రికార్డులు మార్చి.. ఏమార్చి! | Formers Lands Are Occupied In PSR Nellore District | Sakshi
Sakshi News home page

రికార్డులు మార్చి.. ఏమార్చి!

Published Sat, Aug 10 2019 12:30 PM | Last Updated on Sat, Aug 10 2019 12:32 PM

Formers Lands Are Occupied In PSR Nellore District - Sakshi

దగదర్తి మండలం దామవరం వద్ద ఎయిర్‌పోర్టు కోసం సేకరించిన భూమి

అంతర్జాతీయ విమానాశయ్రం పేరుతో టీడీపీ నేతలు భూదందాకు పాల్పడ్డారు. రూ.కోట్లు గడించారు. నిర్మాణానికి సంబంధించి గత ఐదేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. కానీ దీనిని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. అధికారులను పావులుగా ఉపయోగించుకుని వలస వెళ్లిన వారి భూములను కాజేశారు. రికార్డులను తారు మారు చేశారు. భూములు కోల్పోయిన వారికి ఇచ్చిన పరిహారాన్ని సైతం స్వాహా చేశారు. టీడీపీ నేతల భూ, ధన దాహానికి సహకరించిన రెవెన్యూ అధికారులు సస్పెండ్‌ కూడా అయ్యారు. 

సాక్షి, కావలి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో అంతర్జాతీయ విమానాశ్రయానికి బీజాలు పడ్డాయి. కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం దామవరం వద్ద నిర్మించ తలపెట్టిన ఎయిర్‌పోర్టు శరవేగంగా నిర్మా ణం చేయాలని ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. చెన్నె– కోల్‌కత్తా జాతీయ రహదారి పైనే ఉన్న ఈ ప్రదేశంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తే ఇటు నెల్లూరు జిల్లా ప్రజలకు, అటు ప్రకాశం జిల్లా  అందుబాటులో ఉంటుందని భావించారు. దీనికి 2,200 ఎకరాలు భూమి అవసరమని ‘ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత ముఖ్యమంత్రులు అయిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోలేదు.

టీడీపీ అధికారంలోకి రావడంతో..
ఈ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే టీడీపీ నేతలు విమానాశ్రయం నిర్మించ తలపెట్టిన భూములపై రాబందుల్లా వాలిపోయారు. ప్రధానంగా దామవరం, కేకేగుంట గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములపై పడి నకిలీ రిజిస్ట్రేషన్లు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. విమానాశ్రయ భూముల్లో అసలు  యజమానులు ఎవరో, నకిలీలు ఎవరో తేల్చుకోలేక అధికారులు సైతం హడలిపోయారు. ఏ నిర్ణయం తీసుకొంటే తమ ఉద్యోగాలకు ఎసరు తెస్తుందో అని వణికిపోయారు. ఈ క్రమంలో 2016లో జిల్లా కలెక్టర్‌గా ఉన్న జానకి దామవరంలో విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ చేయడం సాధ్యం కాదని, అన్నీ కూడా వివాదాస్పద భూములే అని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు.

దీంతో 18 మే 2017వ తేదీ  నెల్లూరుకు వచ్చిన అప్పటి రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు కల్పన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌ ఒక స్టార్‌ హోటల్‌లో జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేసి, దామవరంలో విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదనలను రద్దు చేసి, దానిని మరో జిల్లాకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. భూ సేకరణకు ఎక్కువ ధర డిమాండ్‌ చేస్తున్నారని, ఇప్పటికే రూ.20 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టామని, ఇక ఏ విధమైన అవకాశం లేనందున విమానాశ్రయం ఏర్పాటును రద్దు చేస్తున్నామన్నారు.

ధరలు తగ్గింపు విషయంలో యజమానులు ముందుకు వస్తే  పునరాలోచించడం జరుగుతుందన్నారు. ఇలా విమానాశ్రయం ఏర్పాటుకు రైతులే అడ్డం పడుతున్నట్టుగా నెపం వేసేలా అప్పటి ప్రభుత్వం యత్నించిందన్న విమర్శలు సైతం వచ్చాయి. అప్పటి ప్రభుత్వ ప్రకటనలపై ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన నిలిచారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విమానాశ్రయాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

గ్రీన్‌ ఫీల్డ్‌ నుంచి.. బుల్లి ఎయిర్‌పోర్ట్‌
విమానాశ్రయం నిర్మాణానికి 2,200 ఎకరాలు అవసరమని భావించినప్పటికీ, అక్కడ నెలకొని ఉన్న భూ వివాదాల నేపథ్యంలో కేవలం 613 ఎకరాలు సరిపోతుందని స్వయంగా ‘ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ సర్దుబాటు ధోరణిలో చెప్పింది. తర్వాత జరిపిన చర్చలు తర్వాత జిల్లా అధికార యంత్రాంగం విమానాశ్రయం కోసం దగదర్తి మండలంలోని దామవరంలో 1,075 ఎకరాలు, కొత్తపల్లి కౌరుపల్లిగుంట (కేకేగుంట)లో 323 ఎకరాలు కలిపి 1,399 ఎకరాలు భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 1,379.71 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం నిర్మాణం పేరుతో టీడీపీ నాయకులు చంద్రబాబుతో ఉత్తుత్తి శంకుస్థాపన చేయించి చేతులు దులుపుకొన్నారు. అయితే భూ సేకరణ పనులు ఇంకా పూర్తి కాలేదు. కేవలం 1,061.095 ఎకరాలు మాత్రమే రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి అప్పగించారు. ఇంకా 318.615 ఎకరాలు అప్పగించాల్సి ఉంది. ఇక విమానాశ్రయ భూములను ఆనుకొని ఉన్న 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకుడు ఒకరు కొల్లగొట్టేశాడు. ఇదిలా ఉండగా టీడీపీ నాయకులు బ్రోకర్లుగా అవతరించి నష్టపరిహారంలో వాటాలు తీసుకొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.50 కోట్లు నష్టపరిహారాన్ని కూడా దేశం నేతలు కాజేశారు.

విమానాశ్రయ స్వప్నం సాకారం
జిల్లా ప్రజల విమానాశ్రయ స్వప్నం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేస్తున్నారు. టీడీపీ నాయకులు విమానాశ్రయం నిర్మించాలని ఏ రోజు అనుకోలేదు. విమానాశ్రయాన్ని అడ్డం పెట్టుకొని రైతుల భూములు కాజేసి వారి కడుపుకొట్టారు. ఆ పాపం ఊరికనే పోదు. మాకు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. వీలైతే రైతులకు సహాయం చేయడానికి చట్టం ఇబ్బందిగా ఉంటే దానిని సవరించి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాం. తప్పులు, దోపిడీలు చేయాల్సిన కర్మ మాకు పట్టలేదు. – రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే, కావలి


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement