
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో ఆదివారం అర్థరాత్రి దాటాక ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఇస్లాంపూర్‌లో రైల్వే ట్రాక్‌పై సెల్‌ఫోన్‌లో బిజీగా ఉన్న నలుగురు టీనేజర్లు.. రైలు ఢీకొట్టిన ఘటనలో దుర్మరణం చెందారు. రైలు పట్టాలపై కూర్చుని సెల్‌ఫోన్లో మునిగిపోయిన ఆ నలుగురు యువకులపై నుంచి రైలు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వారంతా 13-14 ఏళ్ల మధ్య వయసు వారని స్థానిక పోలీసులు వెల్లడించారు.
ఈ దుర్ఘటనపై ఇస్లాంపూర్ ఎస్పీ సచిన్ మక్కర్ మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి రైలు పట్టాలపై కూర్చొని సెల్‌ఫోన్‌లో నిమగ్నమైన నలుగురు మైనర్ బాలురు రైలు వస్తున్న విషయాన్ని కూడా గమనించలేదని, దీంతో రైలు వారిపై 50 మైళ్ల వేగంతో దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. మృతదేహాలు గర్తుపట్టలేనంతగా ఛిద్రం కావడంతో పోస్ట్‌మార్టం చేసేందుకు కూడా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని, విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన దహన సంస్కారాలు జరిపించారని వెల్లడించారు.
ఈ ఘటనపై తమకెటువంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. సంఘటనా స్థలం వద్ద సెల్‌ఫోన్ల విడిభాగాలు చెల్లా చెదురుగా పడి ఉండటాన్ని గమనించామని అన్నారు. మృతుల కుటంబ సభ్యులెవరైన ఫిర్యాదు చేస్తే ఘటనపై దర్యాప్తు చేస్తామని తెలిపారు.
చదవండి: భర్తను హత్య చేసిన భార్య .. పోలీసుల రంగప్రవేశంతో..
Comments
Please login to add a commentAdd a comment