ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. | frbm to a deficit of 7 per cent without permission? | Sakshi
Sakshi News home page

ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు..

Published Fri, Mar 18 2016 2:47 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. - Sakshi

ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు..

ఎఫ్‌ఆర్‌బీఎం అనుమతి లేకుండా 7 శాతం లోటు ఎలా?
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

 
 హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా కనికట్టుగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి విమర్శించారు. పారదర్శకత, చిత్తశుద్ధి, నిజాయితీ లేకుండా అంకెలు ఇచ్చి ‘ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు’గా భ్రమ కల్పించి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని దుయ్యబట్టారు.అందర్నీ కలుపుకుని పోవాల్సిన ప్రభుత్వం సంకుచితంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రాభివృద్ధికి తామిచ్చే నిర్మాణాత్మక సూచనలు, సలహాలనూ పరిగణలోకి తీసుకోవాలని హితవు పలికారు.రాజకీయం, ప్రజాసేవ వేర్వేరు కాదన్న సిద్ధాంతాలను కలిగిన వైఎస్సార్‌సీపీ తరఫున బడ్జెట్ చర్చలో పాల్గొనేందుకు అవకాశం కల్పించిన తమ పార్టీ నేత  జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంత ముఖ్యమైన సమయంలో ఆర్థిక మంత్రి యనమల సభలో లేకపోవడాన్ని ఆయన ఆక్షేపించారు.

 ఆడిట్ అయిన లెక్కలేవీ?: బడ్జెట్‌కు ఏదో ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. గతేడాది అంచనాలు, వాస్తవ వ్యయం ఆధారంగా ప్రస్తుత బడ్జెట్‌ను విశ్లేషించాల్సి ఉంటుంది. 2014-15లో ఆడిట్ అయిన అంకెలు ఈసారి ఇచ్చిన బడ్జెట్ బుక్‌లో లేవు. దీంతో ముఖ్యమంత్రిగారి కోర్ డాష్ బోర్డు మీద ఆధారపడాల్సి వచ్చింది. దీని ప్రకారం 2015-16లో రెవెన్యూ ఖర్చు 54,574 కోట్లు. పూర్తి ఖర్చు 32,688 కోట్లుగా చూపించారు. మిగతా ఆ 22 వేల కోట్లు ఎక్కడని వెతికితే పబ్లిక్ డిపాజిట్లు కట్టినట్టుగా చూపించారు. ఇంత మొత్తంలో పబ్లిక్ డిపాజిట్లు చూపించాలంటే ఎఫ్‌ఆర్‌బీఎం పర్మిషన్ అవసరం.

అది తీసుకున్నారా? లేదా? ప్రభుత్వం చెప్పాలి. ఇక బడ్జెట్ బుక్(వాల్యూమ్ ఆరు) ప్రకారం బడ్జెట్ అంచనా 1,08,710 కోట్లు. రెవెన్యూ వ్యయం 1,14,000 కోట్లు. రాబడి 90 వేల కోట్లు( గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ. 21వేల కోట్లతో కలుపుకొని). అంటే రూ. 24వేల కోట్ల లోటు. దానికి తోడు క్యాపిటల్ ఖర్చు 11 409 కోట్లు. ఈ రెండు కలిపితే 35,724కోట్ల లోటు కనబడుతోంది. దీన్ని ఐదు లక్షల కోట్ల జీఎస్‌డీపీ మీద లెక్కిస్తే దాదాపు 7 శాతం లోటు ఏర్పడుతుంది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం లోటు 3 శాతం దాటకూడదు.దీన్ని ఏవిధంగా లెక్కించారో సమాధానం చెప్పాలని బుగ్గన డి మాండ్ చేశారు. చంద్రన్న కానుకంటూ ఒ సం చిని ఇచ్చారని, అందులో సరుకులు ఎలా ఉన్నా సంచులు బాగున్నాయని చమత్కరించా రు. అవి బాబు హామీలతో మోసపోయిన రైతులకు రుణమాఫీ పత్రాలు పెట్టుకోవడానికి, విద్యార్థులకు తమ సర్టిఫికెట్లు పెట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరగడానికి, డ్వాక్రా మహిళలైతే తమ కాగితాలను పెట్టుకుని బ్యాంకుల చుట్టూ తిరగడానికి పనికి వస్తున్నాయన్నారు.
 
వైఎస్ హయాం కచ్చితంగా స్వర్ణయుగమే
 ఇదే సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధిని చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని సరిపోల్చి చూపారు. విద్యుత్ ఉత్పత్తి వైఎస్ హయాంలో రెట్టింపు అయిందన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులకు వైఎస్ శ్రీకారం చుట్టడం వల్లే ఈ వేళ కొలిక్కి వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్తు ఉత్పత్తికి వైఎస్ హయాంలో వేసిన పునాదులు కారణమన్నారు. ఏ రంగాన్ని తరిచి చూసినా 2004 నుంచి 2009 వరకు కచ్చితంగా స్వర్ణయుగమేనని వివరించారు.సాఫ్ట్‌వేర్ రంగంలోనూ 2004లో రాష్ట్రం 5వ స్థానంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.
 
నందో రాజ్య భవిష్యతీ కథ ఇదీ..
 ఈ సందర్భంలో బుగ్గన ఓ పిట్ట కథ చెప్పారు. పూర్వం నందరాజు అనే వ్యక్తికి ఇద్దరు భార్యలుండే వారు. చిన్న భార్య బాగా అప్పులు చేసింది. దీంతో నందరాజు పెద్ద భార్యతో కలిసి అడవికి పోయారు. చిన్న భార్యకు నందుడనే కొడుకున్నాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు బాకీ తీర్చమని ఎప్పుడడిగినా ఆమె ‘నందో రాజా భవిష్యతీ’ అనేది. తీరా దీనర్థం ఏంట్రా అని ఆరా తీస్తే, ఏదో ఒక రోజు నందుడు రాజు కాకపోతారా? అప్పులన్నీ తీర్చకపోతానా అని చెప్పినప్పుడు సభలో నవ్వులు విరిశాయి. అలాగే ఇప్పుడు మన పెదబాబు కూడా ఏదో ఒక నాడు చినబాబు రాకపోతాడా, రుణమాఫీ చేయకపోతాడా,డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకపోతాడా, చినబాబు రాకపోతాడా రాజధాని కట్టకపోతాడా? నిరుద్యోగ భృతి ఇవ్వకపోతాడా? అని అన్నప్పుడు విపక్ష సభ్యులు బల్లలు చరిచి హర్షధ్వానాలు చేశారు.
 
పిల్లదోమ కథ ఇదీ...

మంత్రుల తీరుపై బుగ్గన ఓ కథ వినిపించారు. ‘ఓ పిల్లదోమ పుట్టిన తర్వాత తొలిసారి ప్రపంచంలోకి వెళ్లింది. ఒక రోజంతా తిరిగింది. ఆ తర్వాత తల్లిదోమ, తండ్రి దోమ దాన్ని పట్టుకుని ప్ర పంచం ఎలా ఉందని అడిగాయి. అప్పుడా పిల్లదోమ.. నాకింత పేరు ప్రఖ్యాతలున్నాయని మీరు ఇంత వరకు చెప్పనేలేదు, నేను బయటకు వెళ్లగానే అందరూ చప్పట్లు(దోమల్ని చంపడానికి మనం రెండు చేతులతో చేసే ప్రయత్నం) కొడుతున్నారంటూ చమత్కరించడంతో సభ మరోసారి నవ్వుల్లో మునిగిపోయింది.
 
వైఎస్ రెండో సారి ఎలా గెలిచారో తెలుసుగా: జగన్
బుగ్గన ప్రసంగం అనంతరం మంత్రి పల్లె రఘునాధరెడ్డి లేచి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఏవేవో విమర్శలు చేశారు. దీనికి విపక్ష నేత జగన్ స్పందిస్తూ వైఎస్సార్ పాలన అంత చెడుగా ఉన్నందుకే 2009లో అంత గొప్పగా రెండోసారి గెలిచారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేకతను కాదని.. ప్రజలు వైఎస్ రాజశేఖరరెడ్డికి పట్టం కట్టారని బదులిచ్చారు. వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement