‘ముసురు’కుంది
ఎడతెరిపిలేని వాన
- తూర్పున కుండపోత
- అత్యధికంగా మంథనిలో 19, రామగుండంలో 15.2 సెంటీమీటర్ల వర్షం
- సగటున 4.6 సెంటీమీటర్లు
- పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
- కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం
- 20 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
కరీంనగర్ అగ్రికల్చర్ : రాయికల్ నుంచి కోరుట్లకు వెళ్లే మైతాపూర్ గ్రామ శివారులో ఉన్న రోడ్‌డ్యాంపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మంథని డివిజన్ లో వరద నీటితో వాగులు, వంకలు ఉప్పొంగడంతో 20 గ్రామాలకు రవాణా స్తంభించింది. మంథనిలోని పద్మశాలి వీధిలో ఇళ్లలోకి నీరు చేరింది. బొగ్గులవాగు, బొక్కలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పంటపొలాలు నీట మునిగాయి. ప్రమాదపుటంచున చెరువులు ఉన్నా యి. మహాముత్తారం మండలంలోని లోతట్టు గ్రామాలైన కనుకునూర్, రెడ్డిపల్లి గ్రామాలు రెండురోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
కాటారం మండలంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చిద్నెపల్లివద్ద గల చిద్నెపల్లి వాగు, పోతులవాయి వద్ద గల బొర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఆయా గ్రామాలకు నాలుగుగంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. యైటింక్లయిన్‌కాలనీలో ఆర్జీ-3 పరిధిలోని ఓసీపీ-3 ప్రాజెక్టులో ఆదివారం 250 హెచ్‌పీ పంపు, డ్రిల్‌యంత్రం నీటిలో మునిగిపోయాయి. మహదేవ్‌పూర్, కాళేశ్వరం వద్ద గోదావరి నది నీటిమట్టం 10.550 అడుగుల వద్ద ఉంది. అది పెరిగే అవకాశముంది.
ఈ సీజన్ ఇదే అధికం
జిల్లా అంతటా ముసురుకున్న వానతో చెరువులు, కుంటలు జలసిరి సంతరించుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా సగటున 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాకాలం మొదలై నాలుగు నెలలు కాగా ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఈ సీజన్‌లో ఇప్పటిరకు 712.7మిల్లీమీటర్లకుగాను 508.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇప్పటికీ 29 శాతం లోటు వర్షపాతమే ఉంది. 11 మండలాలు సాధారణ వర్షపాతానికి చేరుకోగా.. 46 మండలాల్లో లోటు వర్షం ఉంది. జిల్లాలో రెండు రోజుల నుంచి అత్యధికంగా మంథని, పెద్దపల్లి డివిజన్‌లో భారీవర్షాలు కురిశాయి.
అత్యధికంగా మంథనిలో 19.0, రామగుండంలో 15.2 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. మంథని డివిజన్‌లో సగటున 12.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై సాధారణ వర్షపాతానికి చేరుకుంది. పెద్దపల్లి డివిజన్‌లో సగటున 7.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జగిత్యాల డివిజన్‌లో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కరీంనగర్, హుజూరాబాద్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలోని 11 మండలాలు(మహదేవపూర్, మంథని, కమాన్‌పూర్, కాటారం, జూలపల్లి, పెద్దపల్లి, మెట్‌పల్లి, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, చొప్పదండి, హుస్నాబాద్) సాధారణ వర్షపాతానికి చేరున్నాయి.