అభివృద్ధి పనులకు పూర్తి సహకారం | Full support for development works -MP MEKAPATI rajamohanreddy | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులకు పూర్తి సహకారం

Published Sat, Mar 19 2016 3:44 AM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

అభివృద్ధి పనులకు పూర్తి సహకారం - Sakshi

అభివృద్ధి పనులకు పూర్తి సహకారం

ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి

 కలిగిరి : గ్రామాల్లో అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తామని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. కలిగిరి పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు, స్థానిక సర్పంచ్ పాలూరి మాల్యాద్రిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమానికి ఎంపీ మేకపాటి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్రెడ్డి, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి మాట్లాడారు. రాష్ట్రంలో పాలన సజావుగా లేదని, జన్మభూమి కమిటీల పేరుతో అర్హులకు సంక్షేమ పథకాలు అందడంలేదని ఆరోపించారు.

సీఎం చంద్రబాబు  ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకోవడంతో ఆయన ప్రతిష్టకే భంగం కలుగుతుందన్నారు. రాజధాని నిర్మాణం చేపడతామంటూ కొంత మంది భూములను దక్కించుకుంటున్నారని తాను సున్నితంగా విమర్శలు చేశాన ని, దీంతో తనపై ఓ చానల్లో అసత్య కథనాలను ప్రసారం చేసి తనపై విషం చిమ్మారని ఆరోపించారు. మర్రిపాడు మండలం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని, తన సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆన్ని గ్రామాలకు మౌలిక వసతులను కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. తామెప్పుడూ వాస్తవాలనే మాట్లాడతామని చెప్పారు.

దివంగత సీఎం వైఎస్సార్ పుణ్యమాని ఉత్తరకాలువ మంజూరైందని, ఈ ప్రాంతానికి ఉత్తర కాలువ ఎంతో మేలు చేస్తుందన్నారు. ప్రజలకు న్యాయం చేయడంలో సీఎం చంద్రబాబు విఫలమవుతున్నారని మండిపడ్డారు. సర్పంచ్ మాల్యాద్రిరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీలో రూ.50 లక్షలకు పైగా నిధులతో సిమెంట్ రోడ్లు, రక్షిత మంచినీటి పథకాలు, తదితర అభివృద్ధి పనులను చేపట్టడాన్ని అభినందించారు. పారిశుధ్య మెరుగునకు ట్రాక్టర్, ట్రక్కును తన నిధుల నుంచి అందజేశానని వివరించారు.

అనంతరం రాఘవేంద్రరెడ్డి మాట్లాడారు. జెడ్పీ నిధుల నుంచి రూ.మూడు కోట్లతో ఉదయగిరి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను చేపట్టానన్నారు. కలిగిరి మండలానికి సంబంధించి రూ.45 లక్షలను పాఠశాల, వసతి గృహాలు, గ్రామాల్లో తాగునీటి సమస్యలకు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ నోటి శ్రీనివాసులురెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెలుగోటి మధు, ఉప సర్పంచ్ మోటుపల్లి వెంకటలక్ష్మి, స్థానిక నాయకులు బొల్లినేని వెంకటసత్యనారాయణ, బాపతి చెన్నారెడ్డి, అంకిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement