదొర, వైసీపీ నాయకులు ఎ.వి.మూర్తి, రవి, గంగాధర్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ పాల్గొన్నారు.