జగిత్యాల, న్యూస్‌లైన్ : సబ్సిడీ గ్యాస్ అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా.. అక్రమార్కుల ఎత్తుల ముందు చిత్తవుతున్నాయి. సిలిండర్ల సరఫరాను కఠినతం చేసినప్పటికీ.. యథేచ్ఛగా పక్కదారిపడుతూనే ఉన్నాయి. జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతున్న ఈ అక్రమ దందాలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులదే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. దళారుల సహకారంతో సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్‌గా అమ్ముకుంటూ భారీగా ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు ఇటీవల గ్యాస్ సరఫరాపై అనేక ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఒక పేరుపై ఒకటికంటే ఎక్కువ కనెక్షన్లు ఉంటే వాటిని కట్ చేసింది. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి తొమ్మిది సిలిండర్లు మాత్రమే సరఫరా చేస్తోంది.
నగదు బదిలీ అమలులో భాగంగా ఆధార్‌తో గ్యాస్ కనెక్షన్‌కు లింక్ పెట్టింది. ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లాలో సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని అందరూ ఆశించారు. కానీ వినియోగదారులను నిబంధనల పేరుతో ముప్పుతిప్పలు పెడుతున్న ఏజెన్సీలు అవే నిబంధనల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని సబ్సిడీ గ్యాస్‌ను పక్కదారిపట్టిస్తున్నాయి.
ఉదాహరణకు జగిత్యాల పట్టణంలో రెండు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటి పరిధిలో దీపం పథకం కింద రెండు వేల కనెక్షన్లతోపాటు మరో లక్ష డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి గ్యాస్ వినియోగదారునికి ప్రతి సంవత్సరం తొమ్మిది సబ్సిడీ సిలిండర్లు పొందే అవకాశం ఉంది. కానీ సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఏడాదికి 3-5 సిలిండర్లు మాత్రమే వినియోగిస్తున్నాయి.
మిగిలిన సిలిండర్లను గ్యాస్ ఏజెన్సీలు దళారులకు అమ్ముకుంటున్నాయి. సబ్సిడీపై రూ.450కి వచ్చే సిలిండర్‌ను దళారులకు రూ.650కి అమ్ముతున్నారు. దళారులు డిమాండ్‌ను బట్టి ఒక్కో సిలిండర్‌ను రూ.800 వరకు విక్రయిస్తున్నారు. వీటిని హోటల్ నిర్వాహకులు, వాహన వినియోగదారులు కొనుక్కొని వాడుకుంటున్నారు.
చిన్న గ్యాస్ సిలిండర్లు అమ్మే దుకాణాల్లోను, గ్యాస్ మరమ్మతుల చేసే దుకాణాల్లో, రీఫిల్లింగ్ దుకాణాల్లో పెద్ద సిలిండర్లను కొని కమర్షియల్‌గానీ, ఇతర అవసరాలకు వినియోగించే వారికి గాని కిలోకు రూ.80-100 వరకు అమ్ముతున్నారు. ఇలా ఒక్కో సబ్సిడీ సిలిండర్‌పై చివరి వినియోగదారునికి చేరుకునే సరికి రూ.1200 పైగా ధర పలుకుతోంది. అంటే మిగిలిన రూ.750తో మధ్యలో ఉన్న దళారులు లబ్దిపొందుతున్నారు. ఈ రకంగా జగిత్యాల పట్టణంలో 70 మంది ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాలు, అన్ని పట్టణాల్లోనూ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.
కమర్షియల్ సిలిండర్లలో చేతివాటం
జగిత్యాలలో కమర్షియల్ సిలిండర్లు మూడు వేలకు పైగా కనెక్షన్లు ఉన్నాయి. ఈ సిలిండర్లు 21 కిలోల బరువు ఉంటాయి. వీటి ధర రూ.1900. గ్యాస్ ఏజెన్సీ యజమానులు కమర్షియల్ సిలిండర్ల అమ్మకం జరగకపోవడంతో వాటిని దళారులకు రూ.200 తగ్గించి రూ.1700లకు అమ్మకాలు జరుపుతుంటారు. వారు కిలోకు రూ.100 చొప్పున వ్యాపారులకు అమ్మకాలు జరుపుతున్నారు. ఈ రకమైన సబ్సిడీ మాయను కొంతకాలంగా భారీగా జరుగుతున్నా ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు. ఇలా ఒక్క జగిత్యాలలోనే నెలకు రూ.60-70 లక్షలు గోల్‌మాల్ జరుగుతున్నట్లు అంచనా.
గ్యాస్ దందా
Published Sat, Jan 4 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement
Advertisement