రాలిన పసిమొగ్గలు | four childrens are dead | Sakshi
Sakshi News home page

రాలిన పసిమొగ్గలు

Published Mon, Oct 20 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM

రాలిన పసిమొగ్గలు

రాలిన పసిమొగ్గలు

ఆటవిడుపు ఉత్సాహం విషాదాన్ని మిగిల్చింది
విధి ఆడిన ‘ఆట’ పసివారి ఉసురు తీసింది
అప్పటిదాకా ఆటపాటలతో ముంగిట సందడి చేసిన బుడుగులు
ఇక కనబడరని..ఆ నవ్వులు ఇక వినబడవని
తెలిసిన అమ్మమ్మ గుండె..ఒక్కసారిగా ఆగిపోయింది
ఆ ఇంట ఆనందాల హరివిల్లు చెదిరిపోయింది
పిలుపుకందని బిడ్డలను చూసిన తల్లిగుండె మంటలు చూశాక..
నీటితో కూడా నిప్పును రాజేయొచ్చని ఇప్పుడేగా తెలిసింది.

 
చీరాల, వేటపాలెం: గంగపుత్రులతో విధిఆడిన ఆట రెండు మత్స్యకార కుటుంబాల్లో విషాదం నింపింది. ఉప్పువాగు కాలనాగై నలుగురు చిన్నారులను మింగేసింది. పసివారి ఆటలు, మాటలతో మురిసిపోయే అమ్మమ్మ గుండె ఇక వారు రారని తెలిసి ఆగిపోయింది. దీంతో ఆదివారం ఆ అన్నదమ్ముల కుటుంబంలో అమావాస్య చీకట్లు కమ్మాయి. తీరప్రాంతం విషాదఘోషతో నిండిపోయింది. వేటపాలెం మండలం రామాపురానికి చెందిన వాయిల ఆంజనేయులు, శ్రీను అన్నదమ్ములు. వీరికి వేటే జీవనాధారం.

భార్యా పిల్లలను వదిలి నాలుగు రోజుల క్రితం అన్నదమ్ములు ఇద్దరూ కర్ణాటకలోని మంగుళూరుకు వేటకెళ్లారు. వాయిల ఆంజనేయులుకు భార్య మంగమ్మ, ముగ్గురు సంతానం ఉన్నారు. పెద్ద కుమార్తె అంజమ్మ (11), కుమారుడు రాముడు (8), మరో కుమార్తె సుజాత (7) చీరాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. అలానే ఆంజనేయులు సోదరుడు శ్రీను, నాగమణి దంపతులకు ఇద్దరు సంతానం. ఆదివారం సెలవు రోజు కావడంతో శ్రీను కొడుకు నాగరాజుతో పాటు ఆంజనేయులు ముగ్గురు పిల్లలు గ్రామం పక్కనే ఉన్న ఉప్పువాగులో నాటుతెప్పకు ఉపయోగించే బొందుపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటిలో పడి నలుగురూ మునిగిపోయారు. ఘటనను గమనించిన స్థానికులు చిన్నారులను బయటకు తీసేలోపే వారు మృత్యువాత పడ్డారు.

ఆ తల్లికి తీరని గర్భశోకం..
గంగమ్మ తల్లిని నమ్ముకున్న తమ ఇంటి దీపాలను ఆ గంగమ్మే ఆర్పేస్తుందని ఊహించలేదని ముగ్గురు బిడ్డలను కోల్పోయిన మంగమ్మ కన్నీరు మున్నీరవుతోంది. తాము పడుతున్న కష్టాలు తమ బిడ్డలు పడకూడదని..చక్కగా చదువుకుని తమ జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశించిన ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. ఆ ఇంట నవ్వులు, ఆనందాలు ఆవిరయ్యాయి. ఒకే కుటుంబం లో ముగ్గురు చిన్నారులు, ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వృద్ధురాలు మృతిచెందడం తో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

అప్పుడే నూరేళ్లు నిండాయా..బిడ్డా..
వాయిల శ్రీను కుటుంబంలో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు నాగరాజు ఆడుకుంటానని వెళ్లి..తిరిగిరాని లోకాలకు మరలిపోవడంతో తల్లి నాగమణి జీర్ణించుకోలేకపోతోంది. పదేళ్లు నిండకుండానే అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా బిడ్డా.. అంటూ రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది.

ఆ నవ్వులు వినలేనని..
అల్లరిని చూడలేనని
ఆగిన అమ్మమ్మ గుండె


ఆటపాటలతో ఇల్లంతా సందడి చేస్తూ గారాలు పోయే పిల్లల అల్లరిని ఆస్వాదించేది అమ్మమ్మ నాగమ్మ. ఇకపై తాను ఆ పసివారి అల్లరిని, నవ్వులను చూడలేనన్న బాధతో నాగమ్మ(55) విలవిల్లాడింది. ఇంటి దీపాలు కొండెక్కడంతో.. ఇకతానెందుకు బతకాలో అర్థంకాక మలివయస్సులో ఆ వృద్ధురాలు గుండె ఆగి మరణించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement