
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి, పలువురికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే రోజు జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మరణించగా, పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే రోజు జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మరణించగా, పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదాలు సంభవించాయి. గుంటూరు జిల్లా దాచేపల్లిలో నర్సరావుపేట నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సును ఓ లారీ ఢీకొంది. హైదరాబాద్లో జరగనున్న పెళ్లి కోసం ఓ పెళ్లి బృందం ఈ బస్సులో నర్సరావుపేట నుంచి బయల్దేరింది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మరణించగా, పెళ్లి బృందంలోని ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇక మరోవైపు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నెలవాడలో జాతీయ రహదారిపై ఉన్న పాదచారులను ఓ లారీ ఢీకొంది. దాంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వైఎస్ఆర్ జిల్లా తొండూరు మండలం మాల్యాల వద్ద కూలీల ట్రాక్టర్, లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, పదిమంది గాయపడ్డారు.