యద్దనపూడి: గతంలో ఆహర పదార్థాలు, కూరగాయలు, ఇతరత్రా కొనుగోలు చేసినప్పుడు కొసరు, మొగ్గు అని వ్యాపారులు కాస్తంత ఎక్కువ తూకం ఇచ్చేవారు. ఇప్పుడు అన్నింటి ధరలు ఆకాశానంటుతున్న నేపథ్యంలో కాటాలు, తక్కెడలు పోయి వాటి స్థానంలో డిజిటల్ కాటాలు వచ్చాయి. దీంతో పక్కాగా తూకం వేస్తున్నారు. ప్రతి దాన్ని బంగారంలానే భావిస్తున్నారు. కొందరూ వ్యాపారులు కనికట్టు విద్యలను ప్రదర్శిస్తూ కొనుగోలుదారులను తెలివిగా మోసం చేస్తున్నారు. రాళ్ల కాటాలతో హెచ్చ తగ్గులు ఉంటాయని ప్రతి ఒక్కరికి తెల్సిన విషయమే. కానీ ఎలక్ట్రానిక్ కాటాల్లో ఇంకా ఎక్కువ మోసం చేయవచ్చని కొందరు వ్యాపారులు నిరూపిస్తున్నారు.
ఎలక్ట్రానిక్ కాటాలతో మోసం ఇలా..
సాధారణంగా ఘన పదార్థాలను కిలో గ్రాముల్లో, ద్రవ పదార్థాలను లీటర్లలో కొలుస్తుంటాం. కానీ మనం ఘన పదార్థాలు కొనుగోలుకు వెళ్లినా ఎలక్ట్రానిక్ కాటాల్లో ద్రవపదార్థాల తూకం మోడ్‌లో ఉంచి తూకం వేస్తున్నారు. స్క్రీన్‌పై (ఎల్) అనే అక్షరం మాత్రం కనిపించకుండా స్టికర్ అంటిస్తున్నారు. లీటర్ ఘన పదార్థం బరువు 1000 గ్రాములు ఉండగా ద్రవ పదార్థం బరువు 850 గ్రాములు మాత్రమే వస్తుంది. ఎలక్ట్రానిక్ కాటాలో ఆప్షన్‌ను లీటర్ల మోడ్‌లోకి మార్చి ఘన పదార్థాల తూకం వేస్తున్నారు. స్క్రీన్‌పై కనిపించేది లీటర్ల తూకం అయినా కొనుగోలు దారులకు మాత్రం కిలోలుగా చూపించి మోసం చేస్తున్నారు. వినియోగదారుడు కిలోకు 100 నుంచి 150 గ్రాముల వరకు నష్టపోతున్నాడు.
కొరవడిన పర్యవేక్షణ
చిల్లర దుకాణాలు, చికెన్ షాపులు, కూరగాయల మార్కెట్లపై తూనికలు కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వ్యాపారులు ఇష్టం వచ్చినట్లు తూకం వేసి వినియోదారులను తెలివిగా దోచుకుంటున్నారు. తూనికల కొలతల శాఖ అనేది ఒకటి ఉంటుందని చాలా మందికి తెలియదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. కాటాల్లో మోసం జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా వినియోగదారుడికి తెలియని పరిస్థితి. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని దుకాణాల్లో సీల్ లేకుండానే ఎలక్ట్రానిక్ కాటాలు వినియోగిస్తున్నారు. మరికొన్ని చోట్ల అరిగిపోయిన రాళ్లు, మొద్దు కాటాలు ఉపయోగిస్తూ తూకాల్లో మోసం చేస్తున్నారు. ఈ మోసాలు చిల్లర దుకాణాల్లో కొద్దిమేర మాత్రమే వ్యత్యాసం వస్తుండగా చికెన్ దుకాణాల్లో మాత్రం భారీ తేడా వస్తుంది. కిలో మాంసం కాటా వేసే ముందు మాంసాన్ని తడుపు తుండటంతో ఎక్కువ బరువు తూగుతుంది. ఇలా మార్కెట్‌లో జరిగే క్రయ విక్రయాల్లో వినియోగదారుడు నిత్యం మోసపోతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నాడు.
వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి: డి.అనీల్‌కుమార్,ఇన్‌స్పెక్టర్,తూనికలు కొలతల శాఖ వ్యాపారులు కాటాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు అనుమానం వస్తే 99665 90970 నంబర్‌కు సమాచారం అందించాలి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచి సదరు వ్యాపారిపై చట్టపర చర్యలు తీసుకుంటాం. సీల్ లేకుండా కాటాలు వినియోగిస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం.
కాటాల్లో.. కనికట్టు!
Published Thu, Oct 26 2017 12:32 PM | Last Updated on Thu, Oct 26 2017 12:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment