ముదిరిన ‘ఇన్నర్’ వివాదం | Gannavaram TDP MLA protests alleged false case, CM sends pacifiers | Sakshi
Sakshi News home page

ముదిరిన ‘ఇన్నర్’ వివాదం

Published Tue, Feb 16 2016 4:23 AM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM

ముదిరిన ‘ఇన్నర్’ వివాదం

ముదిరిన ‘ఇన్నర్’ వివాదం

* బెయిలొద్దు.. జైలుకే వెళ్తానన్న ఎమ్మెల్యే వంశీ
* బుజ్జగించిన ఎంపీ కొనకళ్ల, బచ్చుల అర్జునుడు
* టీడీపీలో అంతర్మథనం

సాక్షి, విజయవాడ : ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపింది. దీనికి కావాల్సిన స్థల సేకరణ నిమిత్తం రామవరప్పాడులోని పేదల ఇళ్ల తొలగింపునకు అధికారులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం విధి నిర్వహణలో భాగంగా అక్కడికొచ్చిన అధికారులను అడ్డుకున్నారంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై పటమట పోలీసులు కేసు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది.

రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులకు సర్దిచెప్పడానికి వెళ్లిన తనను ఏ-1 నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేయడంతో వంశీ తీవ్ర మనస్తాపం చెందారు. ఆ వెంటనే గన్‌మెన్‌లను వెనక్కిపంపాలని నిర్ణయించడం పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..తనపై పెట్టిన అక్రమ కేసుకు నిరసనగా తానే పోలీసు స్టేషన్‌కు వెళ్లి స్వచ్ఛందంగా సరెండరై  జైలుకు వెళతానని, బెయిల్ కూడా తీసుకోనని చెప్పారు. దీంతో పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలైంది.
 
ఎంపీ కొనకళ్ల బుజ్జగింపులు
ఈ పరిణామ క్రమంలో ఎంపీ కొనకళ్ల నారాయణ వంశీతో ఫోన్‌లో మాట్లాడి బుజ్జగించారు. ఎంపీ సోదరుడు కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య), పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు వంశీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తనపై కేసు పెట్టడాన్ని వంశీ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి తనపై కేసులు పెట్టించడానికి ప్రయత్నించిన అధికార పార్టీ నేతలెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. దేవినేని బాజీకి చెందిన ఇన్నోటెల్ హోటల్ గురించి మాట్లాడడంతో ఈ విధంగా తనపై అక్రమ కేసులు పెట్టించారని  వంశీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

శనివారం రాత్రి తాను మంత్రి ఉమాతో ఫోన్‌లో మాట్లాడితే పాకలు తీసేందుకు ఇప్పుడే నోటీసులు ఇవ్వరని హామీ ఇచ్చారని, తెల్లవారేసరికి రెవెన్యూ, పోలీసులు వెళ్లి నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. తనకు, గ్రామ సర్పంచ్‌కు, ఎంపీపీలకు కూడా ముందుగా సమాచారం ఇవ్వకుండా అధికారులు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించారని బచ్చులను నిలదీశారు.
 
మంత్రి ఉమాతోనూ సమావేశం
రామవరప్పాడులో పేదలకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన అధికారులు హడావుడి చేయడంపై చర్చించేందుకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే వంశీమోహన్, అర్జునుడు, బుల్లయ్యలు ఉమా క్యాంపు కార్యాలయంలో  సమావేశమయ్యారు. ఉమా ఫోన్‌లో తొలుత వంశీతో మాట్లాడిన తరువాత ఆయన వెళ్లారు.  అధికారులు తొందర పడి నోటీసులు ఇచ్చేందుకు రావడం సరికాదని ఉమా అభిప్రాయపడినట్లు తెలిసింది.
 
కలెక్టర్, ఎంపీలతో..
సోమవారం రాత్రి ఎంపీ కొనకళ్ల నారాయణ, కలెక్టర్ బాబు.ఎ.లతో ఎమ్మెల్యే వంశీమోహన్ సమావేశమయ్యారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇప్పటికే 159 ఇళ్లు తొలగించడమే కాకుండా మరో 500 ఇళ్లు తొలగించాలని అధికారులు తీసుకున్న నిర్ణయంపై చర్చించారు. ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే పేదల ఇళ్లు తొలగించాలని వంశీ చేసిన డిమాండ్‌కు వారు సానుకూలంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement