కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వర్షాలతో రైతుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఖరీఫ్ లో సమృద్ధిగా వర్షాలు పడినందున ఆశించిన పంట దిగుబడులు వచ్చే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో అవే వర్షాలు చేతికొచ్చిన పంటను మట్టిపాలు చేస్తాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంతోపాటు పలుచోట్ల కురిసిన వర్షం రైతన్నలను కలవరపాటుకు గురిచేసింది.
కరీంనగర్, జగిత్యాల, హుస్నాబాద్ మార్కెట్ యార్డులతోపాటు పలుచోట్ల వరిధాన్యం, మక్కలు తడిసిపోయాయి. కరీంనగర్ మార్కెట్ యార్డులో సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షం రైతులను ఉరుకులు పెట్టించింది. మబ్బులు కమ్ముకున్నప్పుడే టార్ఫాలిన్లు కప్పడం, తక్కువ మొత్తంలో ధాన్యం ఉండడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. జిల్లాలో 25 మార్కెట్ యార్డులుండగా, ప్రస్తుతం తొమ్మిది ప్రధాన మార్కెట్లలో పత్తి, మక్కలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరందుకుంటున్నాయి. వరికోతలు ముమ్మరం కావడంతో ధాన్యాన్ని రైతులు మార్కెట్ యార్డులకు తీసుకువస్తున్నారు.
తేమ ఎక్కువగా ఉందంటూ వ్యాపారులు మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో పండించిన 6లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. 573 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించినప్పటికీ పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. కొందరుప్రధాన మార్కెట్ యార్డులకు ఉత్పత్తులను తీసుకువస్తున్నారు. మార్కెట్ యార్డులతోపాటు కొనుగోలు కేంద్రాలలో కనీస వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆరంభంలో మార్కెట్ యార్డులకు ధాన్యం తక్కువగా వస్తున్నప్పటికీ మరికొద్ది రోజుల్లో వరిధాన్యం ఒక్కసారిగా పెద్దమొత్తంలో వచ్చే అవకాశముంది. ఇప్పుడే కొనుగోలు చేస్తున్న ధాన్యం ఎగుమతికి నోచుకోకపోవడంతో ధాన్యం ఎక్కడికక్కడే పేరుకుపోనుంది. ఈ క్రమంలో అవసరం మేరకు టార్ఫాలిన్లు లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికే తడిసిపోతున్నాయి. దీంతో రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మద్దతు ధరకన్నా తక్కువే..
సోమ, మంగళవారాల్లో కరీంనగర్ మార్కెట్‌యార్డుకు 350 క్వింటాళ్ల ధాన్యం వచ్చింది. వ్యాపారులు గ్రేడ్‌లు, తేమ సాకుతో మద్దతు ధరకంటే తక్కువగా రూ.1210-1310 వరకు కొనుగోలు చేశారు. పీఏసీఎస్ ద్వారా 49 క్వింటాళ్లు మాత్రమే మద్దతు ధరకు కొనుగోలు చేశారు. మక్కలు 600 క్వింటాళ్లు రాగా రూ.1090-1230 వరకు మద్దతు ధరకంటే తక్కువగా చెల్లించారు. పత్తి సోమవారం 1900 క్వింటాళ్లు, మంగళవారం 1011 క్వింటాళ్లు రాగా రూ.3700-4500 వరకు కొనుగోలు చేశారు.
కొనుగోళ్లు ప్రారంభమై రెండు రోజులైనప్పటికీ కరీంనగర్ మార్కెట్ యార్డులో ప్రభుత్వపరంగా కొనుగోళ్లు ఊపందుకోలేదు. ఈ విషయమై మార్కెటింగ్ శాఖ ఏడీ పద్మావతి మాట్లాడుతూ.. ఇప్పుడు మార్కెట్‌కు వస్తున్న వరిధాన్యం పచ్చిగా ఉంటోందని, తేమ శాతం అధికంగా ఉండడంతో పీఏసీఎస్ వారు ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని, మొదటి రోజు మాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించిన 49 క్వింటాళ్లు కొన్నారని తెలిపారు.
వర్షార్పణం
Published Wed, Oct 23 2013 3:26 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement
Advertisement