బొత్సే టార్గెట్ ? | Former Minister botsa Satyanarayana is target | Sakshi
Sakshi News home page

బొత్సే టార్గెట్ ?

Published Sat, Nov 29 2014 4:21 AM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM

బొత్సే టార్గెట్ ? - Sakshi

బొత్సే టార్గెట్ ?

* అందుకే రావివలస సొసైటీ డొంకలాగుతున్న టీడీపీ నేతలు
* ఇదే తరహాలో జిల్లా వ్యాప్తంగా అక్రమాలు జరిగినట్టు ఫోకస్ చేయనున్న దేశం తమ్ముళ్లు
* అసెంబ్లీలో ప్రస్తావన తెచ్చేందుకు
* ఇదో వ్యూహాత్మక ఎత్తుగడ అంటున్న పరిశీలకులు చంద్రబాబుతో కమిటీ
* వేయించి బొత్సపై కేసులు పెట్టే యోచన?

సాక్షి ప్రతినిధి, విజయనగరం : పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను టీడీపీ నేతలు టార్గెట్ చేసినట్టు సమాచారం. లిక్కర్ కేసుతో లక్ష్యం నెరవేరకపోవడంతో డీసీసీబీ(జిల్లా కేంద్ర సహకార బ్యాంకు)పై దృష్టి సారించారని తెలిసింది. డీసీసీబీ పరిధిలో జరిగిన అక్రమాల్ని బయటపెట్టి తద్వారా బొత్సపై కసి తీర్చుకోవచ్చని యోచిస్తున్నట్టు భోగట్టా. ఈమేరకు ఎప్పటినుంచో ఉన్న బినామీ రుణాల ఆరోపణలను తెరపైకి తీసుకొస్తున్నారు. అందుకు శాంపిల్‌గా గరుగుబిల్లి మండలం రావివలస ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘంలో బినామీ రుణాల వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు.

ఇదే తరహాలో జిల్లా వ్యాప్తంగా సొసైటీల్లో బినామీల ముసుగులో కో ట్లాది రూపాయలు కాజేశారన్న ఆరోపణలు చేయనున్నారు. దీన్ని అసెంబ్లీలో ప్రస్తావనకు తెచ్చి, సీఎం చంద్రబాబునాయుడుతో డీసీసీబీ అక్రమాలపై విచారణ జరిపేందుకు కమిటీ వేయించి, తద్వారా బొత్సను ఇరికించవచ్చని భావిస్తున్నారని తెలిసింది. పీసీసీ అధ్యక్షుడు హోదా వరకు ఎదిగిన బొత్స సత్యనారాయణ తన రాజకీయ ప్రస్థానం  గాజులరేగ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకారం నుంచే ప్రారంభించారు. ఆ సొసైటీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికై 1992 నుంచి 1995 వరకు మూడు సంవత్సరాల పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) చైర్మన్‌గా పనిచేశారు.

1995లో కూడా రెండోసారి డీసీసీబీ చైర్మన్‌గా పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న ఏకైక డీసీసీబీ చైర్మన్ పోస్టు కూడా ఇదే. అయితే, ఆ  సమయంలో డీసీసీబీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని టీడీపీ, వామపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. ముఖ్యంగా బినామీల పేరుతో డీసీసీబీ పరిధిలోని పీఏసీఎస్‌ల నుంచి బొత్స కుటుంబీకులు, వారి అనుచరులు  పెద్ద ఎత్తున  రుణాలు తీసుకున్నారని, అందుకే మొండి బకాయిలు ఎక్కువగా ఉండిపోయాయని అప్పట్లో విమర్శలొచ్చాయి. ఆరోపణలు ఎన్ని వచ్చినా అవేవీ నిర్ధారణ కాలేదు. ఆరోపణల గ్రాఫ్ ఎక్కువవుతున్న  కొద్దీ రాజకీయంగా బొత్స ఎదుగుతూ వచ్చారు.

ఒకసారి ఎంపీగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, పదేళ్ల కాలం మంత్రిగా పనిచేశారు. పీసీసీ అధ్యక్షునిగా నియమితులై తిరుగులేని రాజకీయ నేతగా ఎదిగారు.  ఈ నేపథ్యంలోనే  బొత్సను లిక్కర్ వివాదం చుట్టు ముట్టింది. లిక్కర్ సిండికేట్‌ను నిర్వహించి కోట్లు ఆర్జించారని పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. దానిపై ఏసీబీ విచారణ కూడా జరిగింది. అయితే,  బొత్స అప్రతిష్ట పాలయ్యారే తప్ప కేసుల బారిన పడలేదు. దీనివెనుక అనేక కారణాలున్నాయని సమాచారం. ఇంతలోనే ఎన్నికలు రావడం, అక్రమాలు, రాష్ట్ర విభజన ఆరోపణల నేపథ్యంలో ఓటమి పాలయ్యారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులంతా ఓడిపోయారు. దీంతో చక్రం తిప్పిన నేత జీరో అయ్యారు.
 
బీజేపీలో చేరుతారనే ..?
కొత్త ప్రభుత్వాలొచ్చిన కొన్నాళ్లకు బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు తెరపైకొచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన అనుచరులు బీజేపీలోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఇందుకూరి రఘురాజు, ముద్దాడ మధు ఆ పార్టీలో చేరారు. క్రమేపి పార్టీలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది.   టీడీపీకి ఈ పరిణామాలు మింగుడు పడడం లేదు. ఒకవేళ బొత్స బీజేపీలో చేరితే తమకు ఇబ్బందులెదురవుతాయని భావిస్తున్నారు. మిత్రపక్షంగా అజమాయిషీ చెలాయిస్తారేమోనని గుబులు చెందుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే బొత్సను మరింత బదనాం చేయాలని, ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తిని తీసుకుంటే పార్టీకే నష్టమే అన్న అభిప్రాయాన్ని బీజేపీ నేతల్లో తీసుకు రావాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది.

ఇందులో భాగంగా  బినామీ రుణాల వ్యవహారాన్ని బయటికి తీసుకొస్తే తమ లక్ష్యం నెరవేరుతుందన్న యోచనలో ఉన్నట్టు తెలియవచ్చింది. ఇన్నాళ్లూ అధికారంలో లేకపోవడంతో అంతర్గతంగా  ఏం జరిగిందో తెలియక ఏం చేయలేకపోయామని, ఇప్పుడు అధికారులు చెప్పినట్టు వింటారని, మొత్తం రికార్డులన్నీ బయటికి తీసి లోగుట్టు బయటపెట్టాలని భావిస్తున్నారు. డీసీసీబీలో పనిచేస్తున్న ఒకరిద్దరు అధికారులు గతంలో కాంగ్రెస్‌లో ఉన్న నేతలకు బంధువులు కావడం, ఇప్పుడదే నేతలు టీడీపీలో చేరడంతో సదరు అధికారుల ద్వారానే  ఎప్పటికప్పుడు రికార్డులు తెప్పించుకోవచ్చని భావనతో ఉన్నట్టు సమాచారం. ఈ విధంగానో , మరే మార్గమో ద్వారా  తెలియదు గాని వచ్చిన సమాచారంతో  రావివలస సొసైటీలో చోటు చేసుకున్న బినామీ రుణాల వ్యవహరాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు తెలిసింది.
 
రావివలసనే ఎందుకు ఎంచుకున్నారంటే...
ఒకప్పుడు డీసీసీబీ చైర్మన్‌గా పనిచేసి, దివంగతులైన మరిశర్ల సింహాచలంనాయుడు బొత్సకు ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. అప్పట్లోనే బినామీ రుణాల ఆరోపణలొచ్చాయి. సింహాచలంనాయుడు మరణించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో  ఆయన భార్య తులసీ డీసీసీబీ చైర్మన్ అయ్యారు.  ఈమె రావివలస పీఏసీఎస్ అధ్యక్షురాలు హోదాతో డీసీసీబీ చైర్మన్ అయ్యారు. ఈమె కాలంలో బినామీ పేర్లతో రుణాలు  ఇచ్చారన్న   విమర్శలొచ్చాయి. అయితే, ఇప్పుడా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడొకరు జిల్లాలో కీలక పదవి చేపడుతున్న ఓ మహిళ భర్త. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో చరుకుగా ఉన్నారు.

అక్కడ జరుగుతున్న విషయాలను ఆయనే వెలుగులోకి తెచ్చారు. దీంతో  మీడియాకు ఎక్కాయి. కాగా బినామీ రుణ బాధితులగా చెప్పుకుంటున్న కొందర్ని జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి టీడీపీ నాయకులే ప్రెస్‌మీట్లు పెట్టిస్తున్నారు. వాళ్లకయ్యే ఖర్చులన్నీ  వారే భరిస్తున్నారు. ఇక్కడ వ్యవహారంపై నిగ్గు తేల్చితే  డీసీసీబీ చైర్మన్ భయపడి వాస్తవాలు భయటపెడతారని వారి ఎత్తుగడ. తద్వారా బొత్సను లక్ష్యంగా చేసుకోవచ్చని భావిస్తున్నట్టు తెలిసింది.రావివలస విషయాన్ని ముందుపెట్టి ఇదే తరహాలో జిల్లా వ్యాప్తంగా జరిగిందంటూ  అసెంబ్లీలో ప్రస్తావించాలని కూటమిగా ఏర్పడ్డ  ఇద్దరు ఎమ్మెల్యేలు, మరికొందరు నేతలు  పథక రచన చేసినట్టు తెలిసింది.

చంద్రబాబు చేత కమిటీ వేయించి,  విచారణ చేపడితే వాస్తవాలు బయటికి వస్తాయని, తద్వారా బొత్స దొరుకుతారని అభిప్రాయపడుతున్నారు. అయితే, తిలాపాపం-తలా పిడికెడు అన్నట్టుగా బినామీ రుణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారని తెలిసింది.  ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన నేతలపై కూడా   ఆరోపణలు ఉన్నాయి.
 
ఆ కారణంగానే రావివలస సొసైటీ బినామీ రుణాల విషయంలో కొందరు ఎమ్మెల్యేలు కనీసం నోరెత్తడం లేదు. ఎటెళ్లి ఎటొస్తుందోనని భయంతో మాట్లాడటం లేదు. ఇంతవరకు పార్వతీపురం డివిజన్ నేతలు దీనిపై కనీసం స్పందించలేదు. ప్రతీదానికి అశోక్ బంగ్లాకొచ్చి గొంతు చించుకునే నేతలు ఈ విషయంలో ఆ జోలికే పోవడం లేదు.  ఈ కారణంగానే గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు ఒక కూటమి  సారధిగా వ్యవహరిస్తూ తరుచూ ప్రెస్‌మీట్‌లు పెడుతున్నారని సమారాం. అసెంబ్లీలో ప్రస్తావిస్తామంటూ చెప్పుకొస్తున్నారు. అయితే, పథకం ప్రకారం సక్సెస్ అవుతారో లేదంటే తెరవెనుక లాలూచీతో వెనక్కి తగ్గుతారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement