విజయనగరం మహారాజా సంగీతసాహిత్య పోషణకు నిదర్శనాలు కోకొల్లలు. విజయనగరంలో ఆయన నిర్మించిన సంగీత కళాశాల నాటి కళావైభవాన్ని నేటికీ చాటుతోంది. ఒక చిన్న గాన సభగా మొదలైన ఈ కళాశాల నేటికి వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ వందేళ్లలో ఈ కళాశాల నుంచి ఎందరో కళాకారులు ఉద్భవించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరవాత 1957లో ఈ కళాశాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. విద్యార్థులంతా ఆంగ్ల విద్యవైపు మొగ్గు చూపుతుండటంతో ఒక దశాబ్ద కాలంగా ఇక్కడ చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ప్రిన్సిపాల్, ఒక టీచర్, ఒక విద్యార్థి స్థాయికి పడిపోయింది.
ఐదుసంవత్సరాల ఓరియెంటల్ బిఎ చదవడానికి ఎవ్వరూ ముందుకు రాకపోతుండడంతో. కాలేజీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది.దాంతో కళాశాల ప్రిన్సిపాల్ ఉద్యమదీక్ష పూని కాలేజీ గత వైభవాన్ని పునరుద్ధరించడానికి నడుం బిగించారు. ‘‘సంస్కృతవిద్య కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అనే ఒక భ్రమ ఉంది చాలామందిలో. ఆ భ్రమను తొలగించేలా... కులమతాలకు సంబంధం లేకుండా ఇక్కడ అందరికీ ప్రవేశం’’ అని కరపత్రాలు ప్రచురించి, కళాశాల చుట్టుపక్కల ఉన్న ఐదు జిల్లాలలో పంచారు. ఈ ఒక్కమాటతో అనూహ్య స్పందన వచ్చింది.
ఒకటి నుంచి నలభై రెండుకు...
కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఫీజులు కట్టడంతో విద్యార్థుల సంఖ్య ఒకటి నుంచి 42కు చేరింది.
ఘన చరిత్ర...
ఈ కళాశాలకు విజయరామ గజపతిరాజు శ్రీకారం చుట్టారు. తన ఆస్థానంలో ఉద్యోగిగా పనిచేస్తున్న చాగంటి జోగారావుగారి కుమారుడు గంగబాబు అంధుడు. ఆ బాలుడి కోసం 1919, ఫిబ్రవరి 5వ తేదీన విజయరామ గజపతిరాజు విజయనగర గాన పాఠశాలను ఏర్పాటుచేశారు. ఆ రోజుల్లో ఆ పాఠశాలకు హరికథా పితామహుడు అజ్జాడ అదిభట్ల నారాయణదాసు అధ్యక్షులయ్యారు. అనంతరం ప్రముఖ వాయులీన విద్వాంసులు పద్మశ్రీ ద్వారం వెంకటస్వామినాయుడు అధ్యక్షులయ్యారు.
టౌన్ హాల్...
విజయనగరం కోట వెనుక ప్రాంతంలోని నేటి ఈ కళాశాలను అప్పట్లో టౌన్‌హాల్ అని పిలిచేవారు. దక్షిణాదిన కర్ణాటక శాస్త్రీయ సంప్రదాయాలను పరిరక్షించే ఈ కళాశాలలో వీణ, గాత్రం, వయొలిన్, మృదంగం, సన్నాయి, డోలు వాద్యాలలో శిక్షణ ఇచ్చేవారు. విచిత్రమేమిటంటే ఈకళాశాలలో నాటినుంచి నేటివరకు హరికథకు స్థానం కల్పించలేదు.
ప్రముఖులు...
ఘంటసాల, గాయని పి. సుశీల, నూకల చినసత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం వంటి వారంతా ఈ కళాశాల విద్యార్థులే. సినీరంగంలో సంగీత దర్శకులుగా ప్రసిద్ధులైన సాలూరి రాజేశ్వరరావు ఇక్కడ నుంచి వచ్చిన మాణిక్యమే. సంగీత చూడామణి నేదునూరి కృష్ణమూర్తి, ద్వారం సత్యనారాయణ, ద్వారం దుర్గాప్రసాదరావు ఈ కళాశాల ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తం చేశారు.
వయొలిన్...
పాశ్చాత్య తంత్రీ వాద్యమైన ఫిడేలును కర్ణాటక సంగీతం వాయించడం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతం చేశారు ద్వారం వెంకట స్వామినాయుడు. ఈ కళాశాల నూరేళ్లు పూర్తి చేసుకుంది. నూకల చినసత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం, ద్వారం భావనారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, బురిడి అనురాధా పరశురాం... వంటివారంతా ఈ కళాశాలకు అధ్యక్షులుగా పనిచేశారు. దూరం నుంచి వచ్చిన విద్యార్థులకు మేలు కలిగిస్తూ, ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా సంగీతోత్సవాలను అధ్యాపక, విద్యార్థి బృందాలు నిర్వహిస్తున్నాయి.
సాంస్కృతిక శాఖ సహకరిస్తోంది. ఈ కళాశాలలోని సంగీత దర్బార్ ఎంతో విలక్షణమైనది. ఎందరో విద్వాంసులు ఈ కళాశాలలో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలు, భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. పదిసంవత్సరాలు నిండిన వారెవరైనా సంగీత, నృత్యాలలో ప్రవేశించడానికి అర్హులు. ప్రతి సంవత్సరం ఇక్కడ కళాపరిచయం ద్వారా శిక్షణ పొందినవారికి ఈ సంగీత, నృత్యకళాశాలలో ప్రవేశం కల్పిస్తున్నారు.
పది సంవత్సరాలు నిండినవారు ఎవరైనా సంగీత, నృత్యాల్లో విద్యార్థులుగా చేరే అవకాశం ఉంది. ఒడిషా వాసులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వారికి ఇది అందుబాటులో ఉంది. ఆదిభట్ల నారాయణదాసు, ద్వారం వెంకటస్వామినాయుడు, ద్వారం నరసింగరావు నాయుడు, ద్వారం భావనారాయణరావు, నేదునూరి కృష్ణమూర్తి, శ్రీరంగం గోపాలరత్నం, ద్వారం దుర్గాప్రసాదరావు, పి.వి.యస్. శేషయ్యశాస్త్రి, బురిడి అనురాధ పరశురాం (ప్రస్తుతం) ఈ కళాశాలకు ప్రధాన ఆచార్యులుగా ఉన్నారు.
– జయంతి
Comments
Please login to add a commentAdd a comment