విహారానికి వెళ్లిన నలుగురు స్నేహితులు
మారేడుమిల్లి/గొల్లప్రోలు: విహార యాత్రలో పెనువిషాదం చోటు చేసుకుంది. సరదాగా ప్రకృతి ఒడిలో సేదదీరుదామని వెళ్లిన యువకులను ప్రమాదం పలకరించింది. మారేడుమిల్లి మండలం జీఎం వలస సమీపంలోని పాములేరు వాగు వద్దకు విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యు వకులు స్నానానికి దిగి మంగళవారం సాయంత్రం గల్లంతయ్యారు. గొల్లప్రోలు మండలం చే బ్రోలు గ్రామానికి చెందిన నందిగాడ ఫణీంద్ర (21), యు.కొత్తపల్లి గ్రామానికి చెందిన గ్రంధి బుచ్చిరాజు గుప్తా(21) అనే ఇద్దరు పాములేరులో స్నానానికి దిగి గల్లంతయ్యారు. అయితే ఫణీంద్ర మృతదేహం లభ్యం కాగా బుచ్చిరాజుగుప్తా ఆ చూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వర్షం రావడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది.
వాగులో చిక్కుకొని..
గ్రామానికి చెందిన స్నేహితులు నందికాళ్ల ఫణీంద్ర(21), గ్రంధి బుచ్చిరాజు గుప్తా(21), గాడిదల సుబ్రహ్మణ్యం, తేటకాయల నరేంద్ర వేసవి విహారం కోసం మోటార్‌సైకిళ్లపై మారేడుమిల్లి వెళ్లారు. పాములేరు వాగులో స్నానానికి దిగిన ఫణీంద్ర , బుచ్చిరాజుగుప్తా వాగులో చిక్కుకున్నారు. దీంతో మిగిలిన ఇద్దరు çసుబ్రహ్మణ్యం, నరేంద్ర సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందజేశారు. మారేడుమిల్లి సీఐ రవికుమార్, ఎస్సై తులసీరావు సిబ్బందితో, గజఈతగాళ్లతో గాలింపు చర్యలకు ఏర్పాట్లు చేశారు. అయితే అప్పటికే భారీ వర్షం కురవడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. మృతులు గొల్లప్రోలు ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.
చిన్నప్పటి నుంచీ స్నేహబంధం
చిన్నప్పటి నుంచీ నలుగురు స్నేహితులు కలిసి మెలసి ఉంటున్నారు. చదువు అనంతరం ఎవరికి వారు స్వయం ఉపాధి అవకాశాలను ఎంచుకున్నారు. అయితే సరదాలకు, సంతోషాలకు నలుగురూ కలసి వెళ్తుంటారు. ప్రతిరోజు ఒకరిని ఒకరు కలుసుకుని మంచి, చెడు మాట్లాడుకుంటారు. వేసవి కావడంతో మారేడుమిల్లి వెళ్లి సరదాగా గడుపుదామని ఉదయం వెళ్లారు. ఇంతలో సాయంత్రానికి ఈ సంఘటనకు సంబంధించిన విషయం తెలియడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఒక్కగానొక్క కొడుకు మృతి చెందాడని..
కాగా మృతి చెందిన ఫణీంద్ర అసలు గ్రామం కొత్తపల్లి మండలం మూలపేట. కాగా కొంతకాలంగా చేబ్రోలులో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లిదండ్రులు నందికాళ్ల వెంకన్న, వరలక్ష్మి ఒక్కగానొక్క కొడుకు మృతి చెందాడన్న వార్త తెలుసుకుని కన్నీరుమున్నీరయ్యారు. తల్లి వరలక్ష్మి గుండెలవిసేలా రోదించారు. గల్లంతైన గ్రంధి బుచ్చిరాజు గుప్తా ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క బిడ్డ ఏమయ్యాడో అని తల్లిదండ్రులు రాంబాబు, సుజాత ఆందోళన చెందారు. వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటున్న తన కుమారుడు ఎలా ఉన్నాడో అని ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తోటి స్నేహితులు ఆందోళన చెందారు.
Comments
Please login to add a commentAdd a comment