ఉమ్మడి సంస్థల నిధుల స్తంభన | Funds stranded in institutes of two states | Sakshi
Sakshi News home page

ఉమ్మడి సంస్థల నిధుల స్తంభన

Published Thu, Nov 13 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

ఉమ్మడి సంస్థల నిధుల స్తంభన

ఉమ్మడి సంస్థల నిధుల స్తంభన

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలోని 7, 9, 10వ షెడ్యూళ్లలోని సంస్థలకు చెందిన నిధులను స్తంభింపజేయాలని బ్యాంకులు నిర్ణయించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా.. తమకు తెలియజేయకుండా ఎటువంటి లావాదేవీలను కొనసాగించరాదంటూ బ్యాంకులకు సర్క్యులర్లు జారీ చేయడమే ఇందుకు ప్రధాన కారణం.
 
 ఏపీ ప్రభుత్వం ఇచ్చే ఏకపక్ష ఆదేశాల మేరకు ఉమ్మడి రాష్ట్ర నిధులకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు నిర్వహించరాదని, విషయం ఏదైనా తమకు తెలియజేయాలని, లేదంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని టీ సర్కార్ తన సర్క్యులర్‌లో పేర్కొంది. రాష్ట్ర విభజన చట్టంలోని పలు షెడ్యూళ్లలో పేర్కొన్న పలు సంస్థలు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినవైనందున వాటి నిధులు కూడా ఉమ్మడి రాష్ట్రం కిందకే వస్తాయని, అందువల్ల ఆ నిధులను ఏకపక్షంగా ఏపీ ప్రభుత్వానికి బదిలీ చేయకుండా ఫ్రీజ్ చేయాలని బ్యాంకులను కోరింది. దీనిపై బ్యాంకులు ఏపీ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరాయి.
 
 దీంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ బ్యాంకులకు మరో సర్క్యులర్ జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని, యధాప్రకారం ఆయా సంస్థల అథారిటీల ఆదేశాల మేరకు ఆర్థిక లావాదేవీలను కొనసాగించాలని పేర్కొంది. ఈ విషయంలో టీ సర్కారు ఎటువంటి చర్యలు తీసుకున్నా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సూచించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వివాదాలను పరిష్కరించుకుని, బ్యాంకింగ్ కార్యకలాపాలపై సంయుక్తంగా ఆదేశాలు ఇస్తేనే అమలు చేయాలని బ్యాంకులు నిర్ణయించుకున్నాయి.
 
 ఉమ్మడి సంస్థల్లోని నిధులను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేసుకోవాల్సి ఉంది. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ గవర్నెన్స్‌కు చెందిన రూ.35 కోట్లను ఏపీ ప్రభుత్వానికి చెప్పకుండా బదిలీ చేసుకోవడంతో.. ఏపీ ప్రభుత్వం స్పేస్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్‌కు చెందిన రూ.22.50 కోట్ల నిధులను తెలంగాణకు సమాచారం ఇవ్వకుండానే విజయవాడకు బదిలీ చేసుకుంది. అలాగే కార్మిక సంక్షేమ నిధికి చెందిన నిధులను కూడా బదిలీ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులకు సర్క్యులర్లు జారీ చేశాయి. ఆయా సంస్థల్లో ఉమ్మడి రాష్ట్రానికి చెందిన డిపాజిట్లు గానీ, నిధులు గానీ సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఉంటాయని అధికారుల అంచనా.
 
 ఈ నిధులను స్తంభింపజేయాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు వేర్వేరుగా జారీ చేసే ఆదేశాల మేరకు వాటిని విడుదల చేయరాదని బ్యాంకులు నిర్ణయించుకున్నాయి. ఈ అంశంపై ఇరు రాష్ట్రాలూ ఒక అంగీకారానికి రావాల్సి ఉందని, త్వరలోనే రెండు రాష్ట్రాల సీఎస్‌ల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement