జగదీశ్వరరావుకు లక్షరూపాయలు అందిస్తున్న స్నేహితులు
హిరమండలం: కష్టాల్లో వెన్నంటి ఉండి.. ఆపదలో మేమున్నామంటూ స్నేహితుడికి అండగా నిలిచారు. మిత్రుడు ప్రమాదానికి గురై కదల్లేని స్థితిలో ఉండటాన్ని చూసి చలించిపోయారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాన్ని చూసి తట్టుకోలేకపోయారు. వైద్య ఖర్చులకు రూ.లక్ష అందజేశారు. ప్రతి నెలా మందులకు రూ.5000 ఇవ్వాలని నిర్ణయించారు హిరమండలానికి చెందిన స్నేహితులు!! మండలంలోని గులుమూరు గ్రామానికి చెందిన గొర్లె జగదీశ్వరరావు 1997–2000 వరకు అనకాపల్లిలో డిగ్రీ చదివాడు. అదే సమయంలో హిరమండలం నుంచి మరో పది మందికి పైగా విద్యార్థులు అదే కాలేజీలో చదివారు. ఇంటర్వ్యూకు హైదరాబాద్ వెళతున్న జగదీశ్వరరావు ప్రమాదానికి గురై పూర్తిగా నడవలేని స్థితికి చేరుకున్నాడు. జగదీష్ వైద్యం చేయించేందుకు తల్లిదండ్రులు అప్పులు చేసి ఆస్పత్రులకు తీసుకెళ్లినా.. ఫలితం లేకపోయింది. అప్పటినుంచి పూర్తిగా మంచానికే జగదీశ్వరరావు పరిమితమయ్యాడు.
పేద కుటుంబం కావడంతో శస్త్రచికిత్స కోసం తల్లిదండ్రులు.. తమకున్న కొద్ది పాటి భూమిని అమ్మి అప్పులు చేశారు. నెలకు దాదాపు రూ.4 వేలు మందులకు ఖర్చువుతోంది. ఈ విషయం తెలుసుకున్న డిగ్రీ స్నేహితులు కలవల గోపాలరావు, కొప్పురౌతు రాజనారాయణ, బి.నాగరాజు, బోర శ్రీధర్, కలవల నాగభూషణ్‌రావు, వెంకటరమణ ఆదివారం జగదీశ్వరరావుని పరామర్శించారు. కుటుంబసభ్యులకు రూ.లక్ష అందించారు. మందుల ఖర్చులకు నెలకు రూ.5000 ఇచ్చేందుకు నిర్ణయించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. కన్నీరుమున్నీరవుతూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment