
నేటి నుంచి మూడో విడత జగన్ సమైక్య శంఖారావం
సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడో విడత సమైక్య శంఖారావం యాత్ర ఆదివారం తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి ప్రారంభం కానుంది. ఉదయం తొమ్మిది గంటలకు ఆయన తంబళ్లపల్లెలోకి ప్రవేశించి పలు ప్రాంతాల్లో రోడ్‌షోలో పా ల్గొంటారు. తంబళ్లపల్లెలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభం కానుంది.
జిల్లాలోకి ఆయన ప్రవేశించే ప్రాంతంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేపట్టారు. జగన్‌మోహన్‌రెడ్డి రాక కోసం తంబళ్లపల్లె నియోజకవర్గం ఎదురుచూస్తోంది. ఆయన వచ్చే మార్గానికి ఇరువైపులా భారీ ఫ్లెక్సీలతో స్వాగత ఏర్పాట్లు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 29వ తేదీన కుప్పం నుంచి యాత్రను ప్రారంభించారు. కుప్పం, పలమనేరుల్లో తొలి విడత యాత్రను పూర్తి చేశారు. రెండో విడత యాత్ర డిసెంబరు 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చేపట్టారు. పలమనేరు నుంచి ప్రారంభ మైన రెండో విడత యాత్ర పుంగనూరు మీదుగా మదనపల్లె వరకు సాగింది. మూడో విడత తంబళ్లపల్లె నుంచి ప్రారంభం కానుంది.
ఈ పర్యటనలో భాగంగా పలు ప్రాంతాల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఆదివారం 15 ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించనున్నారు. నాయనబావి, గుట్ట, ఉలవలవారిపల్లెలో మహానేత వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారమే తంబళ్లపల్లెకు చేరుకున్నారు.
నేటి పర్యటన ఇలా...
ఉదయం 9.00 గంటలకు తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి పర్యటన ప్రారంభమవుతుంది. బెంగళూరు నుంచి జిల్లాలోని ప్రవేశించే ఆయన ముందుగా శంకరాపురంలో సుబహాన్ సాహెబ్ కుటుంబాన్ని ఓదారుస్తారు. అక్కడ నుంచి బి.కొత్తకోట, కొండకిందపల్లె, గుట్ట, పట్రవారిపల్లె, గట్టుపాళెం, నాయనబావి, ఉలవలవారిపల్లె, పయపుగారిపల్లె, పత్తిరెడ్డిగారిపల్లె, చేదబావిపల్లె, తోకలపల్లె, శీలంవారిపల్లెలో సమైక్య శంఖారావం యాత్రలో పాల్గొంటారు. తర్వాత కనికలతోపు, కోటిరెడ్డిగారిపల్లె, కాండ్లమడుగు క్రాస్ మీదుగా కంచెవారిపల్లె, చెన్నామర్రిమిట్ట, దొమ్మనమ్మబావి, అంగళ్లులో పర్యటిస్తారు. అంగళ్లులో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కురబలకోటలో రోడ్‌షో నిర్వహించి, తిరిగి అంగళ్లు చేరుకుంటారు. అక్కడ రాత్రి బస చేస్తారని ప్రోగామ్ కో-ఆర్డినేటర్ తలసిల రఘురాం, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి తెలిపారు.