పిడుగు కాటు | Four died with bombshell | Sakshi
Sakshi News home page

పిడుగు కాటు

Published Sat, Apr 18 2015 3:25 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

పిడుగు కాటు - Sakshi

పిడుగు కాటు

♦  పిడుగుపడి నలుగురు మృతి
♦   మృతుల్లో దంపతులు
 ♦  రైతు కుటుంబాల్లో అంతులేని విషాదం
 ♦  సహాయ కార్యక్రమాలకు అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే బూడి, కలెక్టర్ యువరాజ్

 
వారి బతుకులపై ప్రకృతి కన్నెర్ర చేసింది...అనుకోకుండా వాన కురుస్తుండటంతో తలదాచుకునేందుకు చెట్టుకిందకు వెళ్లిన వారిని పిడుగు పొట్టనపెట్టుకుంది. ఒకేసారి నలుగురిని బలితీసుకున్న ఈ సంఘటన కోటపాడు మండంల పిడ్రంగిని విషాదంలోకి నెట్టేసింది. ఈ దుర్ఘటనలో దంపతులు కన్నుమూయగా మరో ఇద్దరు కూలీలు విగతజీవులయ్యారు. పొలానికి వెళ్లిన వారు శవాలుగా మారడంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరయ్యాయి. కూలినాలి చేసుకునే బతుకుల్లో పిడుగు పెనుకల్లోలం నింపింది
 
ఆధారం కోల్పోయిన కుటుంబాలు
కూలిపనికి వెళ్లిన తమ ఇంటి యజమానులు సాయంత్రం వస్తారని ఎదురుచూసిన కుటుంబసభ్యులకు మరణ వార్త తీవ్ర విషాదంలో ముంచింది. జాగారపు సన్నిబాబు, జాగారపు ఈశ్వరరావులు వరుసకు అన్నదమ్ములు. రోజూ కూలిపని చేసుకుంటూ కుంటుంబాలను పోషించుకుంటున్నారు. ఆకస్మికంగా వీరి మృతితో ఆయా కుటుంబాలు ఆధారం లేకుండా పోయింది. సన్నిబాబుకు భార్య, కుమార్తె,కుమారుడు ఉన్నారు. ఈశ్వరరావుకు భార్య, కుమార్తె,కుమారుడు ఉన్నారు. కుమార్తెలకుపెళ్లిలుఅయిపోయాయి.
 
కె.కోటపాడు :  ఒకే రోజు పిడుగుపాటుకు నలుగురు మృతితో మండలంలోని పిండ్రంగిలో విషాదం చోటుచేసుకుంది. ఆయా రైతు, రైతుకూలీ కుటుంబాల్లో అంతులేని వేదన మిగిలింది. చోడిపంట నూర్పిడికి శుక్రవారం పొలానికి వెళ్లిన సింగంపల్లి అప్పారావు(53), కళావతి(38) దంపతులతోపాటు కూలీపనికి వచ్చిన గ్రామానికి చెందిన జాగారపు సన్నిబాబు(49), జాగారపు ఈశ్వరరావు(48)లు మధ్యాహ్నం వరకు పంటను నూర్పిడి చేశారు.

భారీ వర్షంతో నలుగురూ సమీపంలోని చెట్టుకిందకు చేరారు. దానిపై పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. నలుగురు మృతిచెందారన్న వార్తతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి పరుగులు తీశారు. విగత జీవులుగా పడి ఉన్న తమవారిని చూసి బోరున విలపించారు.  రోదనలతో గ్రామం శోకసంద్రమైంది.

చావులోనూ వీడని బంధం: వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న రైతు సింగంపల్లి అప్పారావు, అతని భార్య కళావతిలు చావులోనూ వీడలేదు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు ఇటీవల పెళ్లి చేశారు. కొడుకు రాజేష్‌ను ఇంజినీర్‌ను చేయాలని ఆశపడ్డారు. ఆరుగాలం కష్టపడేవారు. వచ్చిన ఆదాయంతో కొడుకును ఇంజినీరింగ్ చదివించారు. నేడోరేపో ఉద్యోగం వస్తుందని ఎదురుచూస్తున్న సమయంలో మృత్యువు పిడుగు రూపంలో ఆ దంపతులను కబళించింది. కొడుకు రాజేష్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తనకు దిక్కెవరంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పారావుకు 80 ఏళ్లు పైబడిన వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. కొడుకుకోడలు మృతితో వారు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఎమ్మెల్యే ముత్యాలనాయుడు వాకబు
నియోజకవర్గంలో ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతిచెందారని తెలుసుకున్న మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు కర్నూలు నుంచి ఫోన్‌లో ఆయా కుటుంబసభ్యులను పరామర్శించారు. సాయం అందించాలని ఇన్‌చార్జి తహాశీల్దార్ నాగేశ్వరరావును ఆదేశించారు. ఆర్డీఓ పద్మావతి సంఘటన స్థలానికి వచ్చారు. ఇదిలావుండగా జిల్లా కలెక్టర్ యువరాజ్, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ఫోన్ ద్వారా సంఘటపై ఆరాతీసి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నాలుగు మృతదేహాలను పిండ్రంగి గ్రామ పొలిమేరకు శుక్రవారం రాత్రి తరలించారు. శనివారం మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement