- చురుగ్గా మౌలిక వసతుల అభివృద్ధి పనులు
- సెప్టెంబర్‌కల్లా పూర్తి చేయాలని పీవో ఆదేశం
పాడేరు: ఏజెన్సీలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయిన ఆదివాసీ గ్రామాల్లో సమగ్ర సామాజికాభివృద్ధి పథకం (సీసీడీపీ) వెలుగులు నింపుతోంది. మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నాటి మంత్రి పి.బాలరాజు చొరవతో మొదటి విడతగా 64 ఆదివాసీ గ్రామాలకు రూ.19 కోట్లు మంజూరయ్యాయి.
ఈ నిధులతో సామాజిక భవనాలు, డీఆర్ డిపోలు, సీసీ రోడ్లు, తాగునీటి పథకాల పనులకు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు తయారుచేశారు. అయితే ఈలోగా సార్వత్రిక ఎన్నికల నియమావళి (కోడ్) అమల్లోకి రావడంతో నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఎన్నికలు ముగియగానే గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులు ఏజెన్సీలోని 11 మండలాల పరిధిలో ఎంపిక చేసిన 64 గ్రామాల్లోనూ అభివృద్ధి పనులు ప్రారంభించారు. మండల ప్రత్యేక అధికారులు కూడా ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
పాడేరు మండలంలోని డల్లాపల్లి, జీడిపగడ, ఎగుసొలముల, పిల్లిపుట్టు గ్రామాలకు రూ. 1.18 కోట్లు, అనంతగిరి మండలంలోని మూడు గ్రామాలకు రూ.78 లక్షలు, అరకులోయ మండలంలోని ఆరు గ్రామాలకు రూ. 1.80 కోట్లు, డుంబ్రిగుడలోని రెండు గ్రామాలకు రూ. 78 లక్షలు, పెదబయలు మండలంలోని 8 గ్రామాలకు రూ. 1.85 కోట్లు, ముంచంగిపుట్టు మండలంలో పది గ్రామాలకు రూ. 3.70 కోట్లు, జి.మాడుగుల మండలంలోని ఆరు గ్రామాలకు రూ. 2.2 కోట్లు, చింతపల్లిలో ఆరు గ్రామాలకు రూ. 2 కోట్లు, జీకేవీధి మండలంలో 10 గ్రామాలకు రూ. 2.41 కోట్లు, కొయ్యూరు మండలంలోని 4 గ్రామాలకు రూ. 1.34 కోట్లతో తలపెట్టిన వివిధ నిర్మాణ పనులు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి. సెప్టెంబర్ నాటికి ఇవన్నీ పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ ఇంజనీరింగ్ అధికారులకు నిర్దేశించారు.