‘పాట’శాల.. ఘంటసాల | Ghantasala Music College in Vizianagaram | Sakshi
Sakshi News home page

‘పాట’శాల.. ఘంటసాల

Published Wed, Dec 4 2019 11:59 AM | Last Updated on Wed, Dec 4 2019 11:59 AM

Ghantasala Music College in Vizianagaram - Sakshi

తెలుగువారికి అపరిమితమైన మధురామృతాన్ని పంచారు. గానంతో వీనుల విందు చేశారు. స్వర కల్పనతో జనాన్ని మంత్రముగ్ధుల్ని చేశారు. తేనెలూరు గళంతో పరవశింపజేశారు. సంగీత ప్రపంచానికి రారాజుగా వెలిగిపోయారు. అందుకే అమర గాయకుడయ్యారు. ఆయనే ఘంటసాల వెంకటేశ్వరరావు. ఆ మహానుభావుడు నడయాడింది.. సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నది విజయనగరం ఒడిలోనే కావడం జిల్లా ప్రజల అదృష్టం. ఆ మహాగాయకుడి 97వ జయంతి సందర్భంగా కథనమిది.

విజయనగరం టౌన్‌:ఘంటసాల వెంకటేశ్వరరావు పుట్టింది గుడివాడ సమీపంలో చౌటుపల్లి గ్రామంలో అయినప్పటికీ తండ్రి సూర్యనారాయణ కోరిక మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరానికి చేరుకున్నారు. సంగీతం నేర్చుకుందామనుకునే ఆత్రుతతో 1935 నుంచి 1942 మధ్యకాలంలో విజయనగరం చేరుకున్నారు. ఆయన వచ్చిన సమయానికి కళాశాల సెలవుల వల్ల మూసేసి ఉండటంతో ప్రిన్సిపల్‌ దగ్గరకు వెళ్లి అభ్యర్థించగా ఆయన బస చేసేందుకు అనుమతినిచ్చారు. ఘంటసాల అక్కడే ఉంటూ రోజుకో ఇంట్లో వారాల భోజనం చేస్తూ ఉండేవాడు. 

కళాశాలలోని ఏనుగుశాలలో ఘంటసాల నిద్రించిన గది
పట్రాయుని సీతారామశాస్త్రి వద్ద శిక్షణ
సంగీత కళాశాల అధ్యాపకుడు పట్రాయుని సీతారామశాస్త్రి ఘంటసాల గురించి తెలుసుకుని తన ఇంట ఉచితంగా సంగీత శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించారు.  వారాలు చేసుకుని కడుపు నింపుకొంటూ శ్రద్ధగా సంగీతాన్ని సాధన చేసేవారు. ఆ రోజుల్లో ప్రముఖ నర్తకి అయిన లక్ష్మీనరసమ్మ (కళావర్‌ రింగ్‌) ఘంటసాలను ఆదరించి, అన్నం పెట్టేది. వేసవి సెలవులు పూర్తయిన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరారు. కళాశాలలో చేరినప్పటి నుంచి సింహాచల దేవస్థానం భోజనం ఉండేది. గుమ్చీ వద్ద కూర్చొని సాధన చేసేవారు. ఆయనకు అప్పట్లో సరస్వతుల వెంకటరావుతో సాన్నిహిత్యం ఉండేది. గురువు శాస్త్రి శిక్షణలో నాలుగేళ్ల కోర్సును ఘంటసాల రెండేళ్లలో పూర్తి చేశారు. తర్వాత కొన్నేళ్లు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. గురువు కుమారుడు పట్రాయుని సంగీతరావుతో కలిసి అనేక ఆర్కెస్ట్రాల్లో పనిచేశారు. ఘంటసాల పాడిన పాటలకు ఆయన పూర్తి సహకారమందించేవారు. 

అన్నీ ఆణిముత్యాలే..
ఘంటసాలతో తరచూ పాటలు పాడించుకుని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య , బీఎన్‌ రెడ్డి తమ సినిమా అయిన స్వర్గసీమలో తొలిసారి నేపధ్య గాయకుడిగా అవకాశమిచ్చారు. ఆ పాటకు ఆయనకు రూ.116 పారితోషికం లభించింది. మూగమనసులు, మంచి మనసులు, మహాకవి కాళిదాసు, పుష్పవిలాపం, భగవద్గీత, భక్త తుకారం, గుండమ్మ కథ, కన్యాశుల్కం, డాక్టర్‌ చక్రవర్తి వంటి చిత్రాలతో పాటు అక్కడి నుంచి వరుస చిత్రాలన్నీ దాదాపుగా ఆయన పాడినవే. ఎలాంటి పాటనైనా ఘంటసాల మాత్రమే పాడగలరన్న ఖ్యాతి సంపాదించారు. మనం వింటున్న భగవద్గీత ఆ మహానుభావుడు నోట నుంచి జాలువారిందే. 1970లో ఆయనకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. 1922 డిసెంబర్‌ 4న గుడివాడ చౌటపల్లి గ్రామంలో జన్మించిన ఘంటసాల 1974 ఫిబ్రవరి 11న 51 ఏళ్ల వయసులో తమిళనాడు చెన్నైలో మృతి చెందారు. ఆయనకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలున్నారు.  

గాయకుడుమనోకి స్వర్ణకంకణ పురస్కారం
ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో ఆనందగజపతి ఆడిటోరియంలో  పద్మశ్రీ ఘంటసాల 97వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సినీ నేపధ్య గాయకుడు, డబ్బింగ్‌ కళాకారుడు, చెన్నైకి చెందిన ఎస్‌.నాగూర్‌ బాబు (మనోహర్‌) ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆయనకు కళాపీఠం తరపున స్వర్ణకంకణ పురస్కారం అందజేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల నిర్విరామ సినీ సంగీత స్వరార్చన చేస్తారు. బోల్‌బేబీ టీమ్, పాడుతా తీయగా ఫేమ్‌ లలిత, జీ సరిగమప విజేత సాయిదేవ హర్ష, వేద వాగ్దేవి, పవన్, సాయి, వర్ధమాన గాయకులు 50 మందికి పైగా కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమంలో కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ పాడేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఆ రోజు ఉదయం గంటలకు గుమ్చీ వద్ద ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేయనున్నట్టు కళాపీఠం అధ్యక్షుడు మేకా కాశీవిశ్వేశ్వరుడు తెలిపారు.  

మహా గాయకుడు
అకుంఠిత దీక్ష, పట్టుదల, కఠోర శ్రమ, నిబద్దత, గురువు వద్ద విద్యనేర్చుకోవడానికి పడే తపన ఘంటసాలను మహా గాయకుడిని చేశాయి. ఆయన జయంతిని పురస్కరించుకుని కళాశాలలో బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం.– బురిడి అనూరాధా పరశురామ్, ప్రిన్సిపల్,  మహారాజా సంగీత, నత్య కళాశాల, విజయనగరం

కళాపీఠం ఏర్పాటు
ఘంటసాల అంటే ఎంతో ఇష్టంతోనే సంగీతాభిమానులందరం కలిసి ఘంటసాల స్మారక కళాపీఠం స్థాపించాం. గుమ్చీ దగ్గర ఘంటసాల విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి నెలా ఘంటసాల ఆపాత మధురాల పేరుతో క్రమం తప్పకుండా 22 ఏళ్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.   – ఎమ్‌.భీష్మారావు,వ్యవస్ధాపకుడు, ఘంటసాల స్మారక కళాపీఠం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement