గడ్డుకాలం
ఎమ్మిగనూరు: రైతన్నపై ప్రకృతి పగబట్టింది. అతివృష్టి, అనావృష్టితో ఈ ఏడాది పంటలు పండని పరిస్థితిని నెలకొంది. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 5.65 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. అత్యధికంగాపత్తి 2.85లక్షల హెక్టార్లలో, వేరుశనగ 85వేల హెక్టార్లలో, ఉల్లి 21500 హెక్టార్లలో సాగైంది. ఖరీఫ్ అంకురంలో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులు, ఆ తర్వాత అధిక వర్షాలు, మళ్లీ వర్షాభావ పరిస్థితులు.. రైతును తీవ్రంగా నష్టపరిచాయి. పండిన పంటను అమ్ముకుందామన్న గిట్టుబాటు ధర లభించడం లేదు.
అన్నదాత ఆవేదన పట్టించుకునే వారు కరువయ్యారు. పత్తి రైతులు ఎకరాకు రూ. 25వేల వరకు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు పక్వానికి వచ్చిన పత్తి కాయలు నేల రాలుతున్నాయి. ఎకరానికి సగటున 3, 4 క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి కానరావడం లేదు. ధర క్వింటాల్‌కు రూ. 3500 నుంచి రూ. 4800 వరకు పలుకుతోంది.
గత ఏడాదితో పోలిస్తే క్వింటాళ్లకు రూ. 1500 దాకా ధరల తగ్గింది. ఈ ఏడాది ఉల్లి రైతుకు కన్నీళ్లే మిగిలాయి. సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు పంట నీటి పాలైంది. పొలాల్లోనే తడిసి కుళ్లిపోయింది. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఉల్లి దిగుబడులు ఈ ఏడాది ఆశాజనకంగా ఉండడంతో వ్యాపారులు ధరను అమాంతం తగ్గిస్తున్నారు. క్వింటాల్ * 400ల నుంచి * 700ల దాకా అమ్ముడుపోయాయి. ఎకరాకు రూ. 40వేల నుంచి రూ. 50వేల వరకు పెట్టి ఉల్లి పండిస్తే పండించిన రైతుకు రవాణ ఛార్జీలు (లారీ బాడుగ) కూడా రావడం లేదు.
వేరుశనగ రైతులదీ అదే పరిస్థితి ..
జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట వేరుశన.గ. రెండేళ్ల క్రితం వరకు ఖరీఫ్‌లో 2.45 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగయ్యేది. ప్రస్తుతం 85వేల ఎకరాలకు పడిపోయింది. ఎకరాకు రూ. 20వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ఎకరాకు 2 క్వింటాళ్లు కూడా దిగుబడి రావడం లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలే పేర్కొంటున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల భూమి గట్టిపడి వేరుశనగను కోత (పీకడం) కోయలేని పరిస్థితి. పండిన అరకొర పంటలను కూడా మార్కెట్‌కు.. కనిష్టంగా క్వింటాల్ రూ. 1800, గనిష్టంగా రూ. 3800ల వరకు ధర పలుకుతోంది.