కాలుమోపే చోటుంటే చాలు..
సాక్షి, సిటీబ్యూరో/హైదరాబాద్/శంషాబాద్ న్యూస్‌లైన్: పండగ ప్రయాణికులతో హైదరాబాద్ నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు శుక్రవారం కిటకిటలాడాయి. నుంచునే చోటు దొరికితే చాలు ప్రయాణం చేసేద్దామనే ఆత్రం ప్రయాణికుల్లో కనబడింది. సికింద్రాబాద్, నాంపల్లి,కాచిగూడ రైల్వేస్టేషన్లనుంచి సాధారణ రోజుల్లో 58 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, వందకు పైగా ప్యాసింజర్‌లు వివిధ ప్రాంతాలకు వెళ్తాయి. సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాది 43 ప్రత్యేక రైళ్లతోపాటు రెగ్యులర్ రైళ్లలో అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. సాధారణ రోజుల్లో కంటే రైళ్లలో అదనంగా ఒక్క శుక్రవారమే లక్ష మందికి పైగా వివిధ ప్రాంతాలకు వెళ్లారు. మరోవైపు ఆర్టీసీ శుక్రవారం 1725 బస్సులను ప్రయాణికుల కోసం సిద్ధం చేసింది. సాధారణ రోజుల్లో కంటే 50 శాతం ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారని అంచనా.
రైలు ప్రయాణం నరకమే
రెగ్యులర్ రైళ్లలో టికె ట్లు నెల క్రితమే అయిపోగా.. ప్రత్యేక రైళ్లు ఏమాత్రం సరిపోక ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. ప్రత్యేక రైళ్ల టికెట్లు దళారులు బ్లాక్ చేయటంతో ప్రయాణికులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. అయితే ఒకపక్క ప్రత్యేక రైళ్ల సంఖ్య పెంచడానికి బోగీల కొరత తీవ్రంగా ఉండగా.. మరోపక్క ఉన్న రెండు లైన్లలో ఎక్కువ రైళ్లను తిప్పడానికి అవకాశం లేకుండా ఉంది. ఆ లైన్లలో అదనంగా రైళ్లు నడిపితే సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతినే ఆస్కారం ఉండడంతో రైళ్ల సంఖ్య పెంచేందుకు కూడా ఉన్నతాధికారులు అనుమతించటం లేదు. ఇక రైళ్ల రాకపోకలపై స్పష్టమైన సమాచారం లేక శుక్రవారంప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏ రైలు ఏ ప్లాట్‌ఫామ్‌పైకి ఏ సమయానికి వస్తుందో తెలియక వివిధ స్టేషన్లలో గందరగోళం నెలకొంది.
జనరల్ బోగీలకు తాకిడి ఎక్కువగా ఉండడంతో సీట్లు దొరకక చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రైళ్ల కోసం గంటలకొద్దీ వేచి ఉంటున్న ప్రయాణికులు అది రాగానే ఒక్కసారిగా ఎగబడుతుండటంతో తొక్కిసలాట జరుగుతోంది. పోలీసులు ఉన్నా నియంత్రించడం కష్టమవుతోంది. ఇక సీట్లను ఆక్రమిస్తున్న దళారులు రూ.100 నుంచి రూ.200 చొప్పున అమ్ముకుంటున్నారు. తత్కాల్ టికెట్ల కోసం తెల్లవారుజామునే క్యూలలో నిలబడుతున్నా ఆ టికెట్లను దళారులు కాజేస్తుండటంతో కౌంటర్ తెరిచిన కొద్ది సేపటికే వెయిటింగ్ లిస్ట్ కనబడుతోంది.
కొండెక్కిన చార్జీలు..
పండగ ప్రయాణికులను బస్సులు చార్జీలతో బాదేస్తున్నాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం చార్జీలు అదనంగా వసూలు చేస్తుంటే.. ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం అవకాశం బట్టి రెట్టింపు నుంచి మూడురెట్లుకు పైగా దోచేస్తున్నాయి. పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రద్దీ రూట్లలో ఆర్టీసీ 4,960 ప్రత్యేక బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేసింది. అయితే వ్యాపార ధోరణితో వ్యవహరిస్తూ ఆ ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. విజయవాడ, వైజాగ్, గుంటూరు రూట్లలో మూడు రెట్లకు పైగా చార్జీలు వసూలు చేస్తుండగా.. రాజమండ్రి, కాకినాడ రూట్లలో రెట్టింపు పైగా గుంజేస్తున్నాయి. సంక్రాంతి పండగ, వైకుంఠ ఏకాదశి పుణ్యతిధితో విమానయాన చార్జీలు కూడా రెండు రెట్లు పెంచేశారు.