సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణితో పార్టీలో ఏర్పడిన స్తబ్దతను దూరం చేయాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. దసరా తర్వాత మండల స్థాయిలో శిక్షణా శిబిరాలు నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, ముఖ్య నేతలు నిర్ణయించారు. ఈ శిబిరాల నిర్వహణకు పూర్తిస్థాయి కార్యాచరణపై చర్చించడానికి తెలంగాణభవన్‌లో గురువారం పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, శిక్షణా శిబిరాల కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి, రిటైర్డు ఐఏఎస్ అధికారులు కె.వి.రమణాచారి, రామలక్ష్మయ్య, ఎ.కె.గోయల్, మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్, వి.ప్రకాశ్, దాసోజు శ్రవణ్, ప్రొఫెసర్ శ్రీధర్ తదితరులు సమావేశమయ్యారు. కేసీఆర్ టీజీవో కార్యాలయం ప్రారంభానికి వెళ్లడంతో దీనికి హాజరుకాలేదు. దీంతో కార్యాచరణపై నిర్ణయాన్ని ప్రకటించలేదు.
కేంద్రం వైఖరితో టీఆర్‌ఎస్ ఎలాంటి కార్యాచరణను ప్రకటించలేకపోతోందని, దీంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంటోందని కేసీఆర్ సహా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇలాగే కొనసాగితే మరింత ఇబ్బంది ఉంటుందని, దేనికైనా సిద్ధంగా ఉండే విధంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదించకపోతే వ్యూహం ఎలా ఉండాలి? తెలంగాణకు అనుకూల నిర్ణయమైతే ఎలా వ్యవహరించాలి అనే విషయాలపై పార్టీ శ్రేణులకు స్పష్టత ఇవ్వాలని యోచిస్తున్నారు. తెలంగాణపై కేబినెట్ నోట్ ఎలా ఉంటుంది,
ఈ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్ ముందున్న కర్తవ్యం అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ లో విలీనం తొలి మార్గం... కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు రెండో మార్గం... ఒకవేళ తెలంగాణ ఇవ్వకుంటే ఆ పార్టీతో ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడం మూడో మార్గం... ఈ మూడు మార్గాలను పార్టీ శ్రేణులను సమాయత్తం చేసుకోవడమే మంచిదని, ఇంకా ఆలస్యం చేయకుండా పార్టీ కార్యకర్తలను కార్యక్రమాల్లో మమేకం చేయాల్సిందేనని వారు నిర్ణయించారు. తెలంగాణ ఇవ్వకుంటే అప్పటికప్పుడే పోరాట కార్యాచరణకు దిగాలంటే సమస్యలు వస్తాయన్న అభిప్రాయంతో పార్టీ ముఖ్యనేతలంతా ఏకీభవించారు. ఈ దృష్ట్యా పార్టీని పటిష్టం చేసేందుకు మండల స్థాయిలో కనీసం 5వేల మందితో శిక్షణ శిబిరాలను నిర్వహించాలని భావిస్తున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ఉంటామనే సంకేతాలను ఇస్తూ కార్యాచరణకు దిగాలని నిర్ణయించారు.
దేనికైనా సిద్ధంగా ఉందాం: టీఆర్‌ఎస్
Published Fri, Sep 20 2013 3:43 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement