మార్కెటింగ్ శాఖ లక్ష్యాలను ఛేదించి అదనపు ఆదాయాన్ని రాష్ట్ర శాఖకు మిగిల్చిపెట్టింది.
కడప అగ్రికల్చర్ : మార్కెటింగ్ శాఖ లక్ష్యాలను ఛేదించి అదనపు ఆదాయాన్ని రాష్ట్ర శాఖకు మిగిల్చిపెట్టింది. అధికారులు, సిబ్బంది నిత్య పర్యవే క్షణతోనే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. చెక్‌పోస్టుల వద్ద శాఖ అధికారులు ఉంటూ రోడ్లపై వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల రవాణా నుంచి ఫీజు వసూలు చేయడంతో మార్కెటింగ్ శాఖకు ఆదాయం సమకూరింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది వెంటబడి మరీ ఆదాయ పెంపునకు తీవ్రంగా కృషి చేశారని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఒక వైపు కరువు పరిస్థితులు ఉన్నప్పటికి, మరోవైపు తెలంగాణకు ధాన్యం, వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల రవాణా జరగకపోవడం కూడా జిల్లా మార్కెటింగ్ శాఖకు కలిసొచ్చిందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మార్కెటింగ్ శాఖకు 12 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 9.39 కోట్లు మార్కెటింగ్ ఫీజు వసూలు లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఫిబ్రవరి నెల మొదటి వారం వరకు రూ.11.23 కోట్ల ఫీజు వసూలు చేసి లక్ష్యాన్ని ఛేదించారు.
ఇదే సమయానికి గత ఏడాది రూ. 8.27 కోట్లు మాత్రమే వసూలైంది. జిల్లాలో 12 మార్కెటింగ్ కమిటీలుంటే అందులో గత 10 నెలలకు గాను రైల్వేకోడూరు మార్కెట్ కమిటీ రూ.92.10 లక్షలకు రూ. 123.23 లక్షలు వసూలు చేసి ప్రగతిలో ముందు వరుసలో ఉంది. సిద్ధవటం మార్కెట్ కమిటీ రూ.20.30 లక్షలకు గాను రూ. 20.06 లక్షలు(98.81 శాతం), రాజంపేట మార్కెట్ కమిటీ 50.50 లక్షలకు 44.63 లక్షలు వసూలు చేసి చివరి వరుసలో ఉన్నాయి. మిగతా 11 మార్కెట్ కమిటీలు వారికి ఇచ్చిన లక్ష్యాలను చేరుకున్నాయి. మార్చి ఆఖరుకు కేటాయించిన లక్ష్యాల కంటే అదనంగా రాబడితో పాటు, కమిటీల్లో మిగులు ఉంటుందని, దీంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎంతో వీలుంటుందని ఏడీ ఉపేంద్రకుమార్ తెలిపారు.
ఫీజు వసూలులో అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయం..
మార్కెట్ కమిటీలు ప్రగతి సాధించడంలో అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయం. ఒక వైపు కరువు పరిస్థితులు ఉన్నా శాఖకు వసూలు లక్ష్యాలు సాధించలేరేమోననే అనుమానాలు ఉండేవి. అయితే ఆ అనుమానాలకు తావులేకుండా వసూలు లక్ష్యాలు ఛేదించారు.
- సీతారామాంజనేయులు, రీజినల్ జాయింట్ డెరైక్టర్, రాయలసీమ మార్కెటింగ్‌శాఖ.