నలుగురు స్నేహితులు (అంతరచిత్రం) మృతి చెందిన బుచ్చిరాజు గుప్తా(ఫైల్)
ఆ నలుగురు చిన్నప్పటి నుంచి స్నేహితులు.. ఎక్కడికి వెళ్లినా వారందరూ కలిసే వెళతారు. ఒకిరిని విడిచి ఒకరు ఉండలేనంత స్నేహబంధం వారిది.. ఆ ఫ్రెండ్‌షిప్‌తోనే వారందరూ విహారయాత్రకు వెళ్లారు. సరదాగా గడిపేందుకు సిద్ధమయ్యారు. అయితే విధి వక్రించింది. మారేడుమిల్లి మండలం పాములోరులో దిగిన వారిలో ఇద్దరు మృతి చెందారు..
చేతికి అందివస్తాడనుకున్న కుమారులు అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ రెండు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగాయి. కుమారులు కడుపుకోత మిగిల్చారంటూ వారి కన్నతల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడిపెట్టించింది.
గొల్లప్రోలు (పిఠాపురం), మారేడుమిల్లి (రంపచోడవరం): స్నేహితులతో కలిసి విహారయాత్రకు మారేడుమిల్లి వచ్చి అక్కడ పాములేరువాగులోకి స్నానానికి దిగి గల్లంతైన గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన గ్రంధి బుచ్చిరాజు గుప్తా(21) మృతి చెందాడు. పాములేరు వాగు శివారు ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. అప్పటికే మృతి చెందిన నందికాళ్ల ఫణీంద్ర(21)తో పాటు బుచ్చిరాజుగుప్తా మృత దేహాలను రంపచోడవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, శవ పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తులసీరామ్ తెలిపారు.
కాగా ఫణీంద్ర, బుచ్చిరాజుగుప్తా కుటుంబాల్లో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కొడుకును కోల్పోయామని బుచ్చిరాజుగుప్తా తల్లిదండ్రులు రాంబాబు, సుజాత గుండెలవిసేలా రోధించిన తీరు పలువురిని కలచివేసింది. స్నేహితులతో విహారానికి వెళ్లి తిరిగిరాకుండా పోయావా! అంటూ తల్లి కన్నీరు మున్నీరయ్యారు. మరో వైపు ఫణీంద్ర మృతదేహాన్ని చూసి తల్లి దండ్రులు వెంకన్న, వరలక్ష్మి మాటలేకుండా పడిపోయారు. వ్యాపారం చూసుకుంటూ ఉపాధి పొందుతున్నావను కుంటే ఇలా అర్ధాంతరంగా కడుపు కోత మిగులుస్తావా! అంటూ రోధించారు. పలువురు గ్రామస్తులు మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.
నలుగురి స్నేహాన్ని చూడలేకపోయిన మృత్యుదేవత
మృతులు ఫణీంద్ర, బుచ్చిరాజుగుప్తా, తేటకాయల నరేంద్ర, గాడిదల సుబ్రహ్మణ్యం చిన్ననాటి నుంచి విడదీయని స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా వారు నలుగురే వెళతారు. ఈ సందర్భంలోనైనా వారు ఒకరిని విడిచి ఒకరు ఉండరు.ఈ నేపథ్యంలో ఆ నలుగురు యువకులు మంగళవారం మారేడుమిల్లి మండలం జీఎంవలస పంచాయతీ పరిధిలోని పాములేరు గ్రామానికి విహారయాత్రకు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. విహారానికి వెళ్లిన వారిలో ఇద్దరిని మృత్యువు కాటేసింది. వారి స్నేహాన్ని మృత్యురూపంలో విడదీసిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు
అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment