సీఎం స్థాయిని మరిచి దివాలాకోరు వ్యాఖ్యలు
నిరుద్యోగులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి
ఉద్యోగాలు, జాబ్ కేలండర్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి
మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతను, విద్యార్థులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి అత్యంత దివాలాకోరుతనంతో నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న మోతీలాల్‌ను అవమానించేలా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఆదివారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. అశోక్‌నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకున్న రేవంత్‌రెడ్డి అదే కోచింగ్ సెంటర్లను, నిర్వాహకులను అవమానించేలా మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.
మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిన యువత ఈరోజు ప్రశ్నిస్తున్నదని అన్నారు. 8 నెలల్లో ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని పాలకులు, మిగిలిన నాలుగు నెలల్లో ఏవిధంగా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదని, లక్షలాదిమంది యువతకు సంబంధించిన అంశం అని అన్నారు. ఈ అంశంలో రేవంత్‌రెడ్డి ఇగోకి, భేషజాలకు పోకుండా నిర్ణయం తీసుకోవాలని, కండకావరంతో మాట్లాడడం ఆపాలని హితవు పలికారు.
గతంలో నిరుద్యోగుల్ని రెచ్చగొట్టింది మీరు కాదా?
రాజకీయ నిరుద్యోగులుగా యువతను రెచ్చగొట్టిన రాజకీయ శక్తులు ముమ్మాటికీ రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీలేనని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఏ పరీక్ష రాశారని రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి నిరుద్యోగులతో కలిసి దీక్ష చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అశోశ్‌నగర్ లోని విద్యార్థులను రేవంత్‌రెడ్డి సన్నాసులు అంటున్నారని, అసలు సన్నాసులు రేవంత్‌రెడ్డా, రాహుల్‌గాంధీయా అనే విషయం చెప్పాలన్నారు. 2023 అక్టోబర్, నవంబర్‌లో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులను నిరుద్యోగులను రెచ్చగొట్టారని, అనేక అవాకులు చవాకులు పేలారని ధ్వజమెత్తారు.
రాజకీయ నిరుద్యోగం నుంచి బయట పడటానికి రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి యువతను వాడుకున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే వందల నోటిఫికేషన్లు, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఇస్తామని నమ్మబలికారని అన్నారు. ఇప్పుడు ఒకాయన ముఖ్యమంత్రి అయ్యారని, ఇంకొకరు జాతీయస్థాయిలో నాయకుడు అయ్యారు తప్ప తెలంగాణ నిరుద్యోగులకు దక్కింది శూన్యం అని విమర్శించారు.
నిరుద్యోగులతో కలిసి కొట్లాడతాం..
ప్రస్తుతం అశోక్‌నగర్‌లో, యూనివర్సిటీలో పిల్లలను ఈడ్చుకుపోతుండడం వాస్తవం కాదా చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. మిమ్మల్ని వదిలిపెట్టకుండా నిలదీస్తామని, విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి కొట్లాడుతామని అన్నారు. రేవంత్‌రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే మాట్లాడుతున్నారని, ఆయన ముఖ్యమంత్రిని అని గుర్తుంచుకొంటే మంచిదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి సత్తా, చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్‌పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల డిమాండ్లపై స్పందించి, వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment