కన్నబాబుకు 'గంటా' వాయింపు
టీడీపీ నుంచి తనకు టికెట్ హామీ రాకుంటే ఆ పార్టీకి రాజీనామా చేసి... స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు యోచిస్తున్నారు. అందుకోసం చకచక పావులు కదుపుతున్నారు. అందులోభాగంగా తనకు అత్యంత సన్నిహిత మిత్రడు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కన్నబాబు ఆదివారం విశాఖపట్నంలో భేటీ ఆయ్యారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలన్న కన్నబాబు మనసులోని మాటను మిత్రుడు గంటా ముందు ఉంచారు. దాంతో కన్నబాబును గంటా సముదాయించారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన తాను ప్రస్తుతం ఆ పార్టీలోనే కాకుండా విశాఖ జిల్లాలోని స్థానిక పార్టీ నేతలతో పడుతున్న ఇబ్బందులను కన్నబాబు ముందు గంటా వాయించి వదిలి పెట్టారు. ప్రస్తుత పరిస్థితిలో నువ్వు రాజీనామా చేస్తే తనలా ఇబ్బందులు పడతావంటూ సూచించారు. పార్టీకి రాజీనామా చేసి తొందర పడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తీవ్ర ఇబ్బందులు తప్పవంటూ కన్నబాబుకు గంటా హితవు పలికారు.
గంటా శ్రీనివాసరావుతో పాటు విశాఖ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే రానున్న ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు టికెట్ కేటాయిస్తాడన్న ఆశలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. దాంతో కన్నబాబు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.