చింతలపూడి : పట్టణాలతోపాటు పల్లెల్లోనూ ప్రస్తుతం వంట గ్యాస్ వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో గ్యాస్ వినియోగదారులకూ బీమా పథకం అందుబాటులోకి వచ్చింది. ఈ విషయం చాలామందికి తెలీదు. దీనిపై అవగాహన లేక చాలా మంది ప్రమాదాలు జరిగినప్పుడు బీమా సొమ్ము పొందలేకపోతున్నారు. ప్రమాదవశాత్తూ సిలిండర్లు పేలి నష్టం సంభవిస్తే బాధిత వినియోగదారులు గ్యాస్ కంపెనీల నుంచి పరిహారం పొందవచ్చు. ఈ బీమా రూ.ఐదులక్షల నుంచి రూ.50లక్షల వరకూ ఉంటుంది. దీనికోసం వినియోగదారులు ఎటువంటి ప్రీమియం చెల్లించనవసరం లేదు. ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్, హిందూస్థాన్ పెట్రోలియం వంటి కంపెనీలే ప్రతి గ్యాస్ కనెక్షన్‌కూ ప్రీమియం చెల్లిస్తాయి.
ఏజెన్సీలు చేయాల్సిన పని
ప్రతీ గ్యాస్ ఏజెన్సీ బీమా కవరేజి విషయాలను వినియోగదారులకు తెలిసేలా నోటీస్ బోర్డులో పెట్టాలి. కనెక్షన్ విక్రయించే సమయంలోనే వినియోగదారులకు బీమాపై అవగాహన కల్పించాలి. కానీ ఒక్క గ్యాస్ ఏజెన్సీ కూడా దీనిని పాటించడం లేదు. వినియోగదారులే ఆ విషయాల గురించి ఆరా తీసి కనుక్కోవాలి.
బీమా పొందాలంటే
గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగిన వెంటనే ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. గ్యాస్ ఏజెన్సీకి నిర్ణీత సమయంలో లిఖిత పూర్వకంగా సమాచారం అందించాలి. ఆ తరువాత పంపిణీదారు(ఏజెన్సీ డీలరు) ఆ విషయాన్ని గ్యాస్ కంపెనీకి, భీమా సంస్థకు తెలియజేయాలి. 30 రోజుల్లోగా కంపెనీ విచారణ పూర్తి చేసి క్లెయిమ్ సొమ్మును వినియోగదారులకు అందజేస్తారు. ఒకవేళ దుర్ఘటనలో మరణం సంభవిస్తే పరిహారం కోసం వినియోగదారులు కోర్టుకు కూడా వెళ్ళవచ్చు. మృతుల వయసు, అప్పటి వరకు వారి ఆదాయాన్ని లెక్కగట్టి కోర్టు పరిహారాన్ని నిర్ణయిస్తుంది.
వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బీమా పొందాలంటే వినియోగదారులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ పైపు, లైటర్, రె గ్యులేటర్, పొయ్యి తదితర వస్తువులు ఐఎస్‌ఐ మార్కు ఉన్నవే వాడాలి. గ్యాస్ ఏజెన్సీ సిబ్బందితో తరుచూ సిలిండర్, పొయ్యిని తనిఖీ చేయిస్తూ ఉండాలి. ఒకవేళ వినియోగదారు నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగినా, నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ వినియోగించినా పరిహారం వచ్చే అవకాశం ఉండదు.
గ్యాస్ వినియోగదారులకూ బీమా
Published Fri, Apr 8 2016 12:42 AM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM
Advertisement
Advertisement