
కూలిన మిగ్ విమానం ఇంధన ట్యాంక్
- పేలుడు కారణంగా భారీ మంటలు
- విశాఖ విమానాశ్రయంలో కలకలం
గోపాలపట్నం, మల్కాపురం(విశాఖ): విశాఖ విమానాశ్రయంలో సోమవారం ఉదయం 10 గంటల ప్రాం తంలో ఐఎన్‌ఎస్ డేగా నుంచి రోజూ మాదిరిగానే నాలుగైదు యుద్ధ విమానాలు విన్యాసాల కోసం బయల్దేరాయి. వాటిలో మిగ్-57 విమానం రన్‌వే నుంచి గాల్లోకి ఎగురుతున్న సమయంలో విమానంలోని ఇంధన ట్యాంకు రన్‌వేపైకి జారిపడింది. పెలైట్ అప్రమత్తమై విమానాన్ని ఆపకుండా గాల్లోకి దూసుకుపోవడంతో ప్రమాదం తప్పింది. ఇంధన ట్యాంకు పడిన చోట గడ్డి కూడా తగలబడడంతో మంటలు చెలరేగాయి. వెంటనే ఐఎన్‌ఎస్ డేగాతోపాటు, విమానాశ్రయం నుంచి అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలు ఆర్పాయి.
కాగా ఇంధన ట్యాంకుకు చెందిన ఒక శకలం మల్కాపురం హెచ్‌పీసీఎల్ సీఐఎస్‌ఎఫ్ క్వార్టర్స్‌లో పడటంతో పారిశ్రామిక ప్రాంత ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ సంఘటనతో విమానాల రాకపోకలు గంటకుపైగా నిలిచిపోయాయి. ఫలితంగా పలు విమానాలు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. అయితే విమానం నుంచి ఇంధన ట్యాంకు నగరంలో పడి ఉంటే పరిస్థితేంటని జనం భయంతో చర్చించుకున్నారు. ఇలాంటి ఘటన జరగడం విశాఖలో ఇది రెండోసారి.