సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోని విధంగా మంత్రులు కూడా ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. వారిలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒకరు. జిల్లాలో సాగునీటి సరఫరా విషయంలో మంత్రి కాకిలెక్కలు చెబుతున్నారు. ఖరీఫ్‌లో 8.36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి పంటలను కాపాడిన ఘనత తమదేనని మంత్రి దేవినేని ఇంజనీర్ల సమావేశంలో గొప్పలు చెప్పుకున్నారు. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని రైతుసంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో మొత్తం 11 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. అందులో సోమశిల, కండలేరు, కనిగిరి, సంగం రిజర్వాయర్ల కింద సుమారు 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఈ ఖరీఫ్‌లో 5.25 లక్షల ఎకరాలు మాత్రమే సాగుచేశారని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అందులో సుమారు లక్షల ఎకరాల వరకు పంటలు ఎండిపోయాయని అధికారుల అంచనా. ఇంకా 25 వేల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయి.
వీటికి ఈనెల చివరివరకు సాగునీరు అందించాల్సి ఉంది. బోర్లు, బావుల కింద 5.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతున్నాయి. అయితే భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు కట్టుకథలు చెప్పి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేసినట్లు పలువురు రైతుసంఘం నాయకులు మండిపడుతున్నారు. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 8.36 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చి పంటలను కాపాడామని మంత్రి చెప్పటం గమనార్హం. అదేవిధంగా గత పదిరోజుల్లో రూ.200 కోట్లు విలువచేసే పంటలను కాపాడినట్లు అధికారుల సమక్షంలో ప్రకటించారు.
లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు
జిల్లావ్యాప్తంగా ఇరిగేషన్ కింద సుమారు లక్ష ఎకరాలకుపైగా పంటలు ఎండిపోయినట్లు అధికారులే స్పష్ట చేస్తున్నారు. ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందకపోవటంతో పంటలు ఎండిపోయాయి. చేతులు కాలాక ఆకులపట్టుకున్న చందంగా మంత్రి హడావుడిగా వచ్చి కనుపూరు ఎడమ కాలువ లిప్ట్‌కు రూ.68.5 లక్షల ఖర్చుచేసి 5వేల ఎకరాల్లో నిమ్మపంటను కాపాడామని చెప్పుకొచ్చారు. వారంక్రితం జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిశాయి. సాగులో ఉన్న పంటలకు కొంత ఊరటనిచ్చింది. అయితే మంత్రి రూ.200 కోట్ల పంటలను కాపాడగలిగామని గొప్పలు చెప్పుకోవటం కనిపించింది. కనుపూరు, బ్రాహ్మణకాక, బండిపల్లి, వెంకటాచలం, ఉదయగిరి, గూడూరు, మనుబోలు, వెంకటగిరి తదితర ప్రాంతాల్లో వరి పంటలకు సాగునీరు అందక ఎండిపోయి దర్శనమిస్తున్నాయి.
కాలువకు నీరు కట్టేసిన మంత్రి
జిల్లాలో ఇంకా 25 వేల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయి. వీటికి ఈనెల చివరివరకు సాగునీరు అవసరం ఉంది. అయితే మంత్రి దేవినేని శనివారం కాలువకు పూర్తిగా నీరు నిలిపివేశారు. దీంతో 25వేల ఎకరాలకు చెందిన రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. పంట చేతికొచ్చే దశలో నీరు నిలిపివేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వెంకటగిరి, రాపూరు, పొదలకూరు, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో పండ్లతోటలు ఉన్నాయి. వాటికి బోర ్ల నుంచి నీరందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాల్లో పంటలు ఎండిపోకుండా ప్రభుత్వ ఖర్చుతో బోర్లు, బావుల నుంచి నీరు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే మంత్రి చెప్పి 15 రోజులు కావస్తున్నా.. ఇంతవరకు అతీగతి లేదని రైతులు మండిపడుతున్నారు. పంటలకు సాగునీరు విషయంపై అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఇరిగేషన్ మంత్రి దేవినేని మాత్రం బోర్లు, బావుల కింద సాగవుతున్న పంటలన్నింటినీ కలిపేసుకుని 8.36 లక్షల ఎకరాల్లో పంటలకు సాగునీరు ఇచ్చామని అరచేతిలో వైకుంఠం చూపించటం గమనార్హం.
కాకిలెక్కలు
Published Sun, Apr 19 2015 3:19 AM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM
Advertisement