మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ముఖద్వారం
వందేళ్ల సంగీత, సాహిత్య సౌరభానికి చిహ్నం... ఎందరో మహామహులనుతీర్చిదిద్దిన సరస్వతీ నిలయం... విజయనగరానికే తలమానికం...మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య ‘కళా’శాల. ఇక్కడ శతవసంత వేడుకలకుసిద్థమవడం... కళాశాలతో అనుబంధం ఉన్నవారికే గాక సంస్కృతిని ప్రేమించేప్రతిఒక్కరినీ ఆనందం కలిగించే అంశమే. ప్రతిష్టాత్మకమైన ఈ కళా నిలయంఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం, అధికారులుగొప్పగా చెప్పారు. కానీ మాటల్లో ఉన్న నిబద్ధత చేతల్లో చూపించలేకపోయారు.చివరి నిమిషంలో శతవసంతాలఉత్సవాలను తూతూమంత్రంగాజరిపించేందుకు రంగం సిద్ధం చేశారు.
ఈ అవకాశాన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకోవాలని మహరాజులుజోక్యం చేసుకోవడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
సాక్షిప్రతినిధి, విజయనగరం: మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల పాత భవనం శిథిల స్థితికి చేరుకోవడంతో తొలుత రూ.68 లక్షలు, తర్వాత రూ.70 లక్షలు ఖర్చు చేసి ఆధునికీకరించారు. రూ.50 లక్షలతో కళావేదిక నిర్మించారు. శతవసంతాలు పూర్తి చేసుకుంటున్న వేళ అంగరంగ వైభవంగా వేడుకలు జరిపించేందుకు రూ.2కోట్లు కేటాయించారు. కానీ ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నాటకీయంగా మోసానికి పాల్పడుతోంది. చుట్టూ ఉన్న చెట్లను కొట్టేసి, తుప్పలు తొలగించి, పాత భవనానికి మెరుగులు దిద్ది, రంగులు వేసి ఆధునికీకరించేశామంటున్నా రు. ఈ కొద్దిపాటి ఫలితం కూడా తమపార్టీ వారికే దక్కాలని చూస్తోంది. ఏ పనికిఎంత ఖర్చయ్యిందనే లెక్కలు కూడా ప్రస్తుతానికి ఎవరి దగ్గరా లేవు. ఎంతైతే ఏముందిలే మునుపటి కంటే ఇప్పుడు చూడ్డానికి కళాశాల బాగా కనిపిస్తుందిలే అని సరిపెట్టుకుందాం. కనీసం వేడుకలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తామన్నారుగా అదైనా చేస్తే చాలనుకుంటే అక్కడా అదే మోసమే జరుగుతోంది.
లబ్ధప్రతిష్టుల ఆగమనంపై అనుమానం
ఉత్సవాలకు ఉపరాష్ట్రపతిని పిలుస్తున్నాయని, సీఎం చంద్రబాబు తప్పనిసరిగా హాజరవుతారని, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు వంటి లబ్ధప్రతిష్ట గాయకులను రప్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు వీటిలో ఏ ఒక్కటీ జరగడం లేదు. ఉపరాష్ట్రపతిని పిలవాలంటే కనీసం నెలముందైనా అనుమతి తీసుకోవాలి. సీఎం చంద్రబాబు ‘బడ్జెట్’ నేపథ్యంలో రావడం లేదు.
ప్రముఖ గాయకులెవరూ తమ ప్రదర్శనలిచ్చే అవకాశం లేదు. చివరి రోజు శంకరాభరణం ఫేమ్ మంజుభార్గవి బృందం నృత్య ప్రదర్శన మాత్రం ఉంటుందని, గాయని పి.సుశీల ఆరోగ్యం సహకరిస్తే వచ్చే అవకాశం ఉందని మాత్రమే ఇప్పటి వరకూ ఉన్న సమాచారం. పోనీ విద్వాంసులనైనా రప్పిద్దామంటే వారికి అడ్వాన్సుగా ఎంతోకొంత నగదు ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.2 కోట్లలో ఒక్క రూపాయి కూడా అడ్వాన్సు ఇవ్వలేదు. దీంతో కొంత నగదును జిల్లా కలెక్టర్ ఇతర నిధుల ద్వారా సర్దుబాటు చేస్తున్నారని నిర్వాహకులు అంటున్నారు. మరోవైపు ఉత్సవాలకు మూడు రోజులే సమయమున్నా ఇంత వరకూ ఆహ్వాన పత్రికలు పంచలేదు. విశాఖపట్నంలో 3వేల ఆహ్వాన పత్రికలను ముద్రించడానికి ఆర్డరు ఇచ్చారు. అవి ఇంకా పూర్తికానే లేదు. ఎప్పుడు తీసుకువస్తారు, ఎంతమందికి పంచగలరనే ప్రశ్నకు నిర్వాహకుల వద్ద సమాధానం లేదు. ఇలాంటి పరిస్థితుల వల్ల అభాసుపాలు కాకుడా ఉండేందుకు కళాశాల సిబ్బంది నానా తంటాలు పడుతూ స్థానిక కళాకారులను, ఉపాధ్యాయినులను, విద్యార్థులను ప్రదర్శనలకు సిద్ధం చేస్తున్నారు.
విగ్రహాల ఏర్పాటులో రాజకీయం
1919 ఫిబ్రవరి 5న విజయరామ గజపతిరాజు గాన పాఠశాలకు శ్రీకారం చుట్టారనే విషయం జగద్విదితం. 1953లో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిన ఈ పాఠశాల సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. కానీ వందేళ్లుగా విజయరామ గజపతిరాజు విగ్రహాన్ని కళాశాల ప్రాంగణంలో నెలకొల్పాలనే ఆలోచన చేయలేదు. ఇప్పటికైనా ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టడం, ఎంఆర్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ ఏవీడీ శర్మ ఆ విగ్రహాం తయారీకి అయ్యే ఖర్చును భరించడానికి ముందుకు రావడం శుభపరిణామం. అయితే విగ్రహం ఏర్పాటు చేయడానికి ఎంచుకున్న ప్రదేశమే ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. కళాశాల భవనానికి కుడివైపున కళాశాల తొలి ప్రిన్సిపల్, హరికథాపితామహుడు ఆదిభట్ల నారాయణదాసు నిలువెత్తు కాంస్యవిగ్రహం, ఆ పక్కనే సంగీత సరస్వతి విగ్రహం కొలువై ఉన్నాయి. వారి జతన విజయరామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, లేదా కొత్తగా నిర్మిస్తున్న కళావేదిక వద్ద ఏర్పాటు చేయడం సమంజసం.
పైగా ప్రభుత్వ నిధులతో నిర్మితమవుతున్న కళావేదికకు కూడా విజయరామ గజపతిరాజు పేరునే పెడుతున్నారు. అలాంటప్పుడు ఆ వేదిక వద్దనే ఆయన విగ్రహం కూడా ఉంటే వేదికపైకి వెళ్లి తమ కళను ప్రదర్శించాలనుకునే కళాకారులెవరైనా ముందుగా ఆయన విగ్రహాన్ని చూసి, నమస్కరించి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇంతటి మహాకళాశాలకు శ్రీకారం చుట్టిన ఆ మహారాజుకు అది నిజమైన నివాళిగా మిగులుతుందని కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఎంతగా చెప్పినప్పటికీ ఆ విగ్రహాన్ని కళాశాల భవనం ఎదురుగా, మెట్ల వద్ద ఏర్పాటు చేయాలని రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చారు. వారు చెప్పింది పాటించడం మినహా మారు మాట్లాడలేని పరిస్థితుల్లో సంగీత కళాశాల సిబ్బంది మౌనం వహించారు. కళాశాల ఎదురుగా సంగీత సరస్వతి విగ్రహాన్నే స్థాపించలేదని, అలాంటిది రాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కళాశాల ముఖ చిత్రాన్నే మార్చేస్తున్నారని వారు లోలోన మదనపడుతున్నారు. ఇక కళాశాల భవనానికి ఇరువైపులా విశ్వగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు, వయోలిన్ విద్యాంసులు, కళాశాల రెండవ ప్రిన్సిపల్ ద్వారం వెంకట స్వామినాయుడుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర, భాషా సాంస్కృతిక శాఖ చెప్పినప్పటికీ సకాలంలో ఆ విగ్రహాలను అందించలేమంటూ తాజాగా చేతులెత్తేసింది.
Comments
Please login to add a commentAdd a comment