Music College
-
టీఎస్ ఎంసెట్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్– 2021 ఆన్లైన్ దరఖాస్తుల గడువును జూలై 8వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గురువారం ఓ ప్రకటనలో ఆయన సూచించారు. ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల్లో ప్రవేశాలు గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): రాష్ట్రంలోని 6 ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల్లో 2021–22 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కర్నాటిక్ సంగీతం, కూచిపూడి, కథక్ నృత్యాలు, భరతనాట్యం, సితార్, మృదంగం, వీణ, నాదస్వరం వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కనీసం 10 సంవత్సరాల వయసు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కోసం 040–24758090, భక్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కోసం 040–27801788, అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కోసం 040–23523850, విద్యా రణ్య ప్రభుత్వ సంగీత కళాశాల కోసం 87024 23628 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
‘పాట’శాల.. ఘంటసాల
తెలుగువారికి అపరిమితమైన మధురామృతాన్ని పంచారు. గానంతో వీనుల విందు చేశారు. స్వర కల్పనతో జనాన్ని మంత్రముగ్ధుల్ని చేశారు. తేనెలూరు గళంతో పరవశింపజేశారు. సంగీత ప్రపంచానికి రారాజుగా వెలిగిపోయారు. అందుకే అమర గాయకుడయ్యారు. ఆయనే ఘంటసాల వెంకటేశ్వరరావు. ఆ మహానుభావుడు నడయాడింది.. సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నది విజయనగరం ఒడిలోనే కావడం జిల్లా ప్రజల అదృష్టం. ఆ మహాగాయకుడి 97వ జయంతి సందర్భంగా కథనమిది. విజయనగరం టౌన్:ఘంటసాల వెంకటేశ్వరరావు పుట్టింది గుడివాడ సమీపంలో చౌటుపల్లి గ్రామంలో అయినప్పటికీ తండ్రి సూర్యనారాయణ కోరిక మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరానికి చేరుకున్నారు. సంగీతం నేర్చుకుందామనుకునే ఆత్రుతతో 1935 నుంచి 1942 మధ్యకాలంలో విజయనగరం చేరుకున్నారు. ఆయన వచ్చిన సమయానికి కళాశాల సెలవుల వల్ల మూసేసి ఉండటంతో ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్లి అభ్యర్థించగా ఆయన బస చేసేందుకు అనుమతినిచ్చారు. ఘంటసాల అక్కడే ఉంటూ రోజుకో ఇంట్లో వారాల భోజనం చేస్తూ ఉండేవాడు. కళాశాలలోని ఏనుగుశాలలో ఘంటసాల నిద్రించిన గది పట్రాయుని సీతారామశాస్త్రి వద్ద శిక్షణ సంగీత కళాశాల అధ్యాపకుడు పట్రాయుని సీతారామశాస్త్రి ఘంటసాల గురించి తెలుసుకుని తన ఇంట ఉచితంగా సంగీత శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించారు. వారాలు చేసుకుని కడుపు నింపుకొంటూ శ్రద్ధగా సంగీతాన్ని సాధన చేసేవారు. ఆ రోజుల్లో ప్రముఖ నర్తకి అయిన లక్ష్మీనరసమ్మ (కళావర్ రింగ్) ఘంటసాలను ఆదరించి, అన్నం పెట్టేది. వేసవి సెలవులు పూర్తయిన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరారు. కళాశాలలో చేరినప్పటి నుంచి సింహాచల దేవస్థానం భోజనం ఉండేది. గుమ్చీ వద్ద కూర్చొని సాధన చేసేవారు. ఆయనకు అప్పట్లో సరస్వతుల వెంకటరావుతో సాన్నిహిత్యం ఉండేది. గురువు శాస్త్రి శిక్షణలో నాలుగేళ్ల కోర్సును ఘంటసాల రెండేళ్లలో పూర్తి చేశారు. తర్వాత కొన్నేళ్లు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. గురువు కుమారుడు పట్రాయుని సంగీతరావుతో కలిసి అనేక ఆర్కెస్ట్రాల్లో పనిచేశారు. ఘంటసాల పాడిన పాటలకు ఆయన పూర్తి సహకారమందించేవారు. అన్నీ ఆణిముత్యాలే.. ఘంటసాలతో తరచూ పాటలు పాడించుకుని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య , బీఎన్ రెడ్డి తమ సినిమా అయిన స్వర్గసీమలో తొలిసారి నేపధ్య గాయకుడిగా అవకాశమిచ్చారు. ఆ పాటకు ఆయనకు రూ.116 పారితోషికం లభించింది. మూగమనసులు, మంచి మనసులు, మహాకవి కాళిదాసు, పుష్పవిలాపం, భగవద్గీత, భక్త తుకారం, గుండమ్మ కథ, కన్యాశుల్కం, డాక్టర్ చక్రవర్తి వంటి చిత్రాలతో పాటు అక్కడి నుంచి వరుస చిత్రాలన్నీ దాదాపుగా ఆయన పాడినవే. ఎలాంటి పాటనైనా ఘంటసాల మాత్రమే పాడగలరన్న ఖ్యాతి సంపాదించారు. మనం వింటున్న భగవద్గీత ఆ మహానుభావుడు నోట నుంచి జాలువారిందే. 1970లో ఆయనకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. 1922 డిసెంబర్ 4న గుడివాడ చౌటపల్లి గ్రామంలో జన్మించిన ఘంటసాల 1974 ఫిబ్రవరి 11న 51 ఏళ్ల వయసులో తమిళనాడు చెన్నైలో మృతి చెందారు. ఆయనకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలున్నారు. గాయకుడుమనోకి స్వర్ణకంకణ పురస్కారం ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో ఆనందగజపతి ఆడిటోరియంలో పద్మశ్రీ ఘంటసాల 97వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సినీ నేపధ్య గాయకుడు, డబ్బింగ్ కళాకారుడు, చెన్నైకి చెందిన ఎస్.నాగూర్ బాబు (మనోహర్) ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆయనకు కళాపీఠం తరపున స్వర్ణకంకణ పురస్కారం అందజేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల నిర్విరామ సినీ సంగీత స్వరార్చన చేస్తారు. బోల్‌బేబీ టీమ్, పాడుతా తీయగా ఫేమ్ లలిత, జీ సరిగమప విజేత సాయిదేవ హర్ష, వేద వాగ్దేవి, పవన్, సాయి, వర్ధమాన గాయకులు 50 మందికి పైగా కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ పాడేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఆ రోజు ఉదయం గంటలకు గుమ్చీ వద్ద ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేయనున్నట్టు కళాపీఠం అధ్యక్షుడు మేకా కాశీవిశ్వేశ్వరుడు తెలిపారు. మహా గాయకుడు అకుంఠిత దీక్ష, పట్టుదల, కఠోర శ్రమ, నిబద్దత, గురువు వద్ద విద్యనేర్చుకోవడానికి పడే తపన ఘంటసాలను మహా గాయకుడిని చేశాయి. ఆయన జయంతిని పురస్కరించుకుని కళాశాలలో బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం.– బురిడి అనూరాధా పరశురామ్, ప్రిన్సిపల్, మహారాజా సంగీత, నత్య కళాశాల, విజయనగరం కళాపీఠం ఏర్పాటు ఘంటసాల అంటే ఎంతో ఇష్టంతోనే సంగీతాభిమానులందరం కలిసి ఘంటసాల స్మారక కళాపీఠం స్థాపించాం. గుమ్చీ దగ్గర ఘంటసాల విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి నెలా ఘంటసాల ఆపాత మధురాల పేరుతో క్రమం తప్పకుండా 22 ఏళ్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – ఎమ్.భీష్మారావు,వ్యవస్ధాపకుడు, ఘంటసాల స్మారక కళాపీఠం -
శతవసంతాల కళాశాలకు మహారాజ వైభవం
విజయనగరం మహారాజా సంగీతసాహిత్య పోషణకు నిదర్శనాలు కోకొల్లలు. విజయనగరంలో ఆయన నిర్మించిన సంగీత కళాశాల నాటి కళావైభవాన్ని నేటికీ చాటుతోంది. ఒక చిన్న గాన సభగా మొదలైన ఈ కళాశాల నేటికి వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ వందేళ్లలో ఈ కళాశాల నుంచి ఎందరో కళాకారులు ఉద్భవించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరవాత 1957లో ఈ కళాశాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. విద్యార్థులంతా ఆంగ్ల విద్యవైపు మొగ్గు చూపుతుండటంతో ఒక దశాబ్ద కాలంగా ఇక్కడ చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ప్రిన్సిపాల్, ఒక టీచర్, ఒక విద్యార్థి స్థాయికి పడిపోయింది. ఐదుసంవత్సరాల ఓరియెంటల్ బిఎ చదవడానికి ఎవ్వరూ ముందుకు రాకపోతుండడంతో. కాలేజీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది.దాంతో కళాశాల ప్రిన్సిపాల్ ఉద్యమదీక్ష పూని కాలేజీ గత వైభవాన్ని పునరుద్ధరించడానికి నడుం బిగించారు. ‘‘సంస్కృతవిద్య కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అనే ఒక భ్రమ ఉంది చాలామందిలో. ఆ భ్రమను తొలగించేలా... కులమతాలకు సంబంధం లేకుండా ఇక్కడ అందరికీ ప్రవేశం’’ అని కరపత్రాలు ప్రచురించి, కళాశాల చుట్టుపక్కల ఉన్న ఐదు జిల్లాలలో పంచారు. ఈ ఒక్కమాటతో అనూహ్య స్పందన వచ్చింది. ఒకటి నుంచి నలభై రెండుకు... కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఫీజులు కట్టడంతో విద్యార్థుల సంఖ్య ఒకటి నుంచి 42కు చేరింది. ఘన చరిత్ర... ఈ కళాశాలకు విజయరామ గజపతిరాజు శ్రీకారం చుట్టారు. తన ఆస్థానంలో ఉద్యోగిగా పనిచేస్తున్న చాగంటి జోగారావుగారి కుమారుడు గంగబాబు అంధుడు. ఆ బాలుడి కోసం 1919, ఫిబ్రవరి 5వ తేదీన విజయరామ గజపతిరాజు విజయనగర గాన పాఠశాలను ఏర్పాటుచేశారు. ఆ రోజుల్లో ఆ పాఠశాలకు హరికథా పితామహుడు అజ్జాడ అదిభట్ల నారాయణదాసు అధ్యక్షులయ్యారు. అనంతరం ప్రముఖ వాయులీన విద్వాంసులు పద్మశ్రీ ద్వారం వెంకటస్వామినాయుడు అధ్యక్షులయ్యారు. టౌన్ హాల్... విజయనగరం కోట వెనుక ప్రాంతంలోని నేటి ఈ కళాశాలను అప్పట్లో టౌన్‌హాల్ అని పిలిచేవారు. దక్షిణాదిన కర్ణాటక శాస్త్రీయ సంప్రదాయాలను పరిరక్షించే ఈ కళాశాలలో వీణ, గాత్రం, వయొలిన్, మృదంగం, సన్నాయి, డోలు వాద్యాలలో శిక్షణ ఇచ్చేవారు. విచిత్రమేమిటంటే ఈకళాశాలలో నాటినుంచి నేటివరకు హరికథకు స్థానం కల్పించలేదు. ప్రముఖులు... ఘంటసాల, గాయని పి. సుశీల, నూకల చినసత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం వంటి వారంతా ఈ కళాశాల విద్యార్థులే. సినీరంగంలో సంగీత దర్శకులుగా ప్రసిద్ధులైన సాలూరి రాజేశ్వరరావు ఇక్కడ నుంచి వచ్చిన మాణిక్యమే. సంగీత చూడామణి నేదునూరి కృష్ణమూర్తి, ద్వారం సత్యనారాయణ, ద్వారం దుర్గాప్రసాదరావు ఈ కళాశాల ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తం చేశారు. వయొలిన్... పాశ్చాత్య తంత్రీ వాద్యమైన ఫిడేలును కర్ణాటక సంగీతం వాయించడం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతం చేశారు ద్వారం వెంకట స్వామినాయుడు. ఈ కళాశాల నూరేళ్లు పూర్తి చేసుకుంది. నూకల చినసత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం, ద్వారం భావనారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, బురిడి అనురాధా పరశురాం... వంటివారంతా ఈ కళాశాలకు అధ్యక్షులుగా పనిచేశారు. దూరం నుంచి వచ్చిన విద్యార్థులకు మేలు కలిగిస్తూ, ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా సంగీతోత్సవాలను అధ్యాపక, విద్యార్థి బృందాలు నిర్వహిస్తున్నాయి. సాంస్కృతిక శాఖ సహకరిస్తోంది. ఈ కళాశాలలోని సంగీత దర్బార్ ఎంతో విలక్షణమైనది. ఎందరో విద్వాంసులు ఈ కళాశాలలో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలు, భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. పదిసంవత్సరాలు నిండిన వారెవరైనా సంగీత, నృత్యాలలో ప్రవేశించడానికి అర్హులు. ప్రతి సంవత్సరం ఇక్కడ కళాపరిచయం ద్వారా శిక్షణ పొందినవారికి ఈ సంగీత, నృత్యకళాశాలలో ప్రవేశం కల్పిస్తున్నారు. పది సంవత్సరాలు నిండినవారు ఎవరైనా సంగీత, నృత్యాల్లో విద్యార్థులుగా చేరే అవకాశం ఉంది. ఒడిషా వాసులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వారికి ఇది అందుబాటులో ఉంది. ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామినాయుడు, ద్వారం నరసింగరావు నాయుడు, ద్వారం భావనారాయణరావు, నేదునూరి కృష్ణమూర్తి, శ్రీరంగం గోపాలరత్నం, ద్వారం దుర్గాప్రసాదరావు, పి.వి.యస్. శేషయ్యశాస్త్రి, బురిడి అనురాధ పరశురాం (ప్రస్తుతం) ఈ కళాశాలకు ప్రధాన ఆచార్యులుగా ఉన్నారు. – జయంతి -
శతవసంతం... కానరాని వైభవం...
వందేళ్ల సంగీత, సాహిత్య సౌరభానికి చిహ్నం... ఎందరో మహామహులనుతీర్చిదిద్దిన సరస్వతీ నిలయం... విజయనగరానికే తలమానికం...మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య ‘కళా’శాల. ఇక్కడ శతవసంత వేడుకలకుసిద్థమవడం... కళాశాలతో అనుబంధం ఉన్నవారికే గాక సంస్కృతిని ప్రేమించేప్రతిఒక్కరినీ ఆనందం కలిగించే అంశమే. ప్రతిష్టాత్మకమైన ఈ కళా నిలయంఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం, అధికారులుగొప్పగా చెప్పారు. కానీ మాటల్లో ఉన్న నిబద్ధత చేతల్లో చూపించలేకపోయారు.చివరి నిమిషంలో శతవసంతాలఉత్సవాలను తూతూమంత్రంగాజరిపించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ అవకాశాన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకోవాలని మహరాజులుజోక్యం చేసుకోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. సాక్షిప్రతినిధి, విజయనగరం: మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల పాత భవనం శిథిల స్థితికి చేరుకోవడంతో తొలుత రూ.68 లక్షలు, తర్వాత రూ.70 లక్షలు ఖర్చు చేసి ఆధునికీకరించారు. రూ.50 లక్షలతో కళావేదిక నిర్మించారు. శతవసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ అంగరంగ వైభవంగా వేడుకలు జరిపించేందుకు రూ.2కోట్లు కేటాయించారు. కానీ ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నాటకీయంగా మోసానికి పాల్పడుతోంది. చుట్టూ ఉన్న చెట్లను కొట్టేసి, తుప్పలు తొలగించి, పాత భవనానికి మెరుగులు దిద్ది, రంగులు వేసి ఆధునికీకరించేశామంటున్నా రు. ఈ కొద్దిపాటి ఫలితం కూడా తమపార్టీ వారికే దక్కాలని చూస్తోంది. ఏ పనికిఎంత ఖర్చయ్యిందనే లెక్కలు కూడా ప్రస్తుతానికి ఎవరి దగ్గరా లేవు. ఎంతైతే ఏముందిలే మునుపటి కంటే ఇప్పుడు చూడ్డానికి కళాశాల బాగా కనిపిస్తుందిలే అని సరిపెట్టుకుందాం. కనీసం వేడుకలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తామన్నారుగా అదైనా చేస్తే చాలనుకుంటే అక్కడా అదే మోసమే జరుగుతోంది. లబ్ధప్రతిష్టుల ఆగమనంపై అనుమానం ఉత్సవాలకు ఉపరాష్ట్రపతిని పిలుస్తున్నాయని, సీఎం చంద్రబాబు తప్పనిసరిగా హాజరవుతారని, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు వంటి లబ్ధప్రతిష్ట గాయకులను రప్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు వీటిలో ఏ ఒక్కటీ జరగడం లేదు. ఉపరాష్ట్రపతిని పిలవాలంటే కనీసం నెలముందైనా అనుమతి తీసుకోవాలి. సీఎం చంద్రబాబు ‘బడ్జెట్’ నేపథ్యంలో రావడం లేదు. ప్రముఖ గాయకులెవరూ తమ ప్రదర్శనలిచ్చే అవకాశం లేదు. చివరి రోజు శంకరాభరణం ఫేమ్ మంజుభార్గవి బృందం నృత్య ప్రదర్శన మాత్రం ఉంటుందని, గాయని పి.సుశీల ఆరోగ్యం సహకరిస్తే వచ్చే అవకాశం ఉందని మాత్రమే ఇప్పటి వరకూ ఉన్న సమాచారం. పోనీ విద్వాంసులనైనా రప్పిద్దామంటే వారికి అడ్వాన్సుగా ఎంతోకొంత నగదు ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.2 కోట్లలో ఒక్క రూపాయి కూడా అడ్వాన్సు ఇవ్వలేదు. దీంతో కొంత నగదును జిల్లా కలెక్టర్ ఇతర నిధుల ద్వారా సర్దుబాటు చేస్తున్నారని నిర్వాహకులు అంటున్నారు. మరోవైపు ఉత్సవాలకు మూడు రోజులే సమయమున్నా ఇంత వరకూ ఆహ్వాన పత్రికలు పంచలేదు. విశాఖపట్నంలో 3వేల ఆహ్వాన పత్రికలను ముద్రించడానికి ఆర్డరు ఇచ్చారు. అవి ఇంకా పూర్తికానే లేదు. ఎప్పుడు తీసుకువస్తారు, ఎంతమందికి పంచగలరనే ప్రశ్నకు నిర్వాహకుల వద్ద సమాధానం లేదు. ఇలాంటి పరిస్థితుల వల్ల అభాసుపాలు కాకుడా ఉండేందుకు కళాశాల సిబ్బంది నానా తంటాలు పడుతూ స్థానిక కళాకారులను, ఉపాధ్యాయినులను, విద్యార్థులను ప్రదర్శనలకు సిద్ధం చేస్తున్నారు. విగ్రహాల ఏర్పాటులో రాజకీయం 1919 ఫిబ్రవరి 5న విజయరామ గజపతిరాజు గాన పాఠశాలకు శ్రీకారం చుట్టారనే విషయం జగద్విదితం. 1953లో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిన ఈ పాఠశాల సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. కానీ వందేళ్లుగా విజయరామ గజపతిరాజు విగ్రహాన్ని కళాశాల ప్రాంగణంలో నెలకొల్పాలనే ఆలోచన చేయలేదు. ఇప్పటికైనా ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టడం, ఎంఆర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ ఏవీడీ శర్మ ఆ విగ్రహాం తయారీకి అయ్యే ఖర్చును భరించడానికి ముందుకు రావడం శుభపరిణామం. అయితే విగ్రహం ఏర్పాటు చేయడానికి ఎంచుకున్న ప్రదేశమే ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. కళాశాల భవనానికి కుడివైపున కళాశాల తొలి ప్రిన్సిపల్, హరికథాపితామహుడు ఆదిభట్ల నారాయణదాసు నిలువెత్తు కాంస్యవిగ్రహం, ఆ పక్కనే సంగీత సరస్వతి విగ్రహం కొలువై ఉన్నాయి. వారి జతన విజయరామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, లేదా కొత్తగా నిర్మిస్తున్న కళావేదిక వద్ద ఏర్పాటు చేయడం సమంజసం. పైగా ప్రభుత్వ నిధులతో నిర్మితమవుతున్న కళావేదికకు కూడా విజయరామ గజపతిరాజు పేరునే పెడుతున్నారు. అలాంటప్పుడు ఆ వేదిక వద్దనే ఆయన విగ్రహం కూడా ఉంటే వేదికపైకి వెళ్లి తమ కళను ప్రదర్శించాలనుకునే కళాకారులెవరైనా ముందుగా ఆయన విగ్రహాన్ని చూసి, నమస్కరించి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇంతటి మహాకళాశాలకు శ్రీకారం చుట్టిన ఆ మహారాజుకు అది నిజమైన నివాళిగా మిగులుతుందని కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఎంతగా చెప్పినప్పటికీ ఆ విగ్రహాన్ని కళాశాల భవనం ఎదురుగా, మెట్ల వద్ద ఏర్పాటు చేయాలని రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చారు. వారు చెప్పింది పాటించడం మినహా మారు మాట్లాడలేని పరిస్థితుల్లో సంగీత కళాశాల సిబ్బంది మౌనం వహించారు. కళాశాల ఎదురుగా సంగీత సరస్వతి విగ్రహాన్నే స్థాపించలేదని, అలాంటిది రాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కళాశాల ముఖ చిత్రాన్నే మార్చేస్తున్నారని వారు లోలోన మదనపడుతున్నారు. ఇక కళాశాల భవనానికి ఇరువైపులా విశ్వగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు, వయోలిన్ విద్యాంసులు, కళాశాల రెండవ ప్రిన్సిపల్ ద్వారం వెంకట స్వామినాయుడుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర, భాషా సాంస్కృతిక శాఖ చెప్పినప్పటికీ సకాలంలో ఆ విగ్రహాలను అందించలేమంటూ తాజాగా చేతులెత్తేసింది. -
‘షరీక్’ హోజాయ్!
ఎంటర్టైన్మెంట్ ‘చిరుసవ్వడి-పెను ఘోష’ పియానో ప్రత్యేకత! సమకాలీన పియానిస్ట్లలో వరల్డ్‌క్లాస్ ఆర్టిస్ట్ షరీక్ హసన్. పియానోకు హిందుస్తానీ రాగాలనూ నేర్పాడు! ఫ్రాన్స్, అమెరికాలలో టాప్ మ్యూజిక్ కాలేజీల్లో జాజ్ సంగీతం నేర్చుకున్నాడు. బ్లూస్-పాప్-హిందుస్తానీ క్లాసిక్స్‌తో తనదైన ‘ట్యూన్’ సాధించాడు! హసన్ నేతృత్వంలో ఏర్పడిన - నెదర్లాండ్‌కు చెందిన ట్రంపెటీర్ ఫిలిప్ లెమ్-రోమ్కు చెందిన బాస్ వాద్య నిపుణుడు మార్కొ జెనిని-ఇండియాకు చెందిన శాక్సాఫోనిస్ట్ పవన్ బెంజిమిన్లు ‘షరీక్ హసన్ క్వార్టెట్’ గా ఏర్పడ్డారు! ఫ్రాన్స్, యుఎస్లలో మ్యూజిక్ లవర్స్‌ను ‘క్వార్టెట్’ ఫ్లాట్ చేసేసింది! రచ్చ గెలిచిన ఆ రాగాలను ఇంట విన్పించేందుకు ఇండియా టూర్ చేస్తున్నాడు షరీక్! జూన్ 19న ముంబైలో ‘వోవ్’లు అందుకున్న ‘క్వార్టెట్’ నగరానికి ‘మాన్సూన్ రెగెటా’ (రాగ వర్షాలు) తెస్తోంది! అంతేనా? మ్యూజిక్ లవర్స్ హసన్ హసన్ టీంతో షరీకయ్యే ఛాన్స్ కూడా ఉంది! 2న ‘హెచ్ిపీఎస్’లో వర్క్‌షాప్ యంగ్ మ్యుజీషియన్స్‌ను ఎంకరేజ్ చేసేందుకు హసన్ నేతృత్వంలోని ‘జాజ్ ట్రియో’ హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్లో (హెచ్‌పిఎస్) జులై 2వ తేదీ సాయంత్రం 2-30 గంటల నుంచి 4-30 గంటల వరకూ వర్క్‌షాప్‌లో పాల్గొంటోంది. బాస్, డ్రమ్స్, పియానోలలో ఆసక్తి ఉన్నవారు, వీలైతే తమ సంగీత పరికరాలను తెచ్చుకుని వరల్డ్ ఫేం ట్రియోకు తమ ప్రావీణ్యతను ప్రదర్శించవచ్చు. సందేహాలను తీర్చుకోవచ్చు. సలహాలను గ్రహించవచ్చు. ఈ అవకాశాన్ని హైద్రాబాద్ వెస్ట్రన్ మ్యూజిక్ ఫౌండేషన్-గోథె జంత్రమ్ నగర యువతకు ఉచితంగా కల్పిస్తోంది. 3న మారియట్‌లో ‘క్వార్టెట్’ నలుగురు సభ్యుల మ్యూజికల్ బృందాన్ని క్వార్టెట్ అంటారు. హసన్ నేతృత్వంలో ఏర్పడిన - నెదర్లాండ్‌కు చెందిన ట్రంపెటీర్ ఫిలిప్ లెమ్-రోమ్కు చెందిన బాస్ వాద్య నిపుణుడు మార్కొ జెనిని-ఇండియాకు చెందిన శాక్సాఫోనిస్ట్ పవన్ బెంజిమిన్ల ‘షరీక్ హసన్ క్వార్టెట్’ ట్యాంక్‌బండ్ సమీపంలోని మారియట్ హోటల్లో 3వ తేదీ సాయంత్రం 7.30 గంటల నుంచి మాన్సూన్ జాజ్ విన్పించనుంది. హెదరాబాద్ యాచ్ క్లబ్, స్పోర్ట్స్ యాక్టివిటీస్‌కి సహాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డోనర్ పాస్ (రూ.2,500-1000-250)లను ఆన్లైన్లో జ్ట్టిఞ://జీ.ఛౌౌజుఝడటజిౌఠీ.ఛిౌఝ/జిడఛ్ఛీట్చఛ్చఛీ గానీ, 040-23350473 నెంబర్‌కు ఫోన్ చేసి కానీ పొందవచ్చు. షక్కర్ కే పాంచ్ దానే రాజ్‌కుమార్ ... అతని కుటుంబంలోని నలుగురు వ్యక్తులు, ఒక ట్రక్కువాలా, ఐదు చక్కెర గుళికల చుట్టూ తిరిగే కథే షక్కర్ కే పాంచ్ దానే. మానవ్ కౌల్ దీనిని రూపొందించి, దర్శకత్వం వహించారు. సంగీతం కూడా అందించారు. కృష్ణ శుక్ల లైటింగ్ ఈ నాటికకు ప్రత్యేక ఆకర్షణ. సిద్ధేశ్ ధర్మాధికారి గంటపాటు ప్రదర్శించే ఈ హిందీ స్వగతం ఆలోచింపజేస్తుంది. వేదిక : లామకాన్, బంజారాహిల్స్ సమయం : జులై 1,2 తేదీల్లో, రాత్రి 8 గంటలకు