జూలై 1 నుంచి నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : ఆంధ్రాబ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువకులకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు ఆ సంస్థ డెరైక్టర్ ఎస్.జగన్నాథరాజు ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణ తరగతుల్లో మోటార్ రీవైండింగ్ - ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్, హౌస్ వైరింగ్, కంప్యూటర్ బేసిక్స్ (ఎంఎస్ ఆఫీస్), ఎల్‌సీడీ టీవీ మెకానిజం కోర్సుల్లో శిక్షణ తరగతులంటాయని తెలిపారు. అభ్యర్థులు 10వ తరగతి ఆ పైన విద్యార్హత కలిగి ఉండాలన్నారు. అన్ని కోర్సులకు 30 రోజుల కాలపరిమితి ఉంటుందని వివరించారు.
ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు శిక్షణ తరగతులుంటాయన్నారు. ఆయా కోర్సుల్లో చేరేందుకు జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన పురుష అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. శిక్షణ సమయంలో ఎంపికైన దూరప్రాంత అభ్యర్థులకు యోగా శిక్షణ, హాస్టల్, భోజన వసతి కల్పిస్తామని, స్థానిక అభ్యర్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం ఉంటుందన్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందిస్తామని, యూనిట్ల స్థాపనకు బ్యాంకు రుణాలు పొందటానికి తగు సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. ఉచిత శిక్షణ పొందగోరు అభ్యర్థులు ఆంధ్రాబ్యాంక్ గ్రామీణాభివృద్ధి సంస్థ, డోర్ నెంబర్ 24ఎ- 7-1, అమలోద్భవి కాన్వెంట్ వీధి, అశోక్ నగర్, ఏలూరు చిరునామాకు దరఖాస్తులు పంపాలన్నారు. ఇతర వివరాలకు 08812- 253975, 94417 54604, 95027 23561, 94909 98882 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.