అమలాపురం :ఈ సీమవాసుల భాగ్యరేఖ నుదుటిపై కాదు.. నీటిబొట్టుపై రాసి ఉంటుంది. దాన్ని తొలుత రాసిన వాడు సర్ ఆర్థర్ కాటన్. ఆయన సృష్టించిన గోదావరి డెల్టాకు కాలువలు, చానళ్లు, బోదెలు జీవనాడులు. క్షామ పీడిత ప్రాంతంలో సిరులు కురిపించి.. డెల్టావాసుల తలరాతలు మార్చిన భాగ్యరేఖలు. పచ్చని పంటపొలాలు.. పాలవెల్లువలతో డెల్టా రైతుల కుటుంబాలు భోగభాగ్యాలు అనుభవిస్తున్నాయంటే అందుకు ధవళేశ్వరం ఆనకట్ట, తరువాత కాలంలో బ్యారేజ్ ఎంత కారణమో.. బ్యారేజ్ వద్ద నుంచి నీరు పంట చేలకు అందించే పంట కాలువలు, చానళ్లు, బోదెలు అంతే కారణం. కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ, కోట్ల రూపాయల ఆదాయాన్ని పంచుతున్న ఆ కాలువలు కనీస మరమ్మతులకు నోచుకోక కుచించుకుపోవడంతో డెల్టా రైతులు అవస్థలు పడుతున్నారు. నష్టాల పాలవుతున్నారు.
పూర్తయినవి అతి తక్కువ పనులే..
గోదావరి డెల్టా పంటకాలువలు, మురుగునీటి కాలువలు పూడుకుపోయి, నానాటికీ చిక్కి శల్యమవుతున్నాయి. దశాబ్దాలుగా కనీస మరమ్మతులకు నోచుకోని ఈ కాలువల ఆధునికీకరణకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ పనులు పూర్తయి ఉంటే డెల్టా పూర్వవైభవం సంతరించుకునేది. అయితే టెండర్లు ఖరారు కాకపోవడం, ఖరారైన చోట పనులు పూర్తి కాకపోవడం, కాంట్రాక్టర్లు దోపిడీ కోసం కేవలం మట్టిపనులు మాత్రమే చేయడం, అందుకు అధికారులు వత్తాసు పలకడం, రైతులు సకాలంలో రబీ పూర్తి చేయకపోవడం, లాంగ్ క్లోజర్‌కు సమయం లేదని చిన్నచిన్న పనులతో సరిపెట్టడం వెరసి డెల్టా ఆధునికీకరణ మరుగున పడిపోయింది. జిల్లాలో రూ.1,670 కోట్లతో 2008లో మొదలైన ఈ పనుల్లో ఇప్పటి వరకు కేవలం రూ.319 కోట్ల పనులు మాత్రమే పూర్తి కావడం గమనార్హం. వీటిలో పంట కాలువలపై రూ.245 కోట్లు, మురుగునీటి కాలువలపై రూ.74 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి.
బాబు రాకతో కొండెక్కనున్న ఆధునికీకరణ!
దివంగత నేత వైఎస్‌ఆర్ హయాంలో పరుగులు పెట్టిన డెల్టా ఆధునికీకరణ పనులు తరువాత ముఖ్యమంత్రులుగా ఉన్న కె.రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలలో మందగించాయి. ఇక చంద్రబాబు ప్రభుత్వం రాకతో ఆధునికీకరణ పనులు కొండెక్కుతాయని రైతులు అనుమానిస్తున్నారు. ఈ పనులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు, అధికారులు ఖర్చుపెట్టిన తీరు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. గత ఏడాది రూ.75 కోట్లతో పనులు చేయాలని తొలుత నిర్ణయించి, కేవలం రూ.30 కోట్ల పనులు కూడా చేయలేదు. ఇది చూసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.30 కోట్లు కేటాయించింది. పశ్చిమ వాటా పోగా మన జిల్లాకు వచ్చేది రూ.15 కోట్లు కావడం గమనార్హం. ఈ కేటాయింపులు చూపి బాబు ఉండగా డెల్టా ఆధునికీకరణ పూర్తయ్యే అవకాశం లేదని రైతులు ఒక అంచనాకు వస్తున్నారు. ఆధునికీకరణ పనులకు పెద్దగా కేటాయింపులు చేయని ప్రభుత్వం డెల్టాను ఎడారి చేస్తుందేమోనని రైతులు భయపడుతున్న తరుణంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి మొత్తం నిధులు కేటాయించి ఏడాదిలో పూర్తి చేయాలని నిర్ణయం విశేషం.
ఏటా రూ.150 కోట్లకు పైగా నష్టం
డెల్టాలో పంట, మురుగునీటి కాలువలు పూడుకుపోవడంతో రైతులు ఏటా కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. ఖరీఫ్‌లో చేలు మునిగిపోవడం, రబీలో ఎండిపోవడం షరామామూలుగా మారింది. ఈ నష్టం ఏటా రూ.150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కనీసం పంటకాలువల్లో పూడిక తొలగించకపోవడం వల్ల శివారుకు నీరందక చేలు ఎండిపోతున్నాయి. డెరైక్ట్ పైప్‌లు(డీపీలు) పూడుకుపోతున్నా పట్టించుకునేవారు లేక శివారు, మెరక భూములకు నీరు చేరడంలేదు. ప్రస్తుత రబీలో సుమారు 15 వేల ఎకరాల్లో పంటదెబ్బతినే అవకాశం ఉందని అంచనా. నిధులు కేటాయించకపోవడంతో చానల్‌లు, డ్రైన్లు, పంటకాలువలు, పంటబోదెలను ఉపాధి హామీ పథకంలో మరమ్మతులు చేయాల్సి వస్తోంది. కూలీలు లెవెల్స్ పాటించకుండా ఇష్టానుసారం పనులు చేపట్టడంతో రైతులకు ఏ మాత్రం ప్రయోజనం ఉండడంలేదు.
ఆధునికీకరణకు నిధులేవీ?
Published Sun, Mar 29 2015 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM
Advertisement
Advertisement